ప్ర‌త్యేక హోదా హుళక్కే అంటారా...!

న్యూఢిల్లీ) ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా ఉన్న‌ట్లా..లేన‌ట్లా..అన్న దానిపై తీవ్రంగా చ‌ర్చ న‌డుస్తోంది. క‌నుచూపు మేర‌లో కేంద్రం నుంచి ఎటువంటి హామీ లేక‌పోగా, హోదా లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు కుండ బ‌ద్ద‌లు కొట్ట‌డం గ‌మ‌నించాల్సిన విష‌యం.

ప్ర‌త్యేక హోదా మొగ్గ తొడిగిందిలా..!
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను నిట్ట నిలువునా చీల్చాల‌ని అప్ప‌టి కాంగ్రెస్ నాయ‌క‌త్వంలోని యూపీఏ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందుకోసం పార్ల‌మెంటులో అప్రజాస్వామిక ప‌ద్ద‌తిలో వ్య‌వ‌హ‌రించిన తీరు అందరికీ గుర్తుంది. లోక్ స‌భ‌లో త‌లుపులు మూసి, ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాలు నిలిపివేసి మ‌రీ ఈ బిల్లును నెగ్గించారు. త‌ర్వాత రాజ్య‌స‌భ‌లో ఈ విష‌యం మీద చ‌ర్చ‌కు స‌మాధానంగా అప్ప‌టి ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ మాట్లాడుతూ... విభ‌జ‌న‌తో ఆర్థికంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ తీవ్రంగా న‌ష్ట‌పోతుంది కాబ‌ట్టి ఐదేళ్ల పాటు ప్ర‌త్యేక హోదా క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. దీనిపై అప్ప‌ట్లో ప్ర‌తిప‌క్షంలో ఉన్న బీజేపీ అగ్ర నేత వెంక‌య్య నాయుడు, అరుణ్ జైట్లీ మాట్లాడుతూ ప్ర‌త్యేక హోదా ప‌దేళ్ల పాటు క‌ల్పించాల‌ని అభ్య‌ర్థించారు. దీన్ని ప్ర‌ధాన‌మంత్రి పార్ల‌మెంటు వేదిక‌గా అంగీక‌రించ‌టంతో ఈ హోదా క‌ల్పించిన‌ట్లే అని అంతా భావించారు.

చంద్ర‌బాబు క‌ప‌టత్వం
ప్ర‌తీ దాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకొనే చంద్ర‌బాబు నాయుడు ఈ అంశాన్ని సైతం త‌న‌కు అనుకూలంగా మార్చుకొన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా ర‌ప్పించ‌టం త‌మ వ‌ల్లే  అవుతుంద‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో బాగా ప్ర‌చారం చేసుకొన్నారు. ఎన్నిక‌ల త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చాక‌, అన్ని ముఖ్య హామీల‌ను గాలికి వ‌దిలేసిన‌ట్లుగానే దీన్ని కూడా వ‌దిలేశారు. కేంద్రంలో రెండు మంత్రి ప‌ద‌వులు, మ‌రికొన్ని కాంట్రాక్టులు తెలుగుదేశం నాయ‌కుల‌కు ద‌క్క‌టంతో అంత‌టితో స‌రిపెట్టుకొన్నారు. పైగా ఓటుకి కోట్లు కుంభ‌కోణంలో పూర్తిగా ఇరుక్కొన్నాక‌, కేంద్రంతో విభేదిస్తే ఎక్క‌డ కేసుల్ని తిర‌గ‌తోడతారో అన్న భ‌యంతో మిన్న‌కుండి పోయారు. రాష్ట్ర‌మంతా ప్ర‌త్యేక హోదా మీద చ‌ర్చ జ‌రుగుతుండ‌టంతో, దీని మీద తాను తీవ్రంగా పోరాడుతున్న‌ట్లుగా ఎల్లో మీడియాలో ప్ర‌చారం చేయించుకొంటున్నారు.

