రాజన్న ఆశయం.. షర్మిల వజ్రసంకల్పం

మచిలీపట్నం (కృష్ణాజిల్లా) : అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికీ అందాలన్నది మహానేత రాజన్న ఆశయం. ఆ ఆశయాన్ని సాకారం చేయాలన్నది జననేత జగనన్న లక్ష్యం. ప్రజాకంటక కాంగ్రెస్ పాలన‌లో పడరాని పాట్లు పడుతున్న ప్రజానీకానికి ‘మీ వెంటే మేం ఉన్నామం’టూ భరోసా ఇచ్చే శ్రీమతి షర్మిల వజ్రసంకల్పం. వెరసి మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర. శ్రీమతి షర్మిల చేస్తున్న సుదీర్ఘ, చారిత్రక పాదయాత్ర 2013 ఏప్రిల్‌ 3వ తేదీ బుధవారంనాడు కృష్ణా జిల్లా పెడనలో 1500 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది. శ్రీమతి షర్మిల పాదయాత్రకు అడుగడుగునా అపూర్వ ఆదరణ లభిస్తోంది. మండుటెండను సైతం లెక్కచేయకుండా కొనసాగుతున్న ఆమె పాదయాత్రలో పెడన అసెంబ్లీ నియోజకవర్గం ఈ అరుదైన రికార్డుకు వేదికైంది. మరో ప్రజాప్రస్థానం సాగుతున్న 50వ శాసనసభా నియోజకవర్గంగా పెడన నిలిచింది. చంద్రబాబు పాలనలో పేదల కష్టాలను చూడలేక 2003లో ‌తన తండ్రి, మహానేత డాక్టర్ వై‌యస్ నిర్వహించిన ప్రజాప్రస్థానం పాదయాత్ర స్ఫూర్తిగా శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం చేస్తున్నారు.

అప్పటి దౌర్భాగ్యకరమైన పరిస్థితులే నేడు కూడా రాష్ట్రంలో నెలకొన్నాయి. కుమ్మక్కు కుట్రలతో జననేతను జైలు పాలు చేయడంతో ఆయన ఎక్కుపెట్టిన బాణంలా శ్రీమతి షర్మిల జనంలోకి దూసుకువచ్చారు. కిరణ్ ప్రభుత్వ వైఫల్యాన్ని, చంద్రబాబు నయవంచనను ఎండగడుతూ, త్వరలోనే రాజన్నరాజ్యాన్ని జగనన్న తెస్తాడంటూ జనానికి భరోసా ఇస్తూ ఇడుపులపాయలోని‌ మహానేత వైయస్ సమాధి చెంత నుంచి ఆమె పాదయాత్ర ప్రారంభించారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలో వంద రోజుల పాదయాత్ర పూర్తిచేసుకోగా బుధవారం 109వ రోజు పెడనలో 1500 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. కృష్ణాజిల్లాలో ఏడవ అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగగా 118.6 కిలోమీటర్లు పూర్తయింది.

చెదరని చిరునవ్వు.. అభయమిస్తున్నట్లు చేయి ఊపుతూ ప్రజలకు అభివాదం చేస్తూ శ్రీమతి షర్మిల ముందుకు సాగుతున్న తీరు మహానేత వైయస్‌నే తలపిస్తోంది. బందరులో తనను చూసేందుకు జనం పోటీపడటంతో చోటు చేసుకున్న తోపులాటలో కిందపడిపోయిన వ్యక్తిని ఎవరూ తొక్కకుండా శ్రీమతి షర్మిల కాపాడారు. చేయి అందించి పైకి లేపి యాత్రలో తన వెంట కొద్దిసేపు నడిపించారు.

