రాజు పనిచేస్తే సేవకులూ చేస్తారు: షర్మిల

మర్రిగూడ (నల్గొండ జిల్లా) : ‘రాజు పనిచేస్తే సేవకులూ పనిచేస్తారు! కానీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పనిచేయడం లేదు కనుక ఎవరూ చేయడం లేదు' అన్నారు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల. మరో ప్రజాప్రస్థానం 61వ రోజున ఆమె నల్గొండజిల్లా మర్రిగూడ మండలంలో పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న అసమర్థ, ప్రజా వ్యతిరేక విధానాలకు, అధికార పక్షంతో కుమ్మక్కై దానికి కొమ్ము కాస్తున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు తీరుకు నిరసనగా శ్రీ జగన్‌ తరఫున శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె స్థానికులతో మాట్లాడారు. వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా తాము ఎదుర్కొంటున్న అనేక సమస్యలను మహిళలు, వృద్ధులు, వికలాంగులు శ్రీమతి షర్మిల ముందు చెప్పుకుని విలపించారు.

ఎట్ల బతకాలె?:
పప్పు కొందామంటే రూ.100.. ఉప్పు కొందామంటే రూ.20.. ఎట్ల బతకాలమ్మా.. అని ఓ మహిళ ఆందోళన చెందింది. ఊల్లె తాగెటందుకు నీళ్లు లేవు.. రూ.10 ఇచ్చి క్యాన్ నీళ్లు కొంటున్నం.. అని మరో మహిళ ఆ‌వేదన వ్యక్తం చేసింది.‌ మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ ఉన్న‌ప్పుడు రూ.900 ఉన్న డిఎపి బస్తా ఇప్పుడు రూ.1500 చేసిండ్రు. ఆనాడు క్వింటా పత్తిని రూ.6000కు కొంటే ఇప్పుడు రూ.3000కు కూడా కొనడం లేదు అని ఓ రైతు నిర్వేదం వ్యక్తం చేశాడు. పింఛన్ డబ్బులు చాలడంలేదమ్మా.. ఇవి వికలాంగుల ఆకలి‌కేకలు. ఇది మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లిలో శనివారం నిర్వహించిన రచ్చబండలో శ్రీమతి షర్మిల వద్ద గ్రామస్థులు వెళ్లబోసుకున్న గోడు.

గ్రామస్థులు- షర్మిల మధ్య సంభాషణ ఇలా కొనసాగింది.

పోలె లింగమ్మ : అమ్మా.. గ్రామంలో తాగెటందుకు నీళ్లు లేవు. ఉపాధి పథకంలో రోజంతా పనిచేసినా రూ.50 కూడా రావడం లేదు. మీ నాయన ఉన్నప్పుడు రూ.100 వచ్చేవి. నా మొగుడు అవిటోడు. రూ.200 పింఛనే ఇస్తున్రు. ఎట్ల బతకాలె. కృష్ణా నీరు వారానికి ఒక్కనాడు కూడా రావడం లేదు. రూ.10కి బిందె నీళ్లు కొనుక్కొని తాగుతున్నం.
షర్మిల : చంద్రబాబు తన హయాంలో జిల్లాలో ఫ్లోరైడ్ నివారణకు రూ.9 కోట్లు ఇస్తే,‌ మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ‌సిఎం అయ్యాక రూ.375 కోట్లు ఖర్చు చేశారు. 450 గ్రామాలకు కృష్ణాజలాలు అందించారు. ఆయన బతికుంటే మిగిలిపోయిన 500 గ్రామాలకు కూడా నీళ్లు అందేవి. ఇప్పుడున్న ప్రభుత్వం మూడున్నరేళ్లలో ఏ ఒక్క గ్రామానికీ నీళ్లు ఇవ్వలేదు.

ఆంబోతి దేవి : శ్రీశైలం నుంచి నీళ్లు కావాలె. రెండేళ్లుగా వానలు పడతలేవు. సావు బతుకే అయ్యింది. వ్యవసాయానికి దేవుడెరుగు.. తాగనికి కూడా నీళ్లు దొరుకుతలేవు.
షర్మిల : ఎస్ఎ‌ల్‌బిసి సొరంగమార్గాన్ని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మొదలుపెట్టారు. ఆయన బతికుంటే సొరంగం పూర్తయ్యేది. 4 లక్షల ఎకరాలకు సాగునీరుతో పాటు, అన్ని గ్రామాలకూ తాగునీరు అందేది. దురదృష్టవశాత్తు ఆయన మరణంతో అన్నీ ఆగిపోయాయి. సాగు, తాగునీరు లేకుండా పోయింది.

