బాబు పాలనలో ఉపాధికి లేదు హామీ

గ్రామీణ నిరుపేద శ్రామికులకోసం ఉద్దేశించిన కేంద్ర పథకం గ్రామీణ ఉపాధి హామీ. ఏడాదిలో 100రోజుల పని కల్పించడం ద్వారా పేదరిక నిర్మూలనకు ఉద్దేశించిన ఈ పథకం ఆంధ్రప్రదేశ్ లో నిర్వీర్యం అయిపోతోంది. కేవలం పెద్దల జేబులు నింపే కార్యక్రమంలా సాగుతోంది. చేయని పనులు జరిగినట్టు బిల్లులు పెడుతున్న ప్రబుద్ధులు కొందరైతే, ఒక పనికే రెండు మూడు బిల్లులు కూడా మంజూరు చేయించుకుంటున్న మహానుభావులు మరికొందరు. గ్రామాల్లో ఒక పక్క గ్రామసభల పేరుతో పల్లెల్లో సంక్షేమ పథకాలను అయినవారికే అందజేస్తున్న తెలుగుదేశం నేతలు ఉపాధి హామీ పనుల్లోనూ చేయివాటం చూపిస్తున్నారు. 

పని ఒకటి బిల్లులు ఎన్నో...

ఉపాధి హామీ పథకంలో భాగంగా చెరువుల పూడికతీత, రోడ్లు వేయడం, వెడల్పు చేయడం, పంట కుంటల నిర్మాణం మొదలైన పనుల్లో టిడిపి నేతలు, వారి అనుయాయులూ భారీగా అవినీతికి పాల్పడుతున్నారు. ఒకసారి చేసిన పనినే మళ్లీ చేసినట్టు చూపుతూ లక్షల రూపాయిల బిల్లులు ప్రభుత్వం నించి వసూలు చేసుకుంటున్నారు. గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఈ అవినీతి మరింత ఎక్కువగా జరుగుతున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. 

ప్రైవేటు భూములు, దేవాలయ భూముల్లోనూ 

ఉపాధి హామీ పనులు ప్రభుత్వానికి చెందిన స్థలాల్లోనే చేపట్టాలి. కానీ కొందరు అధికార పార్టీ నేతలు రైతుల వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్న బావులను ఫామ్ పాండ్స్ గా చూపించి లక్షల రూపాయిలు నొక్కేసారు.  దేవాలయ భూముల్లోనూ పనులు చేపట్టినట్టు లెక్కలు చూపించి డబ్బులు రాబట్టుకున్నారు. కొన్ని చోట్లైతే సాగునీటి శాఖ వారి కాల్వల్లోనూ పనులు చేసినట్టు బిల్లులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాగునీటి శాఖ ప్రధాన పంటకాల్వలో ఉపాధి పనులు చేపట్టకూడదు. ఒకవేళ చేసినా ఆ శాఖ అనుమతి తీసుకోవాలి. ఇవేమీ లేకుండానే సాగునీటి శాఖ పరిధిలోని పంటకాలవలో ఉపాధి పనులు జరిగాయని ప్రభుత్వానికి బిల్లు పెట్టగా, అవి ఆమోదం కూడా పొంది మంజూరు అయ్యాయి. 

మెషీన్లతో పని  కూలీల పేరుతో బిల్లులు

ఉపాధి పనుల్లో కూలీలకు మాత్రమే పని కల్పించాలి. యంత్రాలు ఈ పనుల్లో ఉపయోగించ కూడదు. కానీ కొందరు స్థానిక నేతలు పంటకుంటల తవ్వకాలకు మిషన్లను యథేచ్ఛగా ఉపయోగించారు. ఈ పనులకోసం కూలీలనే ఉపయోగించినట్టు దొంగ బిల్లులు పెట్టారు. ఈ తరహా అవినీతి రాష్ట్రమంతటా యథేచ్ఛగా జరుగుతోందని కూలీలే ఆరోపిస్తున్నారు. 

మంత్రిగారి చొరవతో సోంతవారికి మంజూర్లు

పంచాయితీ రాజ్ శాఖామంత్రిగా నారా లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్న ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఆయన నుంచే మొదలయ్యాయంటున్నారు అధికారులు. లోకేష్ వ్యక్తిగత సహాయకుడి సొంత ఊరికి ఒక్క ఏడాదికే 3కోట్లకు పైగా పనులు మంజూరు అయ్యాయి. ఆ చుట్టుపక్కలే ఉన్న గ్రామాలకు ఏడాదికి 25లక్షల పనులు కూడా మంజూరు కాలేదు. 

టిడిపి నేతల ఇష్టారాజ్యం

ఉపాధి కూలిగా పేర్లు నమోదు చేయించుకున్న కూలీలకు కూడా తమ ఇష్టప్రకారమే పనులు ఇస్తున్నారు టిడిపి నేతలు. కొందరు కూలీల పేర్లపై పనులు చేసినట్టు తప్పుడు బిల్లులు చూపించి, డబ్బులు తీసుకోవడంతో వారు తిరగబడ్డారు. సోషల్ ఆడిట్ లో తాము పని చేయకుండా కొందరు నేతలే తమ పేర్ల మీద బిల్లులు తీసుకున్నారని పచ్చనేతల బండారాన్ని బయటపెట్టారు. ఆ కక్షను పెట్టుకుని వారికి అనుకూలంగా పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్ల ను అడ్డుపెట్టుకుని వారికి ఏడాది పొడవునా ఒక్కరోజుకూడా పని కల్పించకుండా చేసారు. ఇదీ స్థానిక టిడిపి నేతల దాష్టీకం. 
ఉన్న ఊళ్లో పనులు లేక, ఉపాధి హామీ సరిగ్గా అమలు కాక కూలీలు పక్క ఊళ్లకు, నగరాలకు వలస పోతున్నారు. ఇదంతా బాబుగారి హయాంలో అవినీతి నేతల కనుసన్నల్లో జరుగుతున్న అక్రమాల పాలౌతున్న ఉపాధిహామీ కథ. 



తాజా వీడియోలు

Back to Top