కలుషిత నీరు ...ప్రాణాలు పోతున్నా పట్టని సర్కారు

 ఎన్టీఆర్ సుజల స్రవంతి అన్నాడు చంద్రబాబు. ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకం పేరుతో కార్డులు కూడా ప్రింటు చేసారు. లాంఛనంగా వాటిని నేతలు ఒకరికొకరు అందించుకున్నారు. కానీ లబ్దిదారుల్లో అవి ఎందరికి పంచారో..ఎందరు వాటిని వాడారో...ఎందరికి సురక్షిత మంచినీరు అందిందో ఓ లెక్కా పత్రం అయితే లేదు. కానీ ప్రపంచ స్థాయి రాజధాని నగరం కట్టే గుంటూరులో మాత్రం కలుషిత మంచినీరు తాగి పదుల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు. కుళాయిలో వచ్చే మంచినీరంటేనే గుంటూరు వాసులు భయంతో వణికిపోతున్నారు. ఈ కలుషిత నీటిని తాగి ఇప్పటికే 1600 మంది ఆసుపత్రుల పాలయ్యారు. డయేరియా బారిన పడి ప్రభుత్వాసుపత్రుల్లో చేరుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. కలుషిత నీటిని తాగి, డయారియాతో గుంటూరులో 15  మంది  వరకు ఇప్పటికే మరణించారు. కానీ ప్రభుత్వాధికారులు మాత్రం లెక్కలు దాచిపెట్టి కేవలం ఆరుగురు మాత్రమే చనిపోయినట్టు రికార్డులు చూపుతున్నారు. మృతుల సంఖ్యను తగ్గించి, వాస్తవాలను దాచిపెట్టినంత మాత్రాన ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపించకుండా పోతుందా? అసమర్థత అర్థం కాకుండా ఉంటుందా??


ప్లాంటులేమయ్యాయి

ప్రజలకు శుద్ధి చేసిన తాగునీరు అందించడంలోనూ బాబు విఫలం అయ్యారు. అంతర్జాతీయ రాజధాని అని గొప్పలు చెప్పుకునే బాబు రాజధాని ప్రజల కనీసావసరాలను కూడా తీర్చలేకపోతున్నాడు. ఎన్నికల ముందు రాష్ట్రంలో అందరికీ సురక్షిత తాగునీరు అందిస్తానని చెప్పిన పెద్దమనిషి దాని గురించి పట్టించుకోవడమే మానేసాడు. ఎన్టీఆర్ పేరుతో నీటిశుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేసి సురక్షిత నీరు ఇస్తామని మాటిచ్చి దాన్ని నీటిమూట చేసేసాడు. దాతల సాయంతో ఆర్భాటంగా అక్కడక్కడా మొదలెట్టిన ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్లాంట్లు రాష్ట్రంలో చాలా వరకూ మూతబడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ ప్లాంట్లు లేనే లేవు. నియోజక వర్గానికొకటి చొప్పున కూడా వీటిని ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్లాంట్లు రాష్ట్రం మొత్తం మీద 500 కూడా లేవంటే ఈ పథకం మీద బాబు చిత్తశుద్ధి ఏమిటో అర్థం అవుతుంది. తొలుత గ్రామానికో శుద్ధ నీటి ప్లాంటు అని ఊదరగొట్టారు చంద్రబాబు. తర్వాత దాన్ని ప్రతి 15 ఊళ్లకూ ఒకటి అని మాట మార్చారు. చివరకు ఆ పని కూడా చేయలేదు. తొలి బడ్జెట్ లో ఈ పథకానికసలు నిధులే కేటాయించలేదు. ప్రతిపక్షం విమర్శించడంతో తర్వాత బడ్జెట్ లో కేవలం 11 కోట్లు మాత్రం విడుదల చేసింది. కానీ తెలుగు ప్రజల ఖర్మమేమిటంటే వాటిని వినియోగించకుండానే మురగబెట్టింది.

అతి తక్కువ ఖర్చుతో జరిగే చిన్న హామీని కూడా చంద్రబాబు నెరవేర్చనేలేదు. గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందించే ఉద్దేశ్యంతో 2రూపాయిలకే 20 లీటర్ల నీరు అని బాబు చెప్పిన పథకం ఆచరణలో అమలుకు నోచుకోలేదు. కొన్నిచోట్ల 5రూపాయిలు, 10రూపాయిలకు కూడా ఈ నీటిని అమ్మిన దాఖలాలున్నాయి. ఇంటింటికీ సుజలం అందిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టి, ముఖ్యమంత్రి గా బాబు చేసిన తొలి అయిదు సంతకాల్లోని ఒకటైన  ఈ పథకం నీరుగారిపోయింది. ఇక ప్రభుత్వ కుళాయిల నుంచి వచ్చే నీరు సరైన శుద్ధి జరగక, నిర్వహణా లోపాల వల్ల కల్తీ అవుతోంది. ఆ నీటిని తాగిన ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఆసుత్రుల పాలౌతున్నారు. 

కలుషిత నీటి మరణాలపై స్పందించని ముఖ్యమంత్రి


రోడ్డుమీద చిత్తుకాగితం పడ్డా నా డాష్ బోర్డుమీద కనిపిస్తుందని చెప్పే హైటెక్ సిఎమ్ కు తన రాజధాని సమీపంలో జరుగుతున్న కలుషిత నీటి మరణాల గురించి తెలియపోవడం శోచనీయం. లేక తెలిసే వాటిపై స్పందించడం లేదంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నిర్లక్ష్యానికి పరాకాష్ట. ట్రిక్కులు చేస్తూ, టెక్నాలజీ గురించి మాట్లాడుతుంటే అభివృద్ధి జరగదు. మౌలిక వసతులను విస్మరించి, టెక్నాలజీ వెనక పరుగులు తీస్తే వచ్చేది అభివృద్ధి కాదు. ప్రజల అవసరాలను పట్టించుకోకుండా పెట్టుబడులంటూ కోట్లు దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వాన్ని, వేసవి వస్తే చాలు తాగు నీటి ఇక్కట్ల గురించి కొంచెమైనా పట్టించుకోని అధికారులను, తమ స్వలాభం కోసం ప్రాజెక్టులను ఆలస్యం చేస్తూ నీటి కరువుకు కారణం అవుతున్న రాజకీయ పరిస్థితులను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. చంద్రబాబు లాంటి అసమర్థ సిఎమ్ చేతికి రాష్ట్రాన్ని అప్పగించినందుకు తలపట్టుకుంటున్నారు. 


Back to Top