పామర్రు పాదయాత్రకు పోటెత్తిన ప్రజాప్రవాహం

పామర్రు (కృష్ణా జిల్లా) : ‘మీ రాజన్న కూతుర్ని.. జగనన్న చెల్లెల్ని..’ అంటూ ప్రసంగం ప్రారంభించిన శ్రీమతి షర్మిల అందరి మనసులనూ చూరగొన్నారు. తన ప్రసంగంలో ప్రధానంగా చెరుకు, మినుము రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రస్తావించారు. గతంలో క్వింటాలు ఐదు వేలు పలికిన మినుముకు నేడు రూ. 3,600 కూడా రావడం లేదని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని శ్రీమతి విమర్శించారు. మహానేత డాక్టర్ వై‌యస్ ‌రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు పడ్డాయని, కృష్ణానదిలో పుష్కలంగా నీరు ఉండేదని ఆమె గుర్తుచేశారు. ప్రస్తుతం నీరు లేక ప్రజలు సాగు, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పాలకులు రాక్షసుల్లా మారిపోయి ప్రజలను పీడిస్తున్నారని నిప్పులు చెరిగారు.

చర్చిలో ప్రార్థనలు చేసిన శ్రీమతి షర్మిల :
శ్రీమతి షర్మిల పాదయాత్రం ఆదివారం ఉదయం ఉయ్యూరు సిబిఎం కాంపౌండ్ నుంచి ‌ప్రారంభమైంది. అక్కడే ఉన్న చర్చిలో ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఆమె పామర్రు నియోజకవర్గంలోని మంటాడ చేరుకున్నారు. అక్కడ వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం మంటాడలో ఏర్పాటుచేసిన రచ్చబండలో పాల్గొని మహిళలు, రైతుల కష్టాల్లో పాలుపంచుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి తాడంకి, గోపువానిపాలెం అడ్డరోడ్డు, కనుమూరు, కురుమద్దాలి, ఉరుటూరు రోడ్డు మీదుగా పామర్రు చేరుకున్నారు. కనుమూరులో మహిళలు హారతులు పట్టి శ్రీమతి షర్మిలకు సాదరంగా స్వాగతం పలికారు.

షర్మిల ముందు కష్టాలు చెప్పుకున్న కార్మికులు :
కురుమద్దాలిలోని బ్లూపార్కు వద్ద రొయ్యల పరిశ్రమలో పనిచేసే కార్మికులు, కేరళ నుంచి వలస వచ్చిన కార్మికుల కుటుంబాలు శ్రీమతి షర్మిలను కలుసుకుని తమ కష్టాలు చెప్పుకొన్నాయి. పాదయాత్ర విజయవంతం కావాలని ప్రార్థనలు చేశారు. కురుమద్దాలి పంచాయతీ కార్యాలయం వద్ద మహిళలు హారతులు పట్టారు. అక్కడ పార్టీ జెండాను ఎగురవేసి మహానేత వైయస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

‌పాదయాత్ర ప్రారంభించి 107 రోజులు పూర్తయిన సందర్భంగా పామర్రులోని మూలమలుపులో భారీ కేకును శ్రీమతి షర్మిల కట్ చేశారు. అదే ప్రాంతంలో కొందరు వై‌యస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాన్ని‌ శ్రీమతి షర్మిలకు బహూకరించారు. అనంతరం పామర్రులోని పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ పాదయాత్రలో ఉన్న కుమార్తె‌ శ్రీమతి షర్మిలను కనుమూరు వద్ద కలిసి యోగక్షేమాలు విచారించారు.
Back to Top