దురహంకారానికి దుడ్డుకర్రతో జవాబు

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నుంచి, ఆయన పార్టీ నేతలు అందరికీ నోటి తీట ఎక్కువే అని ప్రజలు ఆగ్రహిస్తున్నారు. కుల రాజకీయాలు చేస్తూ, ఇతర కులాలని దూషిస్తూ, చులకన చేస్తూ మాట్లాడటం వారి అహంకారానికి నిదర్శనం అని ఆరోపిస్తున్నారు. మార్కెటింగ్ శాఖా మంత్రి ఆదినారాయణ రెడ్డి దళితులను కించపరిచేలా అన్నమాటలు చూస్తే ఆ విషయం మరోసారి తేటతెల్లం అవుతోంది. శుభ్రత ఉండదని, చదువుకోరని, రిజర్వేషన్ లతో అధికారాలు పొందుతున్నారంటూ ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వారి కుల దురహంకారానికి నిదర్శనం. మునుపు చంద్రబాబు కూడా ఎస్సీల గా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ నీచమైన తన బుద్ధిని బైటపెట్టుకున్నాడు. ఆ విత్తు మొక్క విషమే ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి రూపంలో దళితులను అవమానిస్తోంది. ఈ మహానుభావుడు ప్రస్తుతం గోస్పాడు మండలానికి టిడిపి ఎన్నికల ఇన్ ఛార్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. టిడిపి ప్రభుత్వం దళితులను నెత్తిన పెట్టుకుంటుందని ప్రచారం చేస్తున్న నోటితో ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలను చేస్తున్నాడు. 

దళితులను ద్వేషించడం, దాడులు చేయడం, వారి హక్కులను కాలరాయడం టిడిపి ప్రభుత్వం ఎప్పటినుంచో చేస్తున్నపనే. గరగపర్రులో దళితులను అవమానించిన టిడిపి అనుయాయులను కాపాడి, వారికి అన్యాయం చేసిన బాబు, కనీసం వారిని పరామర్శించడానికి సైతం వెళ్లలేదు. సొంత పార్టీ టిడిపి ఎమ్ పి శివప్రసాద్ లాంటి వాళ్లు ఎస్సీ ఎస్టీలను చంద్రబాబు వివక్షతో చూస్తున్నారంటూ బహిరంగంగానే నిలదీశారు. అందులోనూ తూర్పుగోదావరి, గుంటూరు లకు చెందిన ఎస్సీలకు మంత్రి వర్గంలో స్థానం ఇచ్చి, రాయలసీమ ఎస్సీ ఎమ్మెల్యేలను చిన్నచూపు చూడటం గమనిస్తే చంద్రబాబు ప్రాంతాల వారీగానూ ఎలా చిచ్చు పెడతాడో తెలుస్తోంది. 

చిత్తూరు జిల్లా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడంతో వెనక్కి పోయాయి. దీనిపై కమిటీలు, విచారణలు అంటూ నాన్చి కథను కంచికి పంపింది టిడిపి ప్రభుత్వం. అలాగే ప్రత్యేక ప్యాకేజీగా కేంద్రం వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధి కోసం ఇచ్చిన నిధులనూ ఉపయోగించలేదు. వాటిపై ఇటీవలే నీతి ఆయోగ్ బాబు సర్కార్ ను బహిరంగలేఖతో నిలదీసింది. దళితులను, వారు అధికంగా ఉన్న వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచాలన్నదే టిడిపి అధినేత చంద్రబాబు కుట్ర అని ఎవరికైనా అర్థం అవుతుంది. అధికారంలోకి వచ్చిన నాటి నుండీ దళితులను విమర్శించి, వారికి ఇచ్చిన హామీలను గాలికి వదిలి, ఎన్నికల సమయంలో మాత్రం ఎంతో ప్రేమ నటిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. 

కాపులను బిసిల్లో చేరుస్తామంటూ 2014 ఎలక్షన్లో చేసిన మాటను కూడా తప్పాడు చంద్రబాబు. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో, రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మరో కప్పదాటు పన్నాగం కూడా పన్నాడు. కాపు, తెలగ, బలిజలను ఈనాటిదాకా పట్టించుకోని చంద్రబాబు కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలు రావడంతో ఆయా నేతలతో ఆకస్మిక భేటీ పెట్టాడు. కాపు రిజర్వేషన్ల హామీ నెరవేర్చమని పోరాడుతున్న ముద్రగడను ఎదుర్కోలేక కాపుల మధ్యనే చీలిక తెచ్చాడు. ఉన్నట్టుండి విజయవాడలో టిడిపి అనుయాయులైన కాపు నాయకులను ప్రలోభపెట్టి సభ ఏర్పాటు చేసాడు. గత కొన్నాళ్లుగా కాపులకు విద్యా, ఉద్యోగాల్లో తప్ప రాజకీయాల్లో రిజర్వేషన్ అవసరం లేదంటూ కొత్త రాగం ఎత్తించాడు. చంద్రబాబు మాట జవదాటని, అందుకోసం సొంత సామాజిక వర్గ ప్రయోజనాన్ని కూడా బలిపెట్టే కొందరు స్వార్థ రాజకీయవాదులు బాబు చెప్పిన పలుకులని యథావిధిగా అప్ప చెబుతున్నారు. ‘’మనకోసం చంద్రబాబు ఎంతో చేస్తారు, నమ్మి ఆయనకు ఓటేద్దాం. తర్వాత చేయకపోతే అప్పుడే చూసుకుందాం’’ అంటూ కాపు సోదరులకు వారు జోల పాడటం మొదలెట్టారు. 
 
మూడేళ్ల క్రితం ఇచ్చిన మాటనే నిలబెట్టుకోని బాబును మళ్లీ ఇప్పుడు నమ్మమంటూ టిడిపి కాపు నేతలు కారుకూతలు కూస్తున్నారు. ఇన్నేళ్లుగా చంద్రబాబు ఊసరవెల్లి రూపాన్ని చూసిన కాపులు ఇంత బరితెగింపా అనుకుంటూ తమను ముంచుతున్న కాపు నేతలను, వారిని ఉసిగొల్పిన బాబును అసహ్యించుకుంటున్నారు. దళితులు, ముస్లింలు, మైనారిటీలు, కాపులు అన్ని సామాజిక వర్గాల వారు బాబు చేతిలో మోస పోయినవారే. మళ్లీ వాళ్లనే, అవే తన దొంగ మాటలతో, అబద్ధపు హామీలతో మోస పుచ్చి, పబ్బం గడుపుకోవాలనుకునే చంద్రబాబుకు వారు చెప్పే గుణపాఠం టిడిపి చరిత్రలో మరిచిపోలేనిదిగా ఉంటుందన్నది పచ్చినిజం. అటు నంద్యాల ఉప ఎన్నికలో, ఇటు కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలో ప్రజలు ఓటు అనే దుడ్డుకర్రతో టిడిపి నడ్డి విరగ్గొట్టడం ఖాయం. 
Back to Top