రైతులను ముంచింది బాబే: ఆగష్టు 2, 2012

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట ధ్వజం
నాడు నీరు కావాలన్న కృష్ణా డెల్టా రైతుకు తగిన శాస్తి జరిగిందన్నది చంద్రబాబు కాదా?
కృష్ణా డెల్టా నీరు పులివెందులకు వెళ్తుందంటూ తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారు
ఆ నీరు పులివెందులకు వెళ్లినట్లు మీరు చూపించగలరా?
బాబు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారుతొమ్మిదేళ్ల పాలనలో రైతులను, వ్యవసాయ రంగాన్ని న ట్టేట ముంచిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇపుడు విజయవాడకు వెళ్లి కృష్ణా డెల్టా రైతులపై ప్రేమ ఒలకబోస్తూ మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యుడు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. బుధవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘1999లో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో విజయవాడ పర్యటనకు వెళ్లినప్పుడు.. అక్కడ కృష్ణా డెల్టాకు చెందిన ఓ రైతు తమ పైర్లు ఎండిపోతున్నాయని, పంటకు నీళ్లు వదలాలని వేడుకున్నాడు. అయితే చంద్రబాబు.. పిచ్చి పిచ్చిగా ఉందా.. రెండో పంట వేసుకోవద్దు, వద్దు అంటే ఎందుకు వేసుకున్నావు? సరైన శాస్తి జరిగింది.ఇప్పటికైనా నీకు బుద్ధి వస్తుంది’ అని ఆయన దురుసుగా మాట్లాడారని గుర్తు చేశారు. అప్పట్లో బాబు రైతును కసురుకున్న విషయాన్ని టీడీపీని గట్టిగా సమర్థించే పత్రికే ప్రముఖంగా ప్రచురించిందని శ్రీకాంత్‌రెడ్డి ఆ పత్రికా క్లిప్పింగ్‌ను చూపించారు. ‘నాడు రైతులను అలా తూలనాడిన వ్యక్తి ఈ రోజు విజయవాడకు పోయి.. కృష్ణా డెల్టాకు నీళ్లు రాకపోవడానికి కారణం.. పులివెందులకు ఆ నీరు తరలించుకుపోవడమేనంటూ తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారు’ అని విమర్శించారు. బాబు ఒక ప్రాంతానికి వెళ్లి.. మరో ప్రాంతానికి వ్యతిరేకంగా మాట్లాడటం ద్వారా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ దిగజారుడు రాజకీయాలను చేస్తున్నారని దుయ్యబట్టారు. పులివెందులకు కృష్ణా డెల్టా నీరు వెళ్లినట్లు చంద్రబాబు చూపించగలరా అని నిలదీశారు. పీబీసీ(పులివెందుల బ్రాంచ్ కెనాల్) నుంచి నీళ్లు రాక చీనీ తోటలు ఎండిపోయి పులివెందుల రైతులు విలవిలలాడుతూ ఉంటే బాబు అసత్యాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.సాగునీటి ప్రాజెక్టులను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారు..
చంద్రబాబు తన పాలనలో అన్ని ప్రాంతాలకూ అన్యాయం చేశారని గడికోట విమర్శించారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు సాగునీటి ప్రాజెక్టులకూ రాబడికీ ముడిపెట్టి మాట్లాడి.. వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. నీటి విలువ తెలుసు కనుకే.. వై.ఎస్.రాజశేఖరరెడ్డి భారీ ఎత్తున జలయజ్ఞం చేపట్టి రూ.52 వేల కోట్లతో పలు ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నారని చెప్పారు. ‘రైతులకు సాయం చేయాలనుకున్నప్పుడు వైఎస్ ఏనాడూ డబ్బుకు ముడి పెట్టలేదు. రాబడి గురించి ఆలోచించలేదు. ఎన్టీఆర్ ప్రారంభించి వదలివేసిన తెలుగుగంగకు రూ.1,500 కోట్లను కేటాయించారు. గండికోట వంటి ప్రాజెక్టులు వైఎస్ నిర్మించినందువల్ల కృష్ణా ట్రిబ్యునల్‌లో రాష్ట్రానికి మరో 30 టీఎంసీల నికర జలాలు లభించాయి’ అని ఆయన వివరించారు. చంద్రబాబు తన పాలనలో కొన్ని ప్రాజెక్టులనైనా నిర్మించి ఉంటే.. మరో వంద టీఎంసీల నికర జలాలు మన రాష్ట్రానికి దక్కి ఉండేవని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. ‘ఫోన్ల మీదనే ప్రధానులనూ రాష్ట్రపతులనూ చేశానని చంద్రబాబు ప్రగల్భాలు పలికారు.అప్పట్లో ఎప్పుడూ నిద్రపోతూ కనిపించిన ప్రధాని దేవెగౌడ కర్ణాటకలో ప్రాజెక్టులను గుట్టు చప్పుడు కాకుండా నిర్మించుకుంటుంటే బాబు ఏమీ చేయలేకపోయారు’ అని శ్రీకాంత్ విమర్శించారు. బాబు సీఎంగా ఉన్నప్పుడే.. 2004కు ముందే.. మన రాష్ట్రానికి నీళ్లు రాకుండా కర్ణాటక, మహారాష్ట్రల్లో ఆయాప్రభుత్వాలు ప్రాజెక్టులు నిర్మించుకున్న విషయం వాస్తవం కాదా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీరాంసాగర్‌కు వరద నీరు రాక పోవడానికి కారణం.. బాబు హయాంలో మహారాష్ట్రలో ప్రాజెక్టులు కట్టడం కాదా? రాష్ట్రం ఎడారి అవుతుంటే.. ఢిల్లీలో చక్రం తిప్పుతున్నానంటూ మురిసిపోవడం బాబు తప్పు కాదా? అని నిలదీశారు. రాష్ట్ర రైతాంగానికి అవసరమైన ప్రాణహిత-చేవెళ్ల, పోలవరం ప్రాజెక్టులను బాబు విస్మరించి.. ఇంకుడు గుంతలు, నీరు మీరు వంటి వృథా కార్యక్రమాలతో కాలయాపన చేశారన్నారు.వైఎస్ బొమ్మపై కాదు.. పథకాలపై ప్రేమ చూపించండి..కాంగ్రెస్‌లో వైఎస్ బొమ్మ ఉండాలని కొందరు, వద్దని మరికొందరు డ్రామాలాడుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేవీపీ రామచంద్రరావు కోవర్టు అని కొందరు కాంగ్రెస్ నాయకులు ఆరోపించడాన్ని ప్రస్తావించగా.. మంత్రులను కూడా కోవర్టులంటూ ఒకరిపై మరొకరికి నమ్మకం లేకుండా ఈ ప్రభుత్వం మనుగడ సాగిస్తోందన్నారు. వైఎస్‌పై నిజంగా ప్రేమ ఉంటే చూపించాల్సింది ఆయన బొమ్మపై కాదని.. ఆయన పథకాల అమలుపైనని చెప్పారు. కేవీపీ వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వస్తే ఆహ్వానిస్తారా అని ప్రశ్నించగా.. ప్రజల్లో ప్రతిష్ట ఉన్న వ్యక్తులు ఎవరొచ్చినా ఆహ్వానిస్తామన్నారు. వైఎస్ మరణించాక ఆయన కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తూ ఆయన కుమారుడిని జైల్లో పెట్టిన వారికి ఇంకా ఆయన గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పారు.

తాజా ఫోటోలు

Back to Top