అల్లుడా మజాకా!

– మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అల్లుడి కోసం భవనాలు కూల్చివేత  
– స్టార్‌ హోటల్‌ అనుమతుల కోసం రోడ్డు విస్తరణ
– ట్రాఫిక్‌ విపతీరంగా ఉన్న రోడ్లు విస్తరణ చేపట్టకుండా.. ట్రాఫిక్‌ లేని రోడ్డు విస్తరణ
– స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి గోడు వెళ్లబోసుకున్న బాధితులు
– మంత్రిగారి అల్లుడు కోసం విస్తరణకు అంగీకరించాల్సిందేనని హుకుం
– నిర్వాసితులకు నోటీసులు..లబోదిబోమంటున్న స్థానికులు  


రోడ్డు విస్తరణ ఎందుకు చేస్తారు? 
పెరుగుతున్న ట్రాఫిక్‌ వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండటానికి...!
కానీ విజయవాడలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అల్లుడి కోసం రోడ్డు విస్తరణ చేయడానికి కార్పొరేషన్‌ సిద్ధమైంది.
అల్లుడి కారు దర్జాగా పోయేందుకు ఇబ్బంది లేకున్నా.. విస్తరణ ఎందుకు?
ఆయన గారి ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు అనుమతులు రావాలంటే.. రోడ్డు విస్తరణ జరగాలి. 
ప్రస్తుతం 40 అడుగుల ఉన్న రోడ్డును 60 అడుగులకు విస్తరిస్తే తప్ప అనుమతులు రావు. అందుకు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏం చేసిందో తెలుసా?
 ట్రాఫిక్‌ చాలా తక్కువగా ఉండే రోడ్డులో.. ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగిపోయిందని, రోడ్డు విస్తరించాలని నిర్ణయించేసి బాధితులకు నోటీసులు ఇచ్చేసింది. ఇదేమి అన్యాయమని బాధితులు  నెత్తీనోరూ మొత్తుకున్నా అధికారులు కనికరించలేదు. మంత్రి అల్లుడి కోసం ఇళ్లు, దుకాణాలను వదులుకోవడం మినహా మరో మార్గం లేదని తెగేసి చెప్పారు. దీంతో బాధితులు నగరంలో ఉన్న టీడీపీ ప్రజా ప్రతినిధులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారైనా ఆదుకుంటారని, అన్యాయాన్ని అడ్డుకుంటారని స్థానికులు భావించారు. సొంత పార్టీ నాయకుడి అల్లుడి ముచ్చటపడుతుంటే రోడ్డు విస్తరణకు సహకరించకపోతే ఎలా? అని స్థానికులను అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎదురు ప్రశ్నించారు.

 ఫైవ్‌స్టార్‌ హోటల్‌ అనుమతుల కోసం రోడ్డు విస్తరణ
బందరు రోడ్డులో చెన్నుపాటి పెట్రోల్‌ బంకు నుంచి వై.వి.రావు ఆస్పత్రి రోడ్డు చివరన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అల్లుడు వల్లూరి శరణ్‌.. తన తండ్రి వల్లూరి బసవయ్య పేరిట 4 ఎకరాల స్థలంలో ఫైవ్‌స్టార్‌ హోటల్, కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మిస్తున్నారు. ఇంత భారీ నిర్మాణానికి అనుమతులు రావాలంటే.. రోడ్డు 60 అడుగుల వెడల్పు ఉండాలనే నిబంధన ఉంది. ప్రస్తుతం రోడ్డు 40 అడుగుల వెడల్పే ఉంది. ట్రాఫిక్‌ లేని రోడ్డు కదా.. 40 అడుగుల రోడ్డు అయినా అనుమతులు ఇవ్వాలని కార్పొరేషన్‌ అధికారుల మీద ఒత్తిడి తెచ్చారు. వారు సాధ్యం కాదని తేల్చి చెప్పడంతో.. మంత్రి స్థాయిలో మంత్రాంగం నడిపారు. ఫలితంగా.. 40 అడుగుల రోడ్డును 60 అడుగులకు విస్తరించడానికి కార్పొరేషన్‌ పెద్దలు అంగీకరించారు. విస్తరణకు రంగం సిద్ధం చేశారు. అందరికీ నోటీసులు ఇచ్చేశారు.

