‘ఉపాధి’కి రాజకీయ గ్రహణం

–జన్మభూమి కమిటీ సభ్యుల జోక్యంతో నిలిసిపోయిన పనులు
– రెండేళ్లుగా భర్తీకాని ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టు
–పనులు లేక వలస వెళ్తున్న కూలీలు
 
 ప్రకాశం(పొదిలి): ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో ఉపాధి పనులకు రాజకీయ గ్రహణం పట్టింది. గ్రామంలో కొందరు అధికార పార్టీ నాయకులు  ఉపాధి పనులు చేయకుండా, తాము చేప్పిన వారికే జన్మభూమి కమిటీ సభ్యుల సంతకంతో  ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పదవి ఇవ్వాలని ఇబ్బందులు పెడుతున్నారు. పనులు కల్పించాల్సిన ఉపాధి సిబ్బంది చోద్యం చూడటంతో రెండేళ్లుగా ఉపాధి కరువైంది. ఈ విషయంపై మండల స్ధాయి అధికారులను కలిసి మొరపెట్టుకున్న పట్టించుకున్న పాపాన పోలేదు. పొదిలి మండలం  సలనూతల పంచాయతీలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా లుంజల అచ్చయ్యను నియమించారు. అయితే టీడీపీ నాయకులు వివిధ సాకులతో  అచ్చయ్యను ఈ పదవి నుండి తొలగించారు. తర్వాత కందుల సన్నీబాబును ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా నియమించుకోగా ఆయన 75 శాతం కన్నా తక్కువ పనులు చేశారన్న కారణంతో సన్నీబాబును సస్పెండ్‌ చేశారు. దీంతో రాష్ట్రంలోని ఫీల్డ్‌ అసిస్టెంట్లు కోర్టును ఆశ్రయించారు.ఈ క్రమంలో కొత్తగా మరొకరిని నియమించకపోవడంతో సలనూతలకు ఫీల్డ్‌ ఆఫీసర్‌ లేడు. ఈ విషయమై చాలా సార్లు అధికారులను కలిసి విన్నవించినప్పటికి మీ ఊరులో ఉన్న రాజకీయ నాయకులను కలిసి సమస్య పరిష్కారించుకోండి అనడంతో ప్రజలు ఖంగుతిన్నారు. 

ఫీల్డ్‌ ఆఫీసర్‌ ప్రపోజల్‌ లిస్ట్‌లో అధికార పార్టీ నాయకుల పేర్లు తప్ప వైయస్‌ఆర్‌సీపీకి చెందిన వారి పేర్లు ఒక్కటి కూడా లేదు. టీడీపీకి చెందిన నాయకులు గతంతో పీల్డ్‌ అసిస్టెంట్‌ను మేమే తొలగించాం, ఇప్పుడు మేమే తిరిగి నియమిస్తాం అనడంతో గ్రామంలో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. గతంలో నిర్మించిన మరగుదొడ్లకు బిల్లులు రాలేదని, గ్రామంలో తగినన్ని మరుగుదొడ్లు నిర్మించాలని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామంలో చెరువులు, కుంటల్లో ఉపాధి పనులు చేయడానికి వీలుగా ఉన్నప్పటికి కేవలం రాజకీయం కోసం ఉపాధి పనులు నిలుపుదల చేశారు. వర్షాలు లేక పంటలు పండక తీవ్ర కరువు పరిస్ధితులలో రెండు సంవత్సరాల నుంచి∙ఉపాధి పనులు ప్రారంభం కాకపోవడంతో ఇప్పటికే చాలా మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి  తమకు ఉపాధి పనులు కల్పించాలని వ్యవసాయ కూలీలు కోరుతున్నారు. 
Back to Top