నంద్యాల నేతను ప్రజలు నిర్ణయించేసారు

-శిల్పా సోదరులవి ఆదర్శ రాజకీయాలు
-నీతిమాలిన నేతల్లా దొంగచాటు పనులు చేసే ఖర్మ పట్టలేదు
-రాజకీయాలకు అతీతంగా నంద్యాల అభివృధే ధ్యేయం
-మా కుటుంబాలకు రాజకీయ భిక్ష పెట్టింది వైయస్సారే
-ప్రాణాలున్నంత వరకూ జగన్ వెన్నంటి ఉంటాం 

నాయకుడంటే ప్రజలకు దగ్గరలో ఉన్నావాడు. నేత అంటే ప్రజలను నడిపించేవాడు. పార్టీలకు అతీతంగా ప్రజలకోసం పనిచేయగలిగేవాడు. నిజాయితీగా ఆలోచించాడు కనుకనే శిల్పా మోహన్ రెడ్డి అధికార పార్టీని విడిచిపెట్టి ప్రతిపక్ష పార్టీ అయిన వైయస్సార్సీపీలో చేరారు. అధికారం కోసం కాకుండా, విశ్వసనీయతను నమ్మిన నేత కనుకే వైయస్ జగన్ మోహన్ రెడ్డి శిల్పాకు నంద్యాల టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు. రాయల సీమ సమస్యలపై నిరంతరం ప్రశ్నిస్తూ, కర్నూలు అభివృద్ధి కోసం పాటుపడే తత్వం ఉన్నందుకే శిల్పా మోహన్ రెడ్డిని గెలిపిస్తామంటూ ప్రజలంతా మద్దతు పలుకుతున్నారు. నమ్మిన ప్రజలను, అవకాశమిచ్చిన పార్టీని మోసగించి, దగా చేసి వెళ్లిపోయిన నాయకులను నంద్యాల ప్రజలు నేడు ఛీ కొడుతున్నారు. 

ఒక పార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీ కండువా కప్పుకున్న దౌర్భాగ్యపు పనులు భూమా కుటుంబం చేసింది. అధికార పార్టీని వదిలి, ప్రజలకోసం పనిచేసే ప్రతిపక్ష పార్టీకి వచ్చిన చరిత్ర శిల్పా మోహన్ రెడ్డి. నంద్యాల కోసం పాటుపడేవారిని కాక, పార్టీకి పనికొచ్చే ఎమ్మెల్యేల సంఖ్యా బలం కోసమే టిడిపి చేసే నీతి మాలిన రాజకీయాలను చూసి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు శిల్పా మోహన్ రెడ్డి.  గత మూడున్నరేళ్లుగా నంద్యాల రోడ్ల గురించి అడిగితే అమరావతికే సొమ్ములు లేవన్న చంద్రబాబు ఉన్నట్టుండి వందల, వేల కోట్లు ఇస్తానంటే ప్రజలు మాత్రం ఇప్పుడు నమ్ముతారా? ఉప ఎన్నికల నేపథ్యంలో జరిగిన బహిరంగ సభలో శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడిన తొలి మాట నంద్యాల అభివృద్ధి గురించే. నంద్యాలను జిల్లాగా చేయాలంటూ జగన్ మోహన్ రెడ్డిని కోరారు శిల్పా. రాజకీయాల్లోకి అడుగు పెట్టక ముందు నుంచి రాయలసీమ రైతులకోసం పనిచేసారు. నంది రైతు సమాఖ్యలో కీలక పాత్ర పోషించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుండి సాగునీరు కావాలని ఉద్యమాలు నడిపారు. తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది వైయస్సార్ అని ఎప్పుడూ చెప్పుకుంటారు శిల్పా మోహన్ రెడ్డి. 

ఎప్పుడో జరిగిన ఘర్షణను రాజకీయ లబ్దికోసం తెరపైకి తేవడం టిడిపి, ఫరూక్ లు చేస్తున్న నీచ రాజకీయం. ప్రశాంతంగా ఉన్న నంద్యాలను ఎలక్షన్లకోసం అశాంతి పాలు చేయొద్దన్నారు శిల్పా మోహన్ రెడ్డి. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్న నంద్యాల ప్రజలకు, వైయస్ కుటుంబానికి తన తుదిశ్వాస వరకు వెన్నంటే ఉంటానని బహిరంగ సభ సాక్షిగా ప్రమాణం చేసారు శిల్పా. వైయస్ వెంట ఉన్నంతకాలం శిల్పాకు ఓటమిలేదు. నంద్యాల ప్రజలకు వైయస్ పై ఉన్న గురి, శిల్పాపై ఉన్న నమ్మకం అలాంటిది. కారణాలేమైనా సరే శిల్పా టిడిపిలో చేరి అదే నంద్యాల ప్రజల ముందుకు ఓట్లకోసం వెళ్లినపుడు ఓటమి ఎదుర్కోక తప్పలేదు. రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చినా నంద్యాలలో మాత్రం వైయస్ ఆశయాల వారసుడు జగన్ నాయకత్వాన్నే బలపరిచారు ప్రజలు. వైయస్ఆర్ కాంగ్రెస్ కే విజయాన్ని అందించారు. ఇప్పుడు శిల్పా మోహన్ రెడ్డి అదే వైయస్ఆర్ జెండాతో, జగన్ నినాదంతో మళ్లీ బరిలోకి దిగుతున్నారు. అంటే బ్యాక్ టు హోం అన్నమాట. ఇక గెలుపు తథ్యం అనడం అతిశయోక్తి కాదు.

అన్న బాటలోనే నడిచిన లక్ష్మణుడు శిల్పా చక్రపాణిరెడ్డి. అధికారపార్టీలో ఉన్నా, ఎమ్మెల్సీ పదవిలో ఉన్నా వాటిని వద్దనుకుని అన్న వెంట వచ్చి జగనన్న అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధమయ్యాడు. విలువలు, విశ్వసనీయత గల వైయస్సార్సీపీలో చేరేందుకు ఆదర్శవంతమైన రాజకీయమంటే ఏమిటో ప్రజలకు నిరూపించాడు చక్రపాణి రెడ్డి. లక్షలాది ప్రజల ముందు, ప్రజాస్వామ్యానికి నిర్వచనంలా తన రాజీనామాను అందించి మరీ వైయస్సార్ పార్టీలో అడుగు పెట్టారు. దొంగతనంగా, దొడ్డిదారిలో పార్టీ మారాల్సిన ఖర్మ తమకు లేదని నిరూపించారు శిల్పా సోదరులు. ప్రజాబలం, పార్టీ ప్రతిష్ట ఈ రెండూ నంద్యాలలో వారి విజయానికి మెట్లు. పదవులు, అధికారాలకోసం కాదు ప్రజలకోసం పనిచేసే శిల్పా సోదరుల వైపే తాము సైతం అంటున్నారు నంద్యాల ప్రజలు. ఇక ఆట మెదలైంది, వేటే మిగిలింది అనుకుంటున్నారు. పారాహుషార్ పచ్చపార్టీ. ప్రజావాహిని పవరేంటో తెలిసే రోజు దగ్గర్లోనే ఉంది.  

Back to Top