పోలవరానికి చంద్రగ్రహణం

నేటి అసెంబ్లీ సమావేశాలను చూస్తే అబద్ధాలన్నీ పోగేసుకుని ఒకేచోట మైకు ముందు కూచున్నాయనిపిస్తుంది. ఒక పక్క ప్రతిపక్ష నేత చంద్రబాబు అబద్ధాలను మండుటెండలోనూ ఎండగడుతుంటే, మరోపక్క ప్రభుత్వం కొత్త అబద్ధాలను అవలీలగా అల్లుకుంటూ పోతోంది. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు మొదలు పెట్టి ఆయనే పూర్తి చేస్తున్న చందంగా చర్చ సాగింది. అన్నిటికంటే హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే స్వయంగా చంద్రబాబు కేంద్రం ఈ ప్రాజెక్టు తనకు అప్పగించిందని చెప్పుకోవడం.  దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డిపై విమర్శలు చేయడంతో తమ కుత్సిత బుద్ధులను పచ్చపార్టీ నేతలు మరోసారి బైట పెట్టుకుంటూ అస్సలు పొంతనలేని అభియోగాలు చేసారు. చివరికి అప్పటి టెండర్ల రద్దుపై సైతం రాద్ధాంతం చేయాలని చంద్రబాబు  కుతంత్రాలు పన్నారు. ప్రతిపక్షం ప్రజలను రెచ్చగొడుతోందంటూ తమ అక్కసంతా వెళ్లగక్కుకున్నారు.
చంద్రబాబు ఇంకా ఆయనగారి భజన బృందాలకు అడ్డుచెప్పేవాళ్లు లేకపోవడంతో అసెంబ్లీని కాస్తా చంద్రబాబు కీర్తి సభగా మార్చేసారు తెలుగు తమ్ముళ్లు. పోలవరం పనుల్లో అవకతవకలపై గానీ, పునరావాసం కోసం తీసుకునే చర్యలుగానీ ఒక్కరూ ప్రస్తావించిందేలేదు. కేవలం బాబుని స్తుతించుకుంటూ తరించారు సభ్యులు. 

నిజాలేమిటి…?

ఎవరెంత గింజుకున్నా, పచ్చరంగు పూసి పతాక శీర్షికలకెక్కినా పోలవరం ప్రారంభించి, శరవేగంతో పనులు చేయించిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డికే చెందుతుంది. చంద్రబాబు చెబుతున్నట్టు రాష్ట్రాలతో ఉన్న సమస్యలు కేవలం ఇప్పటివే కాదు. రాజశేఖర్ రెడ్డిగారి హయాంలోనూ ఒరిస్సా, కర్ణాటక, మధ్యప్రదేశ్ ప్రభుత్వాల నుండి ఒత్తిడులు ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నించే ఆయన పోలవరం గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. ముంపు గ్రామాల ప్రజలకు ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించడం, ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం, గిరిజనుల హక్కులు  వీటన్నిటి కోసం కలెక్టర్లు, ఇతర అధికారులతో అనేక  సదస్సులు ఏర్పాటు చేసి ఆప్రాంతంలో ఏకాభిప్రాయం సాధించారు. ముంపు  గ్రామాలకు కాలనీలు ఏర్పాటులోనూ సఫలీకృతులయ్యారు. 2006 ఏప్రిల్ సమయానికే 6 కాలనీల పనులు ప్రారంభించారు వైయస్సార్. పోలవరం కుడి, ఎడమ కాలువల పనులతో పాటు హెడ్ వర్క్స్ లో భాగంగా స్పిల్ వే, ట్విన్ టన్నెల్స్, కుడి, ఎడమ కనెక్టివిటీల నిర్మాణాలు వైయస్సార్ హయాంలోనే మొదలయ్యాయి. ఇక నిర్మాణ పనులను దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ పనులు మందకొడిగా చేస్తుండటంతో స్పిల్ వే, ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం, పవర్ హౌస్ టెండర్లను వైయస్ రద్దు చేసారు. 

వైయస్ హయాంలోనే జరిగిన అధికశాతం పనులు

పోలవరం శరవేగంగా జరగడానికి చంద్రబాబే కారణం అంటూ  మాట్లాడుతున్న నేతలకు వైయస్సార్ పోలవరం ఆలోచన వచ్చింది మొదలు దాని పనులకున్న ఆటంకాలను తొలగించుకుంటూ, ఎంత వేగంగా పోలవరాన్ని ఆరంభించారన్న వాస్తవాన్ని మరిచిపోయినట్లు నటిస్తున్నారు. 2004లో పాడుబడ్డ పోలవరం శిలాఫలకానికి అభిషేకం చేసి రూ. 10151 కోట్ల వ్యయంతో పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పారు. వెంట వెంటనే 1,320కోట్లు, 1353కోట్లు విడుదల చేసారు. 2005లోనే స్థలం, పర్యావరణం క్లియరెన్సులు సాధించారు. 2007లో ఆర్ ఆర్, 2008లో వైల్డ్ లైఫ్ సాంచురీ మరియూ అటవీ శాఖ, 2009లో టెక్నికల్ ఎడ్వైజరీ కమిటీ, నేషనల్ వైల్డ్ లైఫ్ క్లియరెన్సులను సాధించిన ఘన వైయస్ఆర్ ప్రభుత్వానిది. ఏ క్లియరెన్సూ లేదంటూ ప్రతిపక్షంలో ఉన్న నాటి చంద్రబాబు విమర్శిస్తూనే ఉన్నారు. అయినా ప్రాజెక్టును పనిని పరుగులు పెట్టిస్తూనే ఈ క్లియరెన్సులన్నీ సాధించారు వెయస్సార్. 

