నల్లగొండ: నల్లగొండ జిల్లాలో శుక్రవారం ఉదయం నందిపాడు నుంచి ప్రారంభమైన వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర సాయంత్రం ఆలగడప వద్ద ముగిసింది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలను షర్మిల పరామర్శించారు. నల్గొండలో మూడో రోజు మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని నాలుగు కుటుంబాలను ఆమె పరామర్శించారు. నియోజకవర్గ పరిధిలోని నందిపాడు క్యాంపు, సల్కునూరు, మిర్యాలగూడ, ఆలగడపలలో నాలుగు కుటుంబాలను సందర్శించారు. ఆయా కుటుంబాలకు చెందిన వారితో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. <br/><br/>షర్మిల రాకతో ఆ కుటుంబాలు ఉద్వేగానికి లోనయ్యాయి. ఎంతో ఆప్యాయంగా తమను పలకరించిన వైఎస్ తనయను చూసి ఆనందబాష్పాలు రాల్చాయి. వైఎస్ లాంటి నాయకుడు రాడని, భవిష్యత్‌లో రాలేడని చెప్పిన వారు తండ్రి లాంటి నాయకుడిలా జగనన్నను తీర్చిదిద్దాలని దేవుడిని వేడుకుంటున్నట్టు షర్మిలకు చెప్పారు. షర్మిల కూడా పరామర్శకు వెళ్లిన కుటుంబాల సభ్యులతో ఎంతో ప్రేమగా ఉన్నారు. వారిని ఆప్యాయంగా పేరుపేరునా పలకరించారు. వారు తనపై ఉన్న అభిమానంతో చేసి పెట్టిన పాయసం, స్వీట్లు తిని, కుటుంబ సభ్యులకు తినిపించారు. మొత్తంమీద మూడోరోజు షర్మిల యాత్ర ప్రేమానురాగాల మధ్య సాగింది. <br/><br/>షర్మిల వెంట వైఎస్‌ఆర్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డితో పాటు రవీందర్, సుందర్‌రెడ్డి, కొండా రాఘవరెడ్డి, ముస్తఫా, జయరాజ్ తదితరులు ఉన్నారు.