ప్రైవేటు రాయితీలతో ప్రయోజనం బాబుకే


ఏ పనిచేసినా అందులో లాభం నష్టం బేరీజు వేసుకునే అలవాటు చంద్రబాబుది. ప్రభుత్వం తరఫున తీసుకునే నిర్ణయాలైనా సరే తన స్వలాభం లేనిదే ముందుకు సాగవని మరోసారి రుజువైంది. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యం అని, అందుకోసం రోజుకు 26 గంటలు పనిచేస్తున్నానని అంటాడు బాబు. 67ఏళ్ల వయసులోనూ కష్టపడుతున్నానని అంటాడు. రాష్ట్రానికి పరిశ్రమలు తేవడానికి తాను పడ్డంత శ్రమ ఇంకెవ్వరూ పడలేదని కూడా చెబుతుంటారు. కానీ రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా మోకాలడ్డే పనులూ ఆయనే చేస్తుంటారు. తనకు ప్రయోజనం లేదనిపిస్తే, టిడిపి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను ఎంత నిర్దాక్ష్యణ్యంగా కాలరాస్తుందో కడప ఉక్కు పరిశ్రమ విషయంలో లోకేష్ చేసిన ప్రకటన వింటే అర్థం అవుతుంది. 
రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రానికి రాయితీలు ఇవ్వం అని ప్రభుత్వం తరఫున తన నిర్ణయాన్ని ప్రకటించేశాడు మంత్రి నారా లోకేష్. ముఖ్యమంత్రిగారి పుత్రరత్నం ఓమంత్రి స్థానంలో ఉండి చెప్పాడంటే,  ఇది చంద్రబాబు నిర్ణయమే అనుకోవాలి. ప్రైవేటు సంస్థలు పరిశ్రమలు స్థాపిస్తే రాయితీలు ఇస్తాం కానీ, కేంద్రప్రభుత్వం పెట్టే పరిశ్రమలకు రాయితీలు ఇవ్వం అని చెబుతోంది టిడిపి ప్రభుత్వం. రాష్ట్ర ప్రయోజనాలకోసం, లక్షలాది మంది ఉపాధి కోసం ఏర్పాటు చేసే భారీ పరిశ్రమలు రావాలని ప్రతిరాష్ట్రం ఎదురు చూస్తుంది. స్వలాభం కోసం పనిచేసే ప్రైవేటు కంపెనీల కంటే కేంద్ర ప్రభుత్వం సాంక్షన్ చేసే పరిశ్రమల ద్వారా రాష్ట్ట్రానికి ప్రయోజనం ఉంటుందని ఏ రాష్ట్రమైనా భావిస్తుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఇందుకు పూర్తిగా విరుద్ధం. కేంద్ర పరిశ్రమలకు రాయితీలు ఎందుకివ్వాలని ప్రశ్నిస్తోంది. విదేశీ సంస్థలకు, ప్రైవేటు కాంట్రాక్టర్లకు రాయితీల మీద రాయితీలు ఇచ్చి, చౌకధరలకే భూములను కట్టబెట్టి, వాటిపై సర్వ హక్కులూ ఆ సంస్థలకు రాసిస్తోంది. కొన్ని ప్రైవేటు యాజమాన్యాల బ్యాంకు రుణాలకు ప్రభుత్వమే పూచికత్తు కూడా ఇచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిశ్రమలకు మాత్రం ఎలాంటి రాయితీలు ఇవ్వం అని ఖరాఖండీగా చెబుతోంది. 
స్వప్రయోజనాలు దక్కవనేనా??
ప్రైవేటు సంస్థలకు కారు చౌకగా భూములు అందించడం, రాయితీల వరాలు కురిపించడం చంద్రబాబుకు అలవాటు. దీని వెనక ఆయన స్వప్రయోజనాలు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం. బాలకృష్ణ బంధువుల కంపెనీలకు, నారా లోకేష్ స్నేహితుడి సంస్థలకు, బాబుగారి సింగపూరు కంపెనీలకు ప్రభుత్వ భూములు ఎకరాలకు ఎకరాలు రాసిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఎకరం 10లక్షలకే ఇవ్వడం నుంచి, ఆ సంస్థలకు మౌలిక వసతుల కల్పన బాధ్యతను కూడా తీసుకుంది. కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు భూములను కోట్ల రూపాయిల ధరలు నిర్ణయించింది. ప్రైవేటు సంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు కేటాయింపుల్లో ఇంత వ్యత్యాసం వెనకున్న మతలబులు కమీషన్లు కాక మరేమిటి? 
ఓఎన్జీసీ, హెచ్ పి సిఎల్, బీపీపీఎల్, గెయిల్ వంటి సంస్థలు లక్షల కోట్ల పెట్టుబడులు ఎపిలో పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ ఈ సంస్థలకు వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. వ్యాపారం కోసం మాత్రమే పనిచేసే ప్రైవేటు సంస్థలకు రాయితీలిచ్చేందుకు ముందుకు వచ్చే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే భారీ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం, రాయితీలు ఇవ్వమని తేల్చి చెప్పడం దారుణమే. ప్రైవేటు సంస్థలకు రాయితీలు ప్రకటించడం ద్వారా భారీగా కమీషన్లు అందుకునే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల విషయంలో కమీషన్లు రావు కనుకే చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర సంస్థల విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందంటున్నారు అధికారులు. 
సొంత కంపెనీ హెరిటేజ్ కు కూడా కోట్లలో రాయితీలు కల్పించుకున్న చంద్రబాబు రాష్ట్రంలో లక్షలాది మందికి ఉపాధినిచ్చే కేంద్ర ప్రాజెక్టులు రాకుండా అడ్డుకోవడం చూసి ప్రజలు విస్తుపోతున్నారు. బాబు చెప్పేదొకటి, చేసేదొకటి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడప స్టీలు ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం సిద్ధమని చెప్పినా రాయితీలు ఇచ్చేది లేదంటూ రాష్ట్రం చెప్పడం చూస్తే చంద్రబాబు స్వార్థ రాజకీయాలు ఎలాంటివో అర్థం అవుతోంది. పొరుగునే ఉన్న తెలంగాణా రాష్ట్ర సర్కారు కేంద్రం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామంటే సగం ఖర్చు అయినా భరిస్తామని ముందుకొచ్చింది. వివిధ రాయితీలు అందిస్తామని కూడా చెబుతోంది. బాబు పాలనలో రాష్ట్ర అభివృద్ధి అనే మాటను వేరుగా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు ఆయన కుమారుడు, బినామీలు, టిడిపి నేతలు అభివృద్ధి చెందడమే బాబుగారి దృష్టిలో రాష్ట్రాభివృద్ధి. 


 
Back to Top