ఊరికో ఇళ్లయినా లేదు


– బడ్జెట్‌లో అరకొర కేటాయింపులు 
– మాటల్లో మాత్రం లక్షల ఇళ్లని డాబులు
– కేటాయింపులన్నీ ఖర్చు చేస్తారనీ లేదు

‘రాష్ట్రంలో అర్హులందరికీ ఉచితంగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం. ఇళ్ల నిర్మాణానికి వీలుగా ఆ స్థలాలను చదును చేయడానికి వీలుగా ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తాం.’ ఇదీ తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ. అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగేళ్లవుతున్నా ఆ హామీకి దిక్కులేకుండా పోయింది. మీ కోసం వెబ్‌సైట్‌కు ఇళ్ల స్థలాల కోసం పేదల నుంచి రెవెన్యూ శాఖకు 19,73,780 వ్యక్తిగత వినతులు వచ్చాయి. ఇందులో కేవలం 2,18,591 దరఖాస్తులను అర్హత లేదంటూ తిరస్కరించారు. ఫిబ్రవరి 23వ తేదీ నాటికి ఇంకా 17,55,189 వ్యక్తిగత వినతులు పెండింగ్‌లోనే మగ్గుతున్నాయి. మొత్తం వినతుల్లో 79 శాతం అర్జీలు ఇళ్ల స్థలాల కోసమే వచ్చాయి. 

ఇళ్ల నిర్మాణంలోనూ అతీగతీ లేదు...

రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 15 రోజుల పాటు ఇళ్ల శంకుస్థాపనలు నిర్వహిస్తాం. ఇది 25 ఫిబ్రవరి, 2018న అనంతపురం జిల్లా రాయదుర్గంలో గృహనిర్మాణశాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌. నాలుగు నెలల్లో మూడు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆర్భాటంగా ప్రకటించారు. ఎన్నికల నాటికి మొత్తం 10 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని ఇంకా ఘనంగా ప్రకటించారు. అయితే ఒకసారి ఎన్‌టీఆర్‌ గృహ నిర్మాణ పథకంలో వాస్తవ లెక్కలను పరిశీలిస్తే చెప్పే మాటలకు కేటాయింపులకు.. చేయబోయే పనులకు వ్యత్యాసం భారీగా ఉంది. వారు చెప్పే మాటలన్నీ వాస్తవ విరుద్ధంగా ఉంటాయి. 

2018–19 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌టీఆర్‌ గ్రామీణ గృహ పథకం కింద కేటాయించిన మొత్తం రూ. 1,457 కోట్లు కేటాయించింది. ఒక్కో ఇంటికి ప్రభుత్వం గరిష్టంగా చేసే కేటాయింపులు రూ. 2 లక్షలు అనుకుంటే ప్రభుత్వం ఈ ఏడాది చేసిన కేటాయింపులతో కేవలం 7285 ఇళ్లను మాత్రమే నిర్మించలగలదు. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 175.  మొత్తం మండలాలు 664. మొత్తం గ్రామాలు 16,158. 
(16,158 గ్రామాల సంఖ్యను బడ్జెట్‌ ప్రసంగంలోని 11 వ పేజీ నుండి తీసుకున్నాం)

ఇప్పుడు లెక్కిద్దాం...!!

కేటాయించిన మొత్తం 1457 కోట్లు / సగటున ఒక ఇల్లు ఖర్చు 2 లక్షలు... మొత్తం ఇళ్లు 7285 ఇండ్లు. ఈ ఇళ్లను రాష్ట్రంలో ఉన్న మొత్తం 175 నియోజకవర్గాలకు కేటాయిస్తే ఒక్కో నియోజకవర్గానికి 41.62 ఇళ్లను మాత్రమే కేటాయించగలదు. మొత్తం 664 మండలాలు ఉంటే ఒక్కో మండలానికి 11ఇళ్లు కూడా రావు. రాష్ట్రంలో మొత్తం గ్రామాలు 16, 158 గ్రామాలుండగా ఒక్కో గ్రామానికి ఒక్క ఇంటిని కూడా కేటాయించలేని పరిస్థితి. 
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కేటాయించిన నిధులన్నీ ఖర్చు చేస్తారని అనుకోవడానికి కూడా లేదు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు మాటలకు చేతలకు భారీగా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ లెక్కలన్నీ చూసుకుంటే ఇళ్ల నిర్మాణ పథకం ఎంత ఘోరంగా ఉందో తెలిసిపోతుంది. 



Back to Top