ట్రాఫిక్‌ లేదు మహాప్రభో..
బందర్‌ రోడ్డు నుంచి వై.వి.రావు ఆస్పత్రి రోడ్డులో ట్రాఫిక్‌ చాలా పల్చగా ఉంటుంది. బందర్‌ రోడ్డు నుంచి బందర్‌ కాలువ వరకు ఈ రోడ్డు విస్తరించి ఉంది. బందర్‌ కాలువ వల్ల డెడ్‌ ఎండ్‌ ట్రాఫిక్‌ పెద్దగా పెరగలేదు. ట్రాఫిక్‌ లేదు మహాప్రభో.. అని స్థానికులు కార్పొరేషన్‌ అధికారులకు మొరపెట్టుకుంటే ’మంత్రిగారి అల్లుడు చెప్పారు. ట్రాఫిక్‌ లేకున్నా ఉన్నట్లే. ట్రాఫిక్‌ లేని సంగతి మీకు, మాకు తెలుసు. అల్లుడి గారికి తెలియట’ అని అధికారులు వెటకారం అడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. 60 అడుగులకు రోడ్డును విస్తరించడానికి కార్పొరేషన్‌ సిబ్బంది మార్కింగ్‌ ఇచ్చేశారు. రేపోమాపో ఇళ్లు, దుకాణాలు  కూల్చేస్తామంటున్నారు. రోడ్డు విస్తరణ వల్ల కొన్ని భవానలకు  పిల్లర్లు పోవటం వల్ల తమ భవనాలు దెబ్బతింటాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

పాత జీవో ప్రకారం టీడీఆర్‌ బాండ్లు
రోడ్డు విస్తరణకు అవసరమైన కొద్దిపాటి స్థలాన్ని సేకరించాలన్నా 2013 భూ సేకరణ చట్టంలో పేర్కొన్న నిబంధనలను కార్పొరేషన్‌ పాటించాలి. విస్తరణకు స్థానికులు సానుకూలంగా ఉంటే.. సేకరణ నోటిఫికేషన్‌ ఇవ్వాలి. దాన్ని పత్రికల్లో ప్రచురించాలి. 2013 చట్టం ప్రకారమే పరిహారం ఇవ్వాలి. అలా కాకుండా కార్పొరేషన్‌ అధికారులు 2012 చట్ట ప్రకారం నిర్వాసితులకు  నోటీసులు జారీ చేశారు. బాధితులకు పరిహారం కాకుండా టీడీఆర్‌ (ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ డెవలెప్‌మెంట్‌ రైట్‌) బాండ్లు ఇస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. రోడ్డ విస్తరణలో కోల్పోయిన విస్తీర్ణానికి రెట్టింపు పరిమాణంలో అదనపు నిర్మాణం చేపట్టడానికి ఈ బాండ్లు ఉపయోగపడతాయి.

అనుమతుల్లేకుండానే స్టార్‌హోటల్‌ నిర్మాణం ప్రారంభం
సామాన్యుడి నిర్మాణం చేపట్టాలంటే సవాలక్ష అనుమతులు తీసుకోవాలి. కానీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అల్లుడు ఎలాంటి అనుమతులు లేకుండానే స్టార్‌ హోటల్‌ నిర్మాణం మొదలుపెట్టేశారు. 20 శాతానికిపైగా నిర్మాణం పూర్తయినా.. కార్పొరేషన్‌ అధికారులు అడిగిన పాపానపోలేదు. రోడ్డు విస్తరణ కోసం మార్కింగ్‌ చేసిన అధికారులు.. కార్పొరేషన్‌ అనుమతులు లేకుండా సాగుతున్న నిర్మాణం గురించి పట్టించుకోకపోవడాన్ని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
Back to Top