అల్లాహ్.. ఓ జీసస్.. హే రామ్..‌:
‌'అల్లాహ్'.. 'ఓ జీసస్'.. 'హే రా‌మ్' అంటూ మూడు మతాల పెద్దలు శ్రీమతి షర్మిల పాదయాత్రలో ప్రార్థనలు చేశారు. రాజన్నరాజ్యం మళ్లీ రావాలని, జగనన్న త్వరగా విడుదల కావాలని, శ్రీమతి షర్మిల పాదయాత్ర దిగ్విజయంగా ముందుకు సాగాలని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

మహానేత విగ్రహావిష్కరణ.. సేవా కార్యక్రమాలు :
మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 1500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పెడన బైపాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన 15 అడుగుల వై‌యస్‌ఆర్ విగ్రహాన్ని‌ శ్రీమతి షర్మిల ఆవిష్కరించారు. విగ్రహం ఏర్పాటుకు స్థలం ఇచ్చిన దాత పిన్నింటి మహంకాళినాయుడు, శిల్పి ప్రసాద్, ఇంజినీ‌ర్ మురళీధ‌ర్, తాపీమేస్త్రి‌ ఆంజనేయులును శ్రీమతి షర్మిల అభినందించారు. జెడ్పీ మాజీ చైర్మ‌న్ ‌కె. నాగేశ్వరరావు, ఉప్పాల రాంప్రసాద్, కాజా రా‌జ్‌కుమార్‌ ఆధ్వర్యంలో వందమంది వికలాంగులకు మూడు చక్రాల సకిళ్లను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడడం అభినందనీయమని శ్రీమతి షర్మిల అన్నారు. అనంతరం డాక్టర్ వాకా వాసుదేవరావు నేతృత్వంలో పెడన నియోజకవర్గంలో పల్లెపల్లె‌కూ మహానేత వైయస్ విగ్రహం కార్యక్రమాన్ని ‌ఆమె ప్రారంభించారు. వి.వి.ఆర్‌.కు చెందిన నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడే 108 వైయస్ విగ్రహాల పంపణీకి ఆమె శ్రీకారం చుట్టారు.

మెడలో నూలుపోగు.. చేతిలో రాట్నం :
పెడన అంటే మొట్టమొదట గుర్తొచ్చేది కలంకారీ, చేనేత. దానికి అద్దంపట్టేలా పెడన బహిరంగ సభలో శ్రీమతి షర్మిల మెడలో పూలమాలకు బదులు నూలుపోగుమాల వేశారు. నేతలు బహూకరించిన రాట్నం వడికిన శ్రీమతి షర్మిల ఆ తర్వాత భుజాన నాగలితో అందరినీ ఆకట్టుకున్నారు. పలువురు ఆమెకు కలంకారీ వస్త్రాలు అందజేశారు. సభలో ఆమె మాట్లాడుతూ తన తండ్రి వైయస్ స్ఫూర్తితోనే ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు పాలనకు కొనసాగింపుగానే కిర‌ణ్ ‌ప్రభుత్వం ఉందంటూ నిప్పులు చెరిగారు. జగనన్న త్వరలోనే విడుదలవుతారని, రాజన్నరాజ్యం తెస్తారని తెలిపారు. జగనన్న బయట ఉంటే కాంగ్రెస్, ‌టిడిపిలు దుకాణాలు మూసేసుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ గుర్తులపై ‌నిర్వహించాలంటూ శ్రీమతి షర్మిల చేసిన ప్రసంగానికి సభలో కరతాళధ్వనులతో హర్షధ్వానాలు మిన్ను ముట్టాయి.

రాజన్న బిడ్డకు కష్టాల నివేదన :
రాజన్న బిడ్డ రావడమంటే తమ ఆడపడుచే వచ్చిందని భావించిన జనం నేరుగా ఆమెను కలిసి కష్టాలు నివేదించారు. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధికారంలోకి వస్తే తమ బాధలు తీరుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ఇళ్లు లేవని, స్థలం ఇవ్వాలని, మంచినీరు రావడం లేదని, పింఛను అందడం‌ లేదంటూ పలువురు శ్రీమతి షర్మిలకు మొరపెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కష్టాలు తీరుస్తామని శ్రీమతి షర్మిల వారికి భరోసా ఇచ్చారు.
Back to Top