పెట్టబడులుల లేవు.. ఒప్పందాలూ లేవు


– ఎంఓయూలకు డీపీఆర్‌లే సమర్పించకుండా దొంగ లెక్కలు
– పాత పరిశ్రమలనే కొత్తగా చూపిస్తూ మోసం 
– భాగస్వామ్య సదస్సులన్నీ ఒట్టి బూటకం

భాగస్వామ్య సదస్సు ద్వారా మరోసారి అంకెల గారడీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈనెల 24 నుంచి 26 వరకు విశాఖలో జరిగే సదస్సుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. విశాఖ కేంద్రంగా 2016, 17 సంవత్సరాల్లో నిర్వహించిన సదస్సుల్లోనూ ఇదే తరహా ప్రచారం చేసిన ప్రభుత్వం చివరకు పెట్టుబడులు రాబట్టడంతో మాత్రం విఫలమైంది. ఆ రెండు సదస్సుల్లో ప్రభుత్వం లెక్కల ప్రకారం రూ. 15.3 లక్షల కోట్ల విలువైన 994 అవగాహన ఒప్పందాలు జరిగాయి. వీటిలో రూ. 32.735 కోట్లు పెట్టుబడుతలతో పరిశ్రమలు వచ్చాయని అధికారులే అంటున్నారు. వాస్తవానికి ఇందులో కార్యరూపం దాల్చిన పరిశ్రమలు పావు వంతు కూడా ఉండవు. 2016లో జరిగిన సదస్సులో రూ. 4.76 లక్షల కోట్ల విలువైన 328 ఒప్పందాలు జరిగినట్టు ప్రభుత్వం తెలిపింది. వీటి ద్వారా 9.58 లక్షల ఉద్యోగాలు రా్రçష్టానికి వస్తాయని పేర్కొంది. 2017 భాగస్వామ్య సదస్సులో రూ. 1054 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులతో 666 ఒçప్పందాలు చేసుకున్నట్టు, 23.34 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది. ఈ రెండు సదస్సుల్లో మొత్తం 31.92 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని నమ్మబలికింది. అయితే అధికారుల నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 137 పరిశ్రమలు మాత్రమే ఉత్పత్తిలోకి వచ్చాయి. వీటిలోనూ భారీ స్థాయిలో ఉపాధి కల్పించే పరిశ్రమలు అతి తక్కువ. 16 పరిశ్రమలు ఉత్పత్తికి సిద్ధమవుతున్నాయని, మరో 17 పరిశ్రమలు యంత్రసామాగ్రిని సమకూర్చకుంటున్నాయని ఇంకో 53 పరిశ్రమలు సివిల్‌ పనులు పూర్తిచేసే దశలో ఉన్నాయని తెలిపారు. ఇవన్నీ కలిపి రూ. 67,890 కోట్ల పెట్టుబడులే రాష్ట్రానికి వచ్చినట్టని అధికారుల లెక్కలు తేల్చాయి. ఇవన్నీ ఎప్పటికి వాస్తవ రూపం దాలుస్తాయన్న విషయాన్ని అధికారులే చెప్పలేకపోతున్నారు. 
పాత పరిశ్రమలకే కొత్త ముసుగు...
పెట్టుబడుల ఆకర్షణల విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్పత్తిలో ఉన్న పరిశ్రమలు విస్తరణకు సిద్ధమైన పరిశ్రమలను కొత్తగా వచ్చినట్టు చెప్పే ప్రయత్నం చేస్తోంది. దేశవ్యాప్తంగా వ్యాపారం చేస్తూ రాష్ట్రంలో కూడా చేయడానికి ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్న కంపెనీలను కూడా కొత్తగా వచ్చినట్టే చూపించింది. ఆ సంస్థల్లో ఇతర రాష్ట్రాల్లో పనిచేసే వారిని కూడా ఉపాధి లెక్కల్లో చూపింది. రోజువారీ కూలీలను కూడా శాశ్వత ఉద్యోగులుగా చూపించింది. ఇంత చేసినా ఎంఓయూల పురోగతి రెండు శాతం కూడా లేదని అధికారవర్గాలే అంటున్నాయి. కొన్ని సంస్థల్లో పెట్టుబడులు, లభించిన ఉపాధి పరిశీలిస్తే.. 
