‘రామ్ రామ్ బియా’ (నమస్తే అన్న): షర్మిల

నేలకొండపల్లి (ఖమ్మం జిల్లా) : ‘రామ్ రా‌మ్ బియా’ (నమస్తే అన్న) అంటూ ఖమ్మం జిల్లాలో మూ‌డవ రోజు బుధవారం శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు. లంబాడ గిరిజనులను ఆమె ఆప్యాయంగా పలకరించారు. ఎదురొచ్చి కష్టాలు చెప్పుకున్న వారినీ ఆమె ఓదార్చారు. కష్టాలు... కన్నీళ్లు ఇంకెంతో కాలం ఉండవు... రాబోయే రాజన్న రాజ్యంలో.. జగనన్న పాలనలో మన బాధలన్నీ తొలగుతాయి.. అంతవరకూ ఓపిక పట్టండి.. అంటూ శ్రీమతి షర్మిల ముందుకు కదిలారు. మహానేత రాజన్న బిడ్డకు నేలకొండపల్లి జనం అడుగడుగునా నీరాజనాలు పట్టారు.

విజయమ్మ మా ఇంటి బిడ్డ: దంపతుల హర్షం :
'మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి తనయ వచ్చి తన తల్లి పేరు మా బిడ్డకు పెట్టడం మమ్మల్ని ఆనందపరవశులను చేసింది' అని భైరవునిపల్లికి చెందిన ప్రియాంక, నర్సయ్య దంపతులు హర్షం వ్యక్తంచేశారు. 'శ్రీమతి షర్మిల చేతికి మా పాపను ఇచ్చి.. నామకరణం చేయాలని కోరాం. విజయమ్మ పేరు పెట్టడంతో మా ఆనందానికి అంతే లేకుండాపోయింది. మా ఇంట్లో పుట్టిన మా లక్ష్మికి విజయమ్మ పేరు పెట్టిన ఆ తల్లి చల్లగా ఉండాలి' అని పాప తల్లిదండ్రులు ఆకాంక్షించారు. పేరు పెట్టిన అనంతరం శ్రీమతి షర్మిల ఆ దంపతులను ‘మంచిగా ఉండండి..చల్లగా ఉండండి..గాడ్ బ్లె‌స్‌ యూ.. గాడ్ బ్లె‌స్‌యూ..’ అని దీవించారు.

కరెంటు కష్టాలు తీరుస్తాం :
‘అమ్మా ఈ సారి సాగర్ కాలువ రాలేదు.. బోరు బావులలో నీళ్లు ఉన్నా పంటలకు నీరు పెడదామంటే కరెంట్ ఉండటం లేదు... రోజుకు మూడు గంటలు కరెంట్ ఇస్తున్నారు. ఉన్న అ‌ర ఎకరం పొలానికి నీరు సరిపోవడం లేదు. తిండి గింజలు పండుతాయని ఆశపడి రూ.7 వేలు పెట్టుబడి పెట్టి పొలం వేశాం. ఇప్పుడు కరెంట్ లేక పంటలు పూర్తిగా ఎండిపోయాయి. మళ్లీ మీరు వస్తేనే మాకు మంచి జరుగుతుందని ఆశపడుతున్నాం’ అని నేలకొండపల్లి మండలం తిరుమలాపురం తండాకు చెందిన మహిళా రైతు కుక్కల రత్తమ్మ శ్రీమతి షర్మిల‌ వద్ద గోడు చెప్పుకున్నారు. ఆమె బాధ ఆలకించిన శ్రీమతి షర్మిల ‘మనకూ మంచి రోజులు వస్తాయి... అధైర్య పడకండి... జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తాం..’ అని భరోసా ఇచ్చారు.

అజయ్‌ తండా వాసుల ఆనందం :
‘రామ్ రా‌మ్ బియా...’ అంటూ‌ శ్రీమతి షర్మిల చేసిన అభివాదానికి నేలకొండపల్లి మండలం అజయ్‌తండా వాసులు పులకించిపోయారు. మరో ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా అజయ్‌తండాలో మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్ విగ్రహాన్ని శ్రీమతి షర్మిల ఆవిష్కరించారు. ఆ సందర్భంగా శ్రీమతి షర్మిల ప్రసంగించాలంటూ గ్రామస్తులు పదేపదే కోరారు. దీనితో ఆమె ‘రామ్ రా‌మ్ బియా’ (నమస్తే అన్న) అని లంబాడ భాషలో సంబోధించడంతో తండా‌ వాసులు ఒక్కసారిగా కేరింతలు కొట్టారు.

చిన్నారికి రాజన్న నామకరణం :
నేలకొండపల్లి మండలంలోని తిరుమలాపురంలో మహానేత వైయస్‌ఆర్ విగ్రహాన్ని‌ శ్రీమతి షర్మిల ఆవిష్కరించారు. ఆ గ్రామానికి చెందిన భూక్యా రవి, అరుణ దంపతులు తమ ఏడు నెలల బాబుకు పేరు పెట్టమని శ్రీమతి షర్మిలను కోరారు. ఆమె ముద్దుపెట్టుకొని రాజన్న అని నామకరణం చేశారు. అక్కడున్నవారు వెంటనే జోహా‌ర్ వై‌యస్‌ఆర్ అని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ‘జగనన్న చెల్లెలు వచ్చి మా అబ్బాయికి రాజన్న అని పేరుపెట్టడం అదృష్టంగా భావిస్తున్నాం. జీవితంలో ఈ ఘటనను మరిచిపోలేం. జగనన్న కుటుంబం వేసే ప్రతి అడుగులో మేముంటాం..’ అని అరుణ ఆనందంగా తెలిపింది.

తాజా వీడియోలు

Back to Top