ఏపీలో అధికార ఉన్మాదం

– దాడులతో తెగబడుతున్న పచ్చ దొరలు
– ఎమ్మెల్సీ సీటు కోసం ప్రలోభాలు, దౌర్జన్యాలు
– కడప టార్గెట్‌గా జిల్లాలో భయాందోళనలు 

డబ్బుంది.. అధికారం ఉంది.. ఇకనేం, ప్రలోభాలతో, బెదిరింపులతో, పార్టీ ఫిరాయింపులతో గట్టెక్కేస్తామనే ధీమా అధికార పార్టీలో కనిపిస్తుంది. ’వీలైతే కొనేయండి.. లేదంటే బెదిరించండి.. అదీ కుదరకపోతే ఇంకేదన్నా చేసెయ్యండి..’ అన్న పద్ధతిని ఫాలో అవుతోంది కడప ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో అధికార తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఏం చేసిందో చూశాం. ఒక్క ఓటు కోసం ఐదు కోట్లు ఖర్చుపెట్టడానికీ వెనుకాడలేదు. అలాంటిది, ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కూడా చేతిలో ఉండటంతో పసుపు దళం ఎలాగైనా కడప ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవడానికి ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. 

చెప్పేది శ్రీరంగ నీతులు 
పార్టీ ఫిరాయింపుల్ని రాజకీయ వ్యభిచారంతో పోల్చిన ఘనుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. చెప్పేది శ్రీరంగ నీతులు.. దూరేది మాత్రం ’డాష్‌ డాష్‌’ అన్నట్లు.. చంద్రబాబు చెప్పే మాటలకీ, చేసే పనులకీ పొంతనే వుండదు. ఉదాహరణ కావాలా.? ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 21 మంది ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ’ఫిరాయించడమే’ ఇందుకు నిదర్శనం. ’రండి బాబూ రండి.. బంపర్‌ ఆఫర్లు.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.?’ అంటూ తలుపులు తెరిచి మరీ, నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయింపులకు తెరలేపారు చంద్రబాబు. ఇదే చంద్రబాబు తెలంగాణలో తమ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు మాత్రం గగ్గోలు పెట్టని రోజు లేదు. మా ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొంటున్నారని గొంతు చించేసుకున్నాడు. కనిపించిన ప్రతి చోటా కేసీఆర్‌ మీద విరుచుకుపడ్డాడు. అదే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో కూడా చేసిందదే. ఆనాడు పార్టీ ఫిరాయింపులను రాజకీయ వ్యభిచారంతో పోల్చిన బాబు అదే వ్యభిచారంతో వ్యాపారం మొదలెట్టాడు. పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. మరింత దిగజారి ఎంపీటీసీలు, జడ్పీటీసీలను కూడా వదలకుండా డబ్బులు ఎరవేసి టీడీపీ కండువాలు కప్పేస్తున్నాడు. అప్పటికీ తలొగ్గకపోతే బెదిరించడాలు.. ఆస్థులపై దాడి చేసి నష్టం చేయడం.. అయినా వెనక్కి తగ్గలేదా దారికాచి ప్రాణాలు తీయడానికి కూడా పచ్చ నాయకులు వెనకాడటం లేదు. 

బలం లేకపోయినా బరిలోకి..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి వైయస్‌ఆర్‌ కడప జిల్లా, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో మెజారిటీ లేదు. ఈ మూడు జిల్లాల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ ఉంది. అయినా అధికారం అండ చూసుకుని డబ్బులతో కొనేయొచ్చని టీడీపీ అభ్యర్థులను బరిలో దించింది. వైయస్‌ఆర్‌ జిల్లాలో 845 స్థానాలకు 521 స్థానాల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు బలం ఉంది.. కాగా కర్నూలు జిల్లాలో 1075 స్థానాలకు గాను 580 స్థానాల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉంది. గెలిచే అవకాశం లేకపోయినా ప్రలోభాలు, దౌర్జన్యాలతో ఎమ్మెల్సీ స్థానం కైవసం చేసుకోవాలని దిగజారుడు రాజకీయాలు చేస్తోంది.

మంత్రి మతిభ్రమించిన వ్యాఖ్యలు
మంత్రి గంటా శ్రీనివాసరావు మతి భ్రమించిన వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్సీపీ పతనం కడప నుంచే అంటూ మాట్లాడి టీడీపీ పతనాన్ని కొని తెచ్చుకుంటున్నారు.  ఈయనొక్కరే కాదు, టీడీపీ నేతలందరిదీ ఇదేమాట. కడప జిల్లాలో వైయస్సార్సీపీకి వున్న ‘బలం’ తగ్గించేందుకు అధికార పార్టీ పడుతున్న తాపత్రయం చూస్తే, నవ్వు రాకుండా వుండదు. 

కొనాలంటే కుదరదు కనుకే...
వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థిగా వైయస్‌ వివేకానందరెడ్డి కాకుంగా మరెవరన్నా అయితే టీడీపీ నాయకులు ఇంత గొడవలు చేసే వారు కూడా కాదు. గెలిచినవారిని షరామామూలుగానే డబ్బులు, అధికారం ఎరచూపి కొనేయడమే బెటరని భావించేవారు. అయితే వివేకానందరెడ్డి సాక్షాత్తు వైయస్‌ జగన్‌ బాబాయి కావడంతో అమ్ముడయ్యే ఛాన్సే ఉండదు. అందుకే అధికారం, బలగాలను ఇక్కడ మోహరించి ఎలాగైనా గెలిచి తీరాలని కంకణం కట్టుకున్నారు. దీంతోపాటు కర్నూలు జిల్లా నుంచి బరిలో ఉన్న గౌరు వెంకట్‌రెడ్డి కూడా వైయస్‌ జగన్‌కు ఆత్మీయుడు. పైగా ఆయన భార్య ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక నెల్లూరు నుంచి ఆనం విజయకుమార్‌రెడ్డి బరిలో ఉండగా ఆయన్ను కొనగలిగే పరిస్థితి టీడీపీకి లేదు. ఎందుకంటే ఇన్నాళ్లు సోదరులు ఆనం వివేకా, ఆనం రామనారాయణరెడ్డి దెబ్బకు రాజకీయ భవిష్యత్తు లేకుండా ఉన్న విజయకుమార్‌రెడ్డి వైయస్‌ఆర్‌సీపీలో చేరిన తర్వాతనే రాజకీయంగా పుంజుకున్నాడు. వారిని ఢీకొనాలంటే ఈయన వైయస్‌ జగన్‌తో  ఉండక తప్పని పరిస్థితి. ఇవన్నీ ఆలోచించే టీడీపీ నాయకులు అధికారాన్ని ఉపయోగించి బెదిరింపులకు దిగుతున్నారు. ఏదేమైనా వంద గొడ్లను తిన్న రాబందులు కూడా చిన్న గాలి వానకు చచ్చినట్టు.. టీడీపీ అరాచకానికి కూడా ఎక్సపయిరీ డేట్‌ రాకుండా పోదు.. 

తాజా ఫోటోలు

Back to Top