ఆత్మహత్యల కారకులకు శిక్షలేవీ?

అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై సభ్యుల ప్రశ్నలకు విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ఇచ్చిన సమాధానం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు కడుపు శోకం మిగిల్చేలా ఉంది. జరిమానాలూ, కమిటీలతో చనిపోయిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రుకూ న్యాయం జరుగుతుందా…? ర్యాంకుల్లో నెంబర్ వన్ అని గొంతు చించుకుని అరుస్తూ