'ఓపిక పట్టండి.. మంచికాలం ముందుంది'

చిన్నారులను వాత్సల్యంగా ముద్దాడారు.. వికలాంగులను ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారు.. ఇటుక బట్టీల కార్మికుల కష్టాలు తెలుసుకున్నారు.. గంగిరెద్దుల వారి బాధలు శ్రద్ధగా విన్నారు.. మహిళల యాతనలు, రైతుల వేదనలు, అభాగ్యుల రోదనలు, విద్యార్థుల ఇబ్బందులు గుర్తెరిగి చలించిపోయారు.. కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రజాకంటక ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగనన్న నేతృత్వంలో రాజన్న రాజ్యం వస్తుందని, సుఖసంతోషాలు చేరువవుతాయని భరోసా ఇస్తూ శ్రీమతి షర్మిల సోమవారం ‘మరో ప్రజాప్రస్థానం’లో ముందుకు సాగారు.

పామర్రు (కృష్ణాజిల్లా) : ‘అక్క చెల్లెళ్ళకు, అమ్మకు, అన్నా తమ్ముళ్ళకు, అవ్వా తాతలకు నమస్కారం. ఇచ్చిన మాట మీద నిలబడేది మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి తరువా జగనన్నే. త్వరలోనే జగనన్న బయటకు వస్తారు.. ఆర్నెలలో, సంవత్సరమో ఓపిక పట్టండి. జగనన్న సిఎం అవుతారు. మీ కష్టాలన్నీ తీర్చేందుకు రాజన్న రాజ్యం తెస్తారు. ఉంటానమ్మ! ఉంటానక్కా...’ అంటూ ప్రజలకు భరోసా ఇస్తూ‌ మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ తనయ, జగనన్న ‌సోదరి శ్రీమతి షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ యాత్రలో ముందుకు సాగుతున్నారు. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో శ్రీమతి షర్మిలకు అపూర్వ స్వాగతం లభించింది. ఆమెను చూసేందుకు గ్రామస్తులు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు. నెమ్మలూరు శివారు మలయప్పన్నపేటలో శ్రీమతి షర్మిలను చూసేందుకు, కరచాలనం చేసేందుకు, మాట్లాడేందుకు స్థానికులు ఉత్సాహం ప్రదర్శించారు. ఎన్టీఆర్ సోదరుడు నందమూరి వెంకటేశ్వరరావు‌ శ్రీమతి షర్మిలను కలిసి ఆమెతో పాటు కొంతదూరం నడవడం గమనార్హం.

యాత్రలో భాగంగా జుజ్జువరం, నిడుమోలు గ్రామాల్లో శ్రీమతి షర్మిల రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. రచ్చబండ కార్యక్రమాల్లో పలువురు మహిళలు ఆమెకు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. జాతీయ రహదారి విస్తరణ కోసం రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లు తొలగిస్తామంటున్నారని, నష్టపరిహారం రాదంటున్నారని, అదే జరిగితే తాము రోడ్డున పడతామని జుజ్జువరం మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. విద్యుత్ కోతల ‌కారణంగా తాము పడుతున్న ఇబ్బందులను రైతులు, మహిళలు శ్రీమతి షర్మిలకు వివరించారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ఆర్ ‌మరణించిన తరువాత స్కాలర్‌షిప్‌లు రావడం లేదని ఒక విద్యార్థిని చెప్పగా, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు కట్టుకోలేకపోతున్నామని, ఇంగ్లీషు మీడియం పెట్టించాలని ఓ తల్లి శ్రీమతి షర్మిలను కోరారు. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరడం వల్ల తమను అధికార పార్టీ నాయకులు ఇబ్బందులు పెడుతున్నారని ఓ వృద్ధురాలు మొరపెట్టుకుంది. రేష‌న్ కార్డుల కోసం అధికారుల చుట్టు తిరిగినా పట్టించుకోవడం లేదని పలువురు మహిళలు ఫిర్యాదు చేశారు. కరెంట్ కోతల వల్ల చదువుకోలేకపోతున్నామంటూ నిడుమోలులో‌ పదవ తరగతి విద్యార్థిని అనీష‌ కన్నీరు పెట్టింది. అందరి సమస్యలు విన్నతర్వాత ‘ అక్కా.. త్వరలోనే మన ప్రభుత్వం వస్తుంది, రాజన్న రాజ్యం వస్తే మీ కష్టాలు తీరుతాయి’ అంటూ శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు.

పామర్రులోని గగన్‌మహల్ నుంచి సోమవారం ఉదయం‌ మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభమైంది. పామర్రులోని ఎన్టీఆర్ కాలనీలో రోడ్డుకి ఇరువైపుల ప్రజలు పూలతో‌ శ్రీమతి షర్మిలకు స్వాగతం పలికారు. శ్రీమతి షర్మిల ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. చిన్నారులను ఎత్తుకుని ముద్దాడారు. పామర్రు శాంతినగర్‌లో శ్రీమతి షర్మిలను చూసేందుకు మహిళలు ఆసక్తిగా ముందుకు వచ్చి హారతులు ఇచ్చారు. తమ కష్టసుఖాలను ఆమెతో ఏకరువు పెట్టారు.

తమకు ఇళ్లు లేవని, ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని కంచర్లవాని పురం గ్రామస్తులు శ్రీమతి షర్మిల దృష్టికి తీసుకువచ్చారు. జగనన్నను గెలిపించుకుంటే కష్టాల నుంచి గట్టెక్కుతారని, ఆయన వస్తే రాజన్న పరిపాలన వస్తుందని శ్రీమతి షర్మిల వారికి ధైర్యం చెప్పారు. ఇటుక బట్టీల వద్ద కార్మికుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. జుజ్జువరంలో గంగిరెద్దుల వారు శ్రీమతి షర్మిల వద్దకు వెళ్లి తమ బాధలు వివరించారు. జుజ్జువరంలోని ఓఎన్‌జిసి రహదారి ఎదురుగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని హారతులు ఇచ్చారు. శ్రీమతి షర్మిల రాకతో జుజ్జువరం రోడ్లు జనంతో కిక్కిరిసిపోయాయి. ఉషోదయ పబ్లిక్ స్కూ‌ల్ విద్యార్థులు‌ శ్రీమతి షర్మిలకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని పాలకేంద్రం సమీపంలో, నిభానుపూడి అడ్డరోడ్డు వద్ద వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారు. కాపవరం అడ్డరోడ్డు వద్ద ప్రజలు శ్రీమతి షర్మిలకు ఘనస్వాగతం పలికారు. నిమ్మకూరు క్రాస్‌రోడ్సు, మలయప్పన్నపేట, నిడుమోలు, తరకటూరు వరకూ పాదయాత్ర చేశారు.

పార్టీలో 500 మంది చేరిక :
శ్రీమతి షర్మిల సమక్షంలో నిభానుపూడికి చెందిన మాజీ ఎంపిపి దాసరి అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది కాంగ్రె‌స్, ‌టిడిపిల నుంచి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శ్రీమతి షర్మిల పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.
Back to Top