విమర్శించిన వారికి చెంపపెట్టులా…

డిజైన్ల లోపాలంటూ యాగీ చేసిన ప్రతిపక్షానికి ఎలాంటి మార్పులు చేర్పులు లేని పోలవరం క్లియరెన్స్ ను తెచ్చి కళ్లముందు చూపించారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. 10వేల కోట్ల అంచనాతో ఆరంభించిన పోలవరం ప్రాజెక్టుకు 4వేల కోట్లు ఖర్చుచేసి మరో మూడేళ్లలో పూర్తి చేసి చూపిస్తానని చెప్పిన వైయస్సార్ హఠాత్తుగా మరణించారు. అప్పుడు ఆగిపోయిన ఆ బృహత్ కార్యం ఇప్పుడు రాజకీయ నేతల చేతిలో కీలు బొమ్మ అయ్యింది. 

నిజాలు కళ్లముందు ఇలా కనిపిస్తుంటే పచ్చ నేతలు మాత్రం పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు. కాలవల పక్కన, ప్రాజెక్టుల వద్ద నిద్దరపోయి చంద్రబాబు పోలవరాన్ని పూర్తి చేస్తున్నాడంటున్నారు. అపర భగీరధుడిగా చంద్రబాబును కీర్తిస్తూ భజన చేస్తున్నారు. మరికొందరైతే పోలవరం కోసం చంద్రబాబు రాళ్లుమోస్తాడనీ, కూలీ గా కూడా మారతాడని అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మీసాల గీత మాట్లాడుతూ పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయని చంద్రబాబుకు కితాబిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం పోలవరాన్ని వేగంగా పూర్తి చేస్తోందని పార్లమెంట్ లో కేంద్ర జలవనరుల శాఖామంత్రి చెప్పారంటూ రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమ జబ్బలు చరుచుకున్నారు.
ఇక చంద్రబాబైతే తన ముందుచూపుకు కారణమే పట్టిసీమ అని సొంత డప్పా అదేపనిగా కొట్టుకున్నారు. అదే నిజమైతే కేంద్రం మసూద్ కమిటీని ఎందుకు నియమించినట్టు. ఆ వచ్చిన కమిటీ సైతం పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయని నివేదిక ఎందుకిచ్చినట్టు…? కాంట్రాక్టర్లకున్న సత్తా నుంచి, నిర్వాసితులకు పునరావాసం దాకా ఎందులోనూ పనులు సవ్యంగా జరగడం లేదంటూ కమిటీ ఎందుకు చెప్పినట్టు…? కేంద్రం డిజైన్ల విషయంలో ఎడ్వైజరీ కమిటీని వేసి దాని అనుమతి తీసుకోవాలని మెలిక ఎందుకు పెట్టినట్టు…? వీటికి బాబు అండ్ కో సమాధానం చెప్పదు. అన్నిటికంటే విడ్డూరమైన విషయం ఏమిటంటే 371 ముంపు గ్రామాలుండగా కేవలం 14 గ్రామాలకు మాత్రమే పునరావాశం కల్పించినట్టు చంద్రబాబే స్వయంగా ప్రకటించారు. ఇక ప్రాజెక్టు పనుల్లోనూ జాప్యం జరుగుతున్న కారణంగానే మరో కాంట్రాక్టరుకు పనులు అదనంగా అప్పగిస్తున్నట్టు ఒప్పుకున్నారు. అయితే రాజశేఖర్ రెడ్డి పని చేయలేకపోయిన కాంట్రాక్టరును పక్కనబెట్టి కొత్త టెండర్లను పిలిస్తే, చంద్రబాబు మాత్రం పాత వారిని అలాగే ఉంచి, మరో కొత్త కాట్రాక్టరుకు పనులు కట్టబెట్టారు. ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్టు వాడటంలో చంద్రబాబుకు సాటి ఎవరూ లేరు కదా…

మెత్తానికి పోలవరం పై చర్చ పేర మరోరోజు చంద్రబాబు భజన కార్యక్రమం యథావిధిగా సాగింది. ఫిరాయింపుపై చర్యలు తీసుకోమని కోరుతూ సభను బహిష్కరించిన ప్రతిపక్ష నేతను విమర్శించుకుంటూ కాలయాపన జరిగింది. ఇదీ నేటి అసెంబ్లీ సమావేశాల విశేష సమాహారం. చూసే ప్రజలకు అర్థం కాదా ఏకపక్ష వ్యవహారం. ….!!!!Back to Top