పచ్చనేతల ఒత్తిళ్లతో అధికారుల సెలవు బాట

నెల్లూరు నగరపాలక సంస్థలో ఆగిన పనులు
కార్పొరేషన్ ఆదాయానికి గండికొడుతున్న తెలుగుతమ్ముళ్లు
పచ్చనేతల అక్రమాలు, బెదిరింపులతో అధికారుల సెలవుబాట

నెల్లూరుః అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలు సాగిస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు రోజురోజుకు శృతి మించుతున్నాయి. తమ పనులు చక్కబెట్టుకునేందుకు అన్ని వ్యవస్థలను బెదిరిస్తున్నారు. నేను ఎవరునుకున్నావ్... నేను చెప్పిన పని చేయవా... నీ అంతు చూస్తా.. అంటూ నగర పాలక సంస్థ అధికారులపై తెలుగు తమ్ముళ్లు బెదిరింపులకు దిగుతున్నారు.  నాయకుల అక్రమాలకు సహకరించలేక, బెదిరింపులు తట్టుకోలేక నెల్లూరు టౌన్‌ప్లానిం గ్‌లోని ఇద్దరు అధికారులు దీర్ఘకాలిక సెలవుపై  వెళ్లారు.
 
నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ, హెల్త్ విభాగాలు ఉన్నాయి. వీటిలో టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ విభాగాలు కార్పొరేషన్ రెవెన్యూకు ప్రధానమైనవి. ఈ విభాగాల్లో కార్పొరేషన్ ఆదాయానికి గండికొట్టి, జోబులు నింపుకోవడానికి అధికారులు, అధికార పార్టీ నేతలు దారులు వెతుకుతుంటారు. అయితే ఇటీవల కాలంలో అధికార పార్టీ నాయకుల అక్రమాలకు అంతు లేకుండా పోయింది. అందినకాడికి దోచుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. అధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చి తాము చెప్పినట్టు నడుచుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. నాయకులు చెప్పిన పనులు చేస్తే తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని కొందరు అధికారులు ఆందోళన చెందుతున్నారు. కొంత మంది అధికారులు ఒత్తిళ్లు తట్టుకోలేక ధీర్ఘకాలిక సెలవు పెట్టారు.  


సర్వేయర్ రెండు నెలల నుంచి సెలవు
నగర పాలక సంస్థలోని టౌన్‌ప్లానింగ్ విభాగంలో  పనిచేస్తున్న ఇద్దరు అధికారుల్లో ఒకరు సర్వేయర్ మూర్తి. మరొకరు టీపీఓ సుధాకర్. వీరిలో మూర్తి రెండు నెలల నుంచి, టౌన్‌ప్లానింగ్ అధికారి సుధాకర్ నెల నుంచి సెలవులో ఉన్నారు. మూర్తికి నగర పాలక సంస్థ పరిధిలో కాలువల ఆక్రమణలు గుర్తించాలని గతంలో పాలకులు ఆదేశాలు జారీ చేశారు. ఈ కాలువల ఆక్రమణల్లో బడాబాబులు ఎక్కువగా ఉండడంతో సర్వే చేసే సమయంలో అధికార పార్టీ నాయకుల నుంచి ఒత్తిడి వచ్చినట్లు తెలిసింది. మా భవనాలను సర్వేలో చూపిస్తే పరిస్థితి వేరే విధంగా ఉంటుందని పచ్చనేతలు హెచ్చరించారు. దీంతో మూర్తి దీర్ఘకాలిక సెలవులో వెళ్లారని టౌన్ ప్లానింగ్ అధికారులు అంటున్నారు.

టీపీఓ నెల నుంచి..
టీపీఓ సుధాకర్‌కు టౌన్‌ప్లానింగ్ అధికారిగా కొన్ని నెలల క్రితం ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చారు. ఈ క్రమంలో సుధాకర్ కొంతకాలం సజావుగా విధులు నిర్వహించారు. ఓ అధికార పార్టీ కార్పొరేటర్ తనకు ప్రతి నెలా లక్షల్లో మామూళ్లు ఇవ్వాల్సిందేనని హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా భారీ అక్రమాలకు సంబంధించిన ఫైల్స్‌పై సంతకాలు పెట్టాలని బెదిరింపులకు దిగారు.  దీంతో ఆయన నెల రోజుల నుంచి సెలవులో ఉన్నారు. ఈ క్రమంలో అధికారులిద్దరూ బదిలీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం టౌన్‌ప్లానింగ్‌లో పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫైల్స్ కదలడం లేదని పలువురు వాపోతున్నారు. 

ఇంజనీరింగ్ విభాగంలోనూ..
ఇంజనీరింగ్ విభాగంలోని ఓ ఉన్నతాధికారి ప్రస్తుతం అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గలేక సెలవు లేదా బదిలీపై వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. ఇద్దరు డీఈలు, ముగ్గురు ఏఈలు ఇప్పటికే బదిలీ ప్రయత్నాలు చేశారు.  తెలుగు తమ్ముళ్ల ఒత్తిళ్లతో అధికారులు సెలవులపై వెళుతుండడంతో  నగరపాలక సంస్థలో పనులు ఆగిపోయే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

తాజా వీడియోలు

Back to Top