హైదరాబాద్:::: : ప్రజలకు మేలు జరుగుతుందంటే ఎంత కష్టాన్నయినా భరించగలగడం ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరికీ పుట్టుకతోనే అలవాటైన లక్షణం. మహానేత డాక్టర్ రాజశేఖరరెడ్డి ప్రజల కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఇబ్బందులు తెలుసుకుని వారి బతుకులను బాగుచేయాలని రాష్ట్రం ఆ మూల నుంచి ఈ మూలకు మండుటెండలో నడిచి చరిత్ర సృష్టించిన మహనీయుడు. ఆయన తనయుడు, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి తన తండ్రి మరణంతో ప్రాణాలు వదిలిన అభిమానుల కుటుంబాలను పరామర్శించేందుకు రేయనకా, పగలనకా, ఎండనకా, వాననకా నిత్యం జనం మధ్యనే మసలిన మానవతావాది. నల్ల కాలువ సభలో ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలకైనా ఓర్చి జిల్లా జిల్లా... ఇల్లిల్లూ తిరిగి బాధిత కుటుంబాలకు ప్రేమాభిమానాలు పంచి, వారికి అండగా నేనున్నానంటూ భరోసా ఇచ్చిన మేరునగ ధీరుడు. ఆరోగ్యం అంతగా సహకరించకపోతున్నా ప్రతి నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక మూల ప్రజల మధ్యకు వస్తున్న మాతృమూర్తి, మహానేత సహచరి శ్రీమతి విజయమ్మ. అన్న జగనన్న తరఫున చారిత్రాత్మక మరో ప్రస్థానం పాదయాత్ర చేస్తున్న శ్రీమతి షర్మిల కూడా అదే తెగువను, ధైర్యాన్ని, నిత్యం జనం మధ్యే ఉండాలన్న ఆసక్తితో ముందుకు సాగిపోతున్నారు. మోకాలికి గాయం అయి బాధ పెడుతున్నా భరిస్తూ ఆమె మొక్కవోని ధైర్యంతో 4 కిలోమీటర్లు పాదయాత్రను కొనసాగించారు.
ప్రజా సమస్యలు పట్టించుకోని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తీరుకు నిరసనగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా శుక్రవారంనాడు బిఎన్ రెడ్డి నగర్‌లో శ్రీమతి షర్మిల ప్రసంగించారు. శ్రీమతి షర్మిల ప్రసంగం వినేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బస్సుపై ఏర్పాటు చేసిన వేదిక మీది నుంచి షర్మిల ప్రసంగించారు.
ప్రసంగం అనంతరం శ్రీమతి షర్మిల వేదిక దిగుతుండగా ఎడమకాలు జారి ముందుకు తూలిపడబోయారు. అయితే ఆ వెనువెంటనే శ్రీమతి షర్మిల తనను తాను నిలువరించుకున్నారు. ఈ ప్రయత్నంలో కుడి మోకాలిచిప్పకు వేదిక మెట్లు బలంగా తగిలాయి. తీవ్రమైన నొప్పితో ఆమె కాసేపు విలవిల్లాడిపోయారు. కొద్ది నిమిషాల పాటు ఆమె అక్కడే కూర్చుండిపోయారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర కాన్వాయ్‌లో ఉన్న డాక్టర్ హరికృష్ణ ఆమెకు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం శ్రీమతి షర్మిల కాలు నొప్పిని లెక్క చేయకుండా బిఎన్ రెడ్డి నగర్ నుంచి ఇంజాపూర్ వరకు 4 కిలోమీటర్లు నడిచి అక్కడ బస చేశారు.
కాగా, శ్రీమతి షర్మిల మోకాలి నొప్పి శనివారం ఉదయానికి మరింత ఎక్కువ కావడంతో వైద్యులు పరీక్షించి యాత్ర కొన్ని రోజులు వాయిదా వేసుకోవాలని సూచించారు. కనీసం రెండు వారాలన్నా విశ్రాంతి అవసరమని వైద్యులు సలహా ఇచ్చారు. అయితే అన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవడానికి శ్రీమతి షర్మిల ససేమిరా అన్నారు. పాదయాత్ర షెడ్యూల్‌లో మార్పు జరగవద్దని, తన రాక కోసం ఎదురు చూస్తున్న ప్రజలు, అభిమానులను నిరాశకు గురిచేయకూడదంటూ వైద్యుల సూచనలను కూడా పట్టించుకోకుండా శనివారం మధ్యాహ్నం నుంచే యాత్రకు సిద్ధమయ్యారు. మోకాలి గాయం కారణంగా కనీసం రెండు రోజులైనా యాత్రకు విరామం ఇవ్వాలని శ్రీమతి షర్మిల మాతృమూర్తి, వైయస్ఆర్ సిపి గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ, చిన్నాన్న, పార్టీ సీనియర్ నాయకుడు వై.వి. సుబ్బారెడ్డి నచ్చచెప్పారు. వారి సూచన మేరకు చివరికి శని, ఆదివారాలు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చేందుకు శ్రీమతి షర్మిల అంగీకరించారు. దీంతో ఆదివారం కూడా శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగదని పార్టీ కార్యక్రమాల కమిటీ సమన్వయకర్త తలశిల రఘురాం, పార్టీ నాయకుడు కేకే మహేందర్‌రెడ్డి ప్రకటించారు.
మోకాలి గాయంతో విశ్రాంతి తీసుకుంటున్న శ్రీమతి షర్మిలను శనివారంనాడు పార్టీ నాయకులు శోభా నాగిరెడ్డి, సుజయకృష్ణ రంగారావు, ఆళ్ల నాని, రాజ్‌ఠాకూర్, రెహ్మాన్, దేప భాస్కర్, సురేఖ, పెన్మత్స సాంబశివరాజు, సామినేని ఉదయభాను, పుత్తా ప్రతాపరెడ్డి, వెల్లాల రాంమోహన్, వడ్డేపల్లి నర్సింగ్‌రావు, అమృతాసాగర్ తదితరులు పరామర్శించారు. గాయపడిన శ్రీమతి షర్మిలను పరామర్శించేందుకు వచ్చిన మేడ్చల్ కార్యకర్తలను ఉద్దేశించి శ్రీమతి విజయమ్మ ప్రసంగించారు. శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి, శ్రీమతి షర్మిలకు వారి ఆశీస్సులు అందించాలని కోరారు.