రోగులకు ప్రాణసంకటంగా ప్రభుత్వాసుపత్రులు...!

ఎలుకలు,పందికొక్కుల దాడులతో రోగుల బెంబేలు..!
గుంటూరు విషాదాంతం నుంచి కళ్లుతెరవని పాలకులు..!
ప్రభుత్వ నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు...!

అనంతపురంః ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వాసుపత్రులు రోగులకు ప్రాణసంకటంగా మారాయి.  పేదప్రజల కోసం ఏర్పాటు చేసిన సర్కారీ ఆస్పత్రుల్లో చంద్రబాబు మృత్యుఘంటికలు మోగిస్తున్నారు. అనారోగ్యం బారిన పడి ఆస్పత్రికి వచ్చిన రోగులపై ఎలుకలు, పందికొక్కులు దాడులు చేస్తుండడంతో బెంబేలెత్తుతున్నారు.  ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ రోగుల ప్రాణాలతో ఆటలాడుకుంటున్న పాలకులపై దుమ్మెత్తిపోస్తున్నారు. 

ఎలుకలు,పందికొక్కుల దాడులు..!
పచ్చప్రభుత్వం కళ్లు మూసుకుపోయాయి. నిత్యం సర్కారీ దవాఖానాలు ఎలుకలు, పాములు, పందికొక్కులకు అడ్డాగా మారుతున్నా కళ్లు తెరవడం లేదు. పచ్చసర్కార్  నిర్లక్ష్యానికి ఇటీవలే గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో అభం శుభం తెలియని ఓపసిపాప ప్రాణాలు కోల్పోయింది. ఎలుకలు దాడి చేయడంతో మృతిచెందింది. ఈసంఘటన నుంచి తేరుకునే లోపే ఎలుకలు మరో మహిళపై దాడి చేయడం భయాందోళనకు గురిచేసింది. వేళ్లు కొరికేయడంతో సదరు మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఈఘటన జరిగి 24 గంటలు గడవకముందే ఆస్పత్రిలోకి పాము చొరబడంది. దీంతో,  రోగుల ప్రాణాలు గాల్లో కలిసినంత పనైంది. 

పేదల ఆరోగ్యాన్ని కాలరాస్తున్న పాలకులు..!
గుంటూరు విషాదాంతం మరవకముందే తాజాగా  అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వాసుపత్రిలో మరో దారుణం జరిగింది. ఓ పందికొక్కు మహిళను గాయపర్చింది. కాన్పుల వార్డులో ఎర్రమ్మ అనే మహిళ కాలును పందికొక్కులు కరవడంతో తీవ్ర రక్తస్రావమైంది. వార్డులోని వారంతా లేచి పందికొక్కులను తరిమేశారు. ఇంత జరుగుతున్నా పచ్చనేతలు మొద్దు నిద్ర వీడడం లేదు. కార్పొరేట్ మాయలో పేదల ఆరోగ్యాన్ని కాలరాస్తున్నారు. ప్రాణాలతో చెలగాటమాడితే చంద్రబాబుకు తగిన గుణపాఠం తప్పదని ప్రజలు హెచ్చరిస్తున్నారు. వైద్యం సంగతేమోగానీ ముందు ఎలుకలు, పందికొక్కులను పట్టుకోవాలని సూచిస్తున్నారు.  

Back to Top