పోరాట బాట‌లో వైఎస్సార్‌సీపీ 
ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల విష‌యంలో మొద‌టినుంచి గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో వ్య‌వ‌హ‌రించిన పార్టీ వైఎస్సార్‌సీపీ. ప్ర‌త్యేక హోదా కోరుతూ అనేక ద‌శ‌లుగా పోరాటం చేస్తూ వ‌చ్చింది. ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర మోదీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌క పూర్వ‌మే ఆయ‌న్ని క‌లిసి ప్ర‌త్యేక హోదా ఇప్పించాల‌ని ప్ర‌ధాన‌మంత్రికి పార్టీ అధ్య‌క్షుడ వైఎస్ జ‌గ‌న్ విన‌తి ప‌త్రం అందించి వ‌చ్చారు. త‌ర్వాత కాలంలో అనేక ద‌ఫాలుగా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రుల్ని క‌లిసి ప్ర‌జాస్వామ్య యుతంగా ఒత్తిడి తెచ్చారు. మంగ‌ళ‌గిరి లో ప్ర‌త్యేక హోదా ఒక ప్ర‌ధానాంశంగా వైఎస్ జ‌గ‌న్ స‌మ‌ర దీక్ష చేప‌ట్టారు. పార్ల‌మెంటులో పార్టీ ఎంపీలు అనేక సార్లు వాయిదా తీర్మానం నోటీసులు ఇవ్వ‌టంతో పాటు ధ‌ర్నా నిర్వ‌హించ‌టం ద్వారా జాతీయ స్థాయి నేత‌ల‌కు తెలియ చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. 

ఢిల్లీలో వైఎస్ జ‌గ‌న్ ధ‌ర్నా
ఈ పోరాటం అంతా ఒక ఎత్త‌యితే, పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్ ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వేదిక‌గా మ‌హా ధర్నా నిర్వ‌హించారు. రెండు రైళ్ల‌లో వేల మంది నాయ‌కులు, ముఖ్య కార్య‌క‌ర్త‌లు త‌ర‌లి వెళ్లారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేత‌లు, నియోజ‌క వ‌ర్గ క‌న్వీన‌ర్లు ఇందులో పాల్గొన్నారు. ఢిల్లీ పెద్ద‌ల‌కు తెలిసి వ‌చ్చేలావైఎస్ జ‌గ‌న్ ధ‌ర్నా నిర్వ‌హించి ప్ర‌త్యేక హోదా కోసం నిరంత‌ర పోరాటాన్ని ప్ర‌క‌టించారు. 

తెలుగుదేశంలో క‌ల‌వ‌రం
వైఎస్ జ‌గ‌న్ జ‌రుపుతున్న పోరాటంతో తెలుగుదేశం పార్టీ నాయ‌కుల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది. దీంతో పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రుల్ని ఈ విష‌యంపై క‌లిశారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌టం క‌ష్ట‌మ‌నే అభిప్రాయాన్ని కేంద్ర మంత్రులు  వ్య‌క్తం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తే ఎలా ఉంటుంద‌నే మాట అన్న‌ట్లుగా స‌మాచారం. మొద‌టినుంచీ ప్యాకేజీలు, ఫండింగ్ లు అంటే ఆస‌క్తి చూపించే తెలుగు దేశం నేత‌లు దీనికి అంగీకరించిన‌ట్లుగా ఢిల్లీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోయినా ఫర్వాలేదు, ప్యాకేజీలు ఉంటే చాల‌నే భావ‌న్ని వ్య‌క్తం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. 

ఇంత తేలిగ్గా అధికార ప‌క్ష‌మైన తెలుగుదేశం ప్యాకేజీల‌కు మొగ్గు చూప‌టంతో కేంద్రం చ‌క చ‌కా నిర్ణ‌యాలు తీసుకొంటోంద‌న్న మాట వినిపిస్తోంది. ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా ప్యాకేజీల ద్వారా ప‌ని న‌డిపించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని చెబుతున్నారు. ఈ కోణంలో్నే కేంద్రం త‌న అభిప్రాయాలు బ‌య‌ల పెట్టింద‌ని చెబుతున్నారు. 
Back to Top