అందరి అడుగులు అటుకేసే...

  

పొలాలగట్లమీదుగా పరుగులుపెడుతూ అటు సాగుతున్న జనం
వూరూవాడల నుంచి తరలివస్తున్న జనం అటుకేసే...
అనంతపురం : ఉత్సాహంతో ఉరుకులూ పెడుతున్నారు. ముప్పిరిగొంటున్న భావోద్వేగాల నడుమ బతుకు వ్యధల్ని చెప్పుకుంటున్నారు.
ఈ దృశ్యాలన్నీ వైయస్‌జగన్‌ మహాసంకల్పయాత్రలో భాగంగా కనిపిస్తున్నాయి.  అనంతపురం కటారుపల్లిలో ఆరువందల కిలోమీటర్ల మైలురాయి దాటిన పాదయాత్ర వెంబడి ఇప్పటిదాకా లక్షలమంది సహయాత్రికులవుతున్నారు. అలుపెరుగని పాదయాత్రికుడి అడుగులో అడుగులేస్తూ నడుస్తున్నారు.. ఆ నడకదారి మధ్యలో తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఎన్నికలవేళ అనేకానేక హామీలతో అరచేతిలో వైకుంఠం చూపించిన చంద్రబాబు ...తర్వాతకాలంలో అన్నిటికీ నీళ్లొదిలేశాడు. తన మేనిఫెస్టోలోనివన్నీ నీటిమీద రాతలేనని తేల్చారు. నమ్మిన జనాన్ని నిలువునా ముంచారని బాధపడిపోతున్నారు.

అనేక కొర్రీలతో...స్వంతపార్టీవారు కాదన్న వివక్షతో వస్తున్న పెన్షన్లు ఆపారు. అర్హత వుండీ ...కొత్త పెన్షన్ల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా మొండిచెయ్యిచూపుతున్నారు. ఇక రుణాలమాఫీ, డ్వాక్రా రుణాలమాఫీలంటూ కోటలు దాటిన మాటలతో ఊదరగొట్టారు.  ఇప్పుడు వడ్డీల మీద వడ్డీలు పెరిగి...ఆ రుణాలు కాస్తా గుదిబండలయ్యాయని....బ్యాంకుల నోటీసులు తలవంపులు తెస్తున్నాయని  దిగులుపడుతున్న సామాన్యజనం కథనాలెన్నో వినపడుతున్నాయి. 

పెరిగిన ఫీజులు, చాలీచాలని ఫీజురీయింబర్స్‌మెంట్లు పెద్దచదువులకు చెక్‌పెట్టేలా కనిపిస్తుంటే...బాబొస్తే జాబొస్తుందన్నమాట పెద్దమోసంగా తేలిపోయింది. చాలాచోట్ల..చాలా విభాగాల్లో వేలాదిమంది తాత్కాలిక ఉద్యోగాలను ఊడబెరిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 
ఇప్పటిదాకా పాదయాత్ర సాగిన దారిలో హంద్రీనీవా సుజలస్రవంతి ప్రసక్తి చాలా చోట్ల వినిపించింది. వైయస్సార్‌ హయాంలో ఎనభైశాతం పనులు పూర్తయినా, మిగిలిన పదిహేను, ఇరవైశాతం పనులకు దిక్కులేకుండా పోయింది. పిల్లకాలువలు తవ్వితే చాలు లక్షల ఎకరాలు సాగులోకి వచ్చే సౌలభ్యం వున్నా పాలకుల నిర్లక్ష్యంతో పనులు కానీ దురదృష్టం వెక్కిరిస్తోంది.   ఓవైపు హంద్రీనీవా నీళ్లున్నా...పంటకాలువలు పక్కనే వున్నా....వాటికి పిల్లకాలువలు లేక పొలాలు తడవని దౌర్భాగ్య పరిస్థితులు కనపడుతున్నాయి. 

ఇలా అడుగడుగునా అన్నదాతల సమస్యలు ఎన్నెన్నో వినిపిస్తున్నాయి. ప్రధానంగా పంటలకు గిట్టుబాటు ధరల్లేక...పంటకు పెట్టిన పెట్టుబడులుకూడా తిరిగిరాని పరిస్థితులు రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. మార్కెట్‌ దళారుల దోపిడీ...వ్యవసాయం దండగ అనిపించేలా ఏడిపిస్తోంది.
ఓవైపు వూర్లలో ఏరులైపారుతున్న మద్యం కుటుంబాలను వీధిన పడేస్తోందన్న మహిళల ఆవేదన కనిపిస్తోంది. అధికారంలోకి రాగానే బెల్టుషాపుల భరతం పడతానన్నా బాబుగారు...ఆ తర్వాత మద్యం ద్వారా ...కొత్తకొత్త ఆదాయమార్గాలు కనిపెడుతున్నారు. మద్యం అమ్మకాల విషయంలో చీప్‌ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్నారు. 

మొత్తానికి ఈ పాదయాత్ర  జనం గుండెఘోషల ప్రతిధ్వనిలా సాగుతోంది. మేడిచందం చంద్రబాబుగారి పాలనను...దాని పొట్టలో పురుగులున్న దృష్టాంతాలను పట్టిచూపుతోంది. 

 
Back to Top