ప‌ట్టిసీమ లెక్క పోల‌వ‌రానికి కుద‌ర‌దా..!

హైద‌రాబాద్‌: తెలుగు వారికి బ‌హుళార్థ ప్ర‌యోజ‌నాలు తెచ్చిపెట్టే ప్రాజెక్టుగా పోల‌వ‌రం ప్రాజెక్టుని చెబుతారు. ఇంత‌టి బ‌ల‌మైన ప్రాజెక్టు విష‌యంలో ప్ర‌భుత్వం చేస్తున్న నిర్ణ‌యాలు అనుమానాలు క‌లిగిస్తున్నాయి.


ఎన్నిక‌ల స‌మ‌యంలో పోల‌వ‌రం ప్రాజెక్టు మీద ర‌క ర‌కాల ఆశ‌లు రేపిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఆ ఊసెత్త‌టం మానేసింది. అక‌స్మాత్తుగా ప‌ట్టిసీమ పేరుతో ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని తెర మీద‌కు తెచ్చింది. అంతే కాకుండా ఇది ఒక వృధా ప‌థ‌కం అని నిపుణులు తేల్చి చెప్పినా విన‌లేదు. ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేసేందుకు రైతులకు అడిగినంత ప‌రిహారం ఇచ్చి భూములు లాక్కొన్నారు. దీంతో నీటిని తోడినా తోడ‌క‌పోయినా, ప‌ట్టిసీమ అయిపోయింద‌నిపించి కాంట్రాక్ట‌ర్ల కు ప్ర‌యోజ‌నం క‌ల్పించారు.

కానీ, ప్ర‌జ‌ల‌కు నిజంగా వ‌ర ప్ర‌సాదిని అన‌ద‌గ్గ పోల‌వరం విష‌యంలో మాత్రం అటువంటి నిర్ణ‌యాలుఏమీ జ‌ర‌గ‌టం లేదు. పైగా చట్ట ప్ర‌కారం రావాల్సిన ప‌రిహారాన్ని అందించేందుకు సైతం ప్ర‌భుత్వం ఒప్పుకోవ‌టంలేదు. మెలిక మీద మెలిక పెట్టి గిరిజ‌నుల ద‌గ్గ‌ర నుంచి చౌక‌గా భూములు, ఇళ్లు లాక్కొనేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. న్యాయ‌ప‌రిహారం అడుగుతున్న గిరిజ‌నుల మీద కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడ‌టం లేదు.

ఈ మొత్తం ఎపిసోడ్ లో విచిత్రం ఏమిటంటే..ప‌ట్టిసీమ‌,పోల‌వ‌రం బాధితులు ఒక జిల్లా వారే. పైగా ప‌ట్టిసీమ నిర్వాసితులు మైదాన ప్రాంతం వారు కాగా, పోల‌వ‌రం బాధితులు చాలా వ‌ర‌కు గిరిజ‌నులు. అటువంటిది వెనుక‌బడిన గిరిజ‌నుల మీద ప్ర‌భుత్వం క‌క్ష సాధింపున‌కు దిగుతోంద‌న్న మాట ఉంది. వాస్త‌వానికి ప‌ట్టిసీమ ప్ర‌భుత్వానికి కాసులు రాల్చే ప‌థ‌కం కాబ‌ట్టే అక్క‌డ చ‌క చ‌కా పున‌రావాస ప్యాకేజీలు అమ‌లు అయ్యాయని, పోల‌వ‌రం ప్రాజెక్టుని నీరు కార్చేందుకు కంక‌ణం క‌ట్టుకొన్నందున చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఇక్క‌డ పున‌రావాసానికి మోకాలు అడ్డుతోంద‌న్న మాట వినిపిస్తోంది. 
Back to Top