భూ దందా పై ఆగ్రహం

వెల్లువెత్తుతున్న ప్ర‌జాగ్ర‌హం
మొండిగా ముందుకు వెళుతున్న ప్ర‌భుత్వం
ఆందోళ‌న బాట లో విప‌క్షాలు, ప్ర‌జా సంఘాలు

గుంటూరు&విజ‌య‌వాడ‌: రాజ‌ధాని ప్రాంతంలో భూ సేక‌ర‌ణ చేసేందుకు ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌టంతో రాజ‌ధాని ప్రాంతం అట్టుడుకుతోంది. పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు, ధ‌ర్నాల‌కు ప్ర‌తిపక్షాలు, ప్ర‌జా సంఘాలు, రైతు స‌మాఖ్య‌లు స‌మాయ‌త్తం అవుతున్నాయి.

ప్ర‌జాగ్ర‌హం
భూ సేక‌ర‌ణ నోటిఫికేష‌న్ విడుద‌ల అవుతున్న‌ప్పుడే గుంటూరు, విజ‌య‌వాడ‌ల్లో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న జ‌రిగింది. విజ‌య‌వాడ‌లోని  సీఆర్‌డీఏ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం ఎదుట ఏపీ రైతు, రైతుకూలీ, వ్య‌వ‌సాయ కార్మిక సంఘం, వృత్తి దారులు, ప్ర‌జా సంఘాల ఐక్య కార్యాచ‌ర‌ణ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న నిర్వ‌హించారు. రాజ‌ధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లోని రైతులు పండించే కూర‌గాయ‌లు, పండ్ల‌తో ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. మంత్రి నారాయ‌ణ‌కు ద‌మ్ము, దైర్యం ఉంటే ఆయ‌న ఆస్తుల్ని రాజ‌ధాని నిర్మాణానికి ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

మొండిగా ప్ర‌భుత్వం
భూ స‌మీక‌ర‌ణ‌కు అంగీక‌రించని రైతుల మీద ప్ర‌భుత్వం క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు దిగిన‌ట్లు అర్థం అవుతోంది. వాస్త‌వానికి 33వేల ఎక‌రాల దాకా లాక్కొన్న‌ట్లు అధికారులు చెబుతూనే ఉన్నారు. అయినా స‌రే, ఈ 3 వేల ఎక‌రాలు లాక్కోవ‌ల‌సిందే అన్న పంతంతో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సింగ‌పూర్ కంపెనీలు, ప్రైవేటు సంస్థ‌ల‌కు అన్న మాట ప్ర‌కారం భూముల్ని అప్ప‌గించ‌ట‌మే ధ్యేయంగా ప్ర‌భుత్వ వైఖ‌రి కనిపిస్తోంది. ఈ నెలాఖ‌రుకు నోటిఫికేష‌న్ వ‌స్తుంది కాబ‌ట్టి ఈలోగానే భూముల్ని లాక్కోవ‌టం  ప‌నిని పూర్తి చేయాల‌ని భావిస్తోంది.

ఆందోళ‌న‌ల‌కు కార్యాచ‌ర‌ణ‌
ప్ర‌భుత్వ వైఖ‌రిపై మండిప‌డుతున్న విప‌క్షాలు, ప్ర‌జా సంఘాలు, రైతు స‌మాఖ్య‌లు ఉమ్మ‌డిగా ముందుకు క‌దులుతున్నాయి. ద‌శ‌ల వారీగా ఆందోళ‌న‌ను, కార్యాచ‌ర‌ణ ను ఖ‌రారు చేసుకొంటున్నాయి. ఆదివారం నాడు ప్ర‌కాశం బ్యారేజీ మీద రాస్తారోకో, సోమ‌వారం నాడు నిడ‌మ‌ర్రులోని సీఆర్డీయే కార్యాల‌యం ముట్ట‌డి, అదే రోజు సాయంత్రం బ‌హిరంగ స‌భ‌, మంగ‌ళ‌వారం నాడు నిడ‌మ‌ర్రు, బేత‌పూడి, ఉండ‌వ‌ల్లి, పెనుమాక‌, తాడేప‌ల్లి  మండ‌లాల్లోని భూ సేక‌ర‌ణ ప్ర‌భావిత గ్రామాల్లో బంద్ కార్య‌క్ర‌మం చేప‌డ‌తారు. ఈ నెల 26న అంటే బుధ‌వారం నాడు విజ‌య‌వాడ‌లోని సీఆర్‌డీఏ కార్యాల‌యం వ‌ద్ద జ‌రిగే దీక్ష లో ప్ర‌తిపక్ష నాయ‌కుడు, వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ పాల్గొనే అవ‌కాశం ఉంది. ఈ మేర‌కు వైఎస్సార్‌సీపీ నాయ‌కులు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌, అంబ‌టి రాంబాబు, జంగా కృష్ణ‌మూర్తి, కావ‌టి మ‌నోహ‌ర్ నాయుడు, ఇత‌ర ప‌క్షాల నాయ‌కుల‌తో చర్చించి కార్యాచ‌ర‌ణ ను రూపొందించారు. 
Back to Top