హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ వైఎస్సార్‌సీపీ తలపెట్టిన బంద్ ఒక రోజు వాయిదా పడింది. వాస్తవానికి ఈ నెల 28న బంద్ చేయాలని పార్టీ పిలుపు ఇచ్చింది. అయితే అదే రోజు మహిళలు పవిత్రంగా భావించే వరలక్ష్మీ వ్రతం వస్తోంది. ఆ రోజున బంద్ పాటించటం భావ్యం కాదన్న ఉద్దేశ్యంతో ఈ నెల 29కు వాయిదా వేశారు. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి బొత్సా సత్యనారాయణ వెల్లడించారు.<br/>ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ధర్నాతో తెలుగుదేశం నాయకులు కొత్త డ్రామాలు మొదలు పెట్టారని, ప్యాకేజీలు అంటూ కొత్త రకం ప్రకటనలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కొత్త ప్యాకేజీలు టీడీపీ నేతలు పంచుకోవటానికా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుది పూర్తిగా రాజకీయ వ్యాపారం అని బొత్సా అభిప్రాయ పడ్డారు. అందుకే ఆయన ప్రత్యేక హోదా కోసం కేంద్రం మీద ఎటువంటి ఒత్తిడి తీసుకొని రావటం లేదని ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్సార్‌సీపీ ఎటువంటి త్యాగానికి అయినా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.