– విశాఖలో రెండు దశాబ్దాల క్రితమే ఏర్పాటైన హిందూజా నేషనల్‌ పవర్‌ కార్పొరేషన్‌తో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. ఈ ప్లాంట్‌తో 2016 భాగస్వామ్య సదస్సుల్లో ప్రభుత్వం మళ్లీ ఎంఓయూ చేసుకుని 5545 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 700 మందికి ఉపాధి లభించిందని టీడీపీ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంది. 
– నెల్లూరు జిల్లాలో గాయత్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఎప్పటి నుంచో ఉత్పత్తిలో ఉంది. 2016లో విదేశీ కంపెనీ సెంబ్‌కార్ప్‌ భాగస్వామ్యమైంది. కొత్తగా వచ్చిన పెట్టుబడి ఏమీ లేకపోయినా.. ప్రభుత్వం మాత్రం రూ. 8580 కోట్లు పెట్టుబడులు వచ్చాయని.., 1620 మందికి ఉపాధి లభించిందని ప్రకటించింది. 
– కృష్ణా జిల్లాలో ఓ మెరైన్‌ ఎక్స్‌పోర్టు కంపెనీతో రూ. 22 కోట్లు పెట్టుబడి పెట్టిందని, దీంతో 1500 మందికి ఉపాధి లభించిందని వెల్లడించి.. మత్స్యకారులు, దినసరి కూలీలను ఉపాధి పొందిన వారి జాబితాలో చూపింది. 
– అనంతపురంలో ఓ సంస్థ బేసిక్‌ మెటల్స్, అల్లాయిస్‌ ఇండస్ట్రీని రూ. 400 కోట్ల పెట్టుబడితో స్థాపించినట్టు, దీనివల్ల 2800 మందికి ఉపాధి కల్పించినట్టు ప్రభుత్వం లెక్కచూపింది. దేశవ్యాప్తంగా ఆ సంస్థలో పనిచేసే వాళ్లందరినీ ఇక్కడే ఉపాధి పొందుతున్నట్టు చెప్పకొచ్చింది. 
– చిత్తూరు జిల్లాలో షాహీ ఎక్స్‌పోర్టు కేవలం రూ. 143 కోట్ల పెట్టుబడి పెట్టి, 11 వేల మందికి ఇస్తున్నట్టు లెక్కచెప్పారు. 
అసలు నిజాలు 
– 2017లో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 
2016లో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో రూ. 478788 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 331 ఎంఓయూలపై ఏపీ ప్రభుత్వం సంతకాలు చేస్తే.. వీటిలో రూ. 2,83,943 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 99 ఎంఓయూలపై ఇంతవరకు డీపీఆర్‌లు సమర్పించలేదని కేంద్రమంత్రి తెలిపారు. 
– అలాగే రూ. 31 వేల కోట్ల పెట్టుబడులు అంచనాలతో కుదుర్చుకున్న మరో 6 ఒప్పందాలు రద్దయ్యాయని కేంద్ర మంత్రి తెలిపారు. 
– ఇక 2017లో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో రూ. 10,54,431 కోట్ల పెట్టుబడులకు సంబంధించి వాటిలో రూ. 633,892 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 335 ఎంఓయూలపై ఇంకా డీపీఆర్‌లు సమర్పించలేదని కేంద్ర మంత్రి వెల్లడించారు. 
–  రూ. 1,75,000 కోట్ల పెట్టుబడుల అంచనాలతో కుదుర్చుకున్న మరో 12 ఒప్పందాలు రద్దయ్యాయని కేంద్రమంత్రి ఆగస్టు1, 2017న రాజ్యసభలో వెల్లడించారు. 

 
Back to Top