ఓ గిరిజన మహిళ : ఒక్క బల్బు వేసుకున్నా మూడొందల కరెంటు బిల్లు వస్తుంది. గతంలో 100 రూపాయల లోపే వచ్చేది. ఇప్పుడు అమాంతం ఇట్లా పెంచితే మాలాంటి పేదోళ్లం ఎట్టా బతకాలి.
షర్మిల : కాంగ్రె‌స్ ప్రభుత్వం స‌ర్‌చార్జీల మీద సర్‌చార్జీలు వేస్తూ బిల్లులు పెంచేస్తోంది. దీనితో సామాన్యులు, నిరుపేదలపైన కూడా ఆర్థిక భారం మూడింతలు పెరిగింది. వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజూ కరెంటు, ఆర్టీసీ చార్జీ‌లు పెంచలేదు. గ్యాస్ ధరలూ పెంచలేదు. ప్రజలపై రూపాయి కూడా భారం పడకుండా చూసుకున్నారు. మహిళలకు పావలా వడ్డీకే రుణాలిచ్చారు.

మరో మహిళ : రూపాయికి కిలో బియ్యం అని ఇస్తున్రు. మిగతా అన్ని వస్తువుల ధరలు పెంచిన్రు. పప్పు కొందామంటే రూ.100, ఉప్పుకొందామంటే రూ.20 ఎ‌ట్ల బతకాలె..?
షర్మిల : ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పన్నుల మీద పన్ను‌లు వేస్తున్నది. ప్రజలను దోచుకుంటున్నది. పాలకులు ప్రజల రక్తం తాగుతున్నారు. మీ శ్రమను దోచుకుంటున్నారు. ఈ ప్రభుత్వానికి పోయేకాలం దగ్గరపడింది. ఉప్పు, పప్పు, చక్కెర ధరలను విపరీతంగా పెంచింది. జగనన్నకు మీరంతా అండగా నిలబడితే మీ కష్టాలన్నీ తీరుతాయి. పేదలకు అండగా ఉంటాడు. వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని కిరణ్‌కుమార్‌రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎవరికైనా అందుతున్నాయా అని అడిగారు. దానికి ప్రజలంతా ముక్తకంఠంతో వడ్డీలేని రుణం దేవునికెరుక. మూడు రూపాయల మిత్తి మీద పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

నారోజు జంగాచారి : మాది మర్రిగూడ. ఇద్దరు పిల్లలున్నరు. నేను వికలాంగుడిని. మీరొస్తున్నారని తెలిసి నా బాధను చెప్పుకునేందుకు వచ్చా. వికలాంగుడినైనా రూ.200 పింఛనే ఇస్తున్రు. నల్లగొండకు పోయొచ్చినా రూ.500 ఇస్తలేరు.
షర్మిల : ఈ ప్రభుత్వం పింఛ‌న్లు, రేషన్ కార్డులకు కోత పెడుతోంది. ఒక్క కన్ను ఉంది, రూ.500 పింఛన్ ఇవ్వమని అడిగితే ఇంకో కన్ను ఉంది కదా.. అంటారేమో.. త్వరలో రాజన్న రాజ్యం వస్తుంది. వికలాంగులకు రూ.1000 పింఛ‌న్ ఇస్తుంది.

మహానేత ఉన్నప్పుడే రైతులకు మేలు జరిగింది :
అంగడిపల్లి గ్రామస్థుడు : మేడం.. ఎరువుల ధరలు విపరీతంగా పెంచిన్రు. వైయస్‌ఆర్ ఉన్నప్పుడు రూ.900 ఉన్న ‌డిఎపి బస్తా ఇప్పుడు రూ.1500కు చేరింది. నాడు క్వింటాలు పత్తి రూ.6000కు కొంటే నేడు రూ.3000కు కూడా కొనడం లేదు.
షర్మిల : రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఆనాడు మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి రైతులకు అండగా ఉన్నారు. రైతుల కష్టాలను తన కష్టాలుగా భావించి ఎరువుల ధరలను పెరగనీయలేదు. విత్తనాలకు సబ్సిడీ ధరకు ఇచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించారు. సాగు ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. అయినా ఈ ప్రభుత్వం క్వింటాలు పత్తిని రూ.2500కు మించి కొనడంలేదు. ఈ ప్రభుత్వం అన్నం పెట్టే రైతు పొట్ట కొడుతోంది. రూ.3000 కోట్లతో నిధిని ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం అని హామీ ఇచ్చారు.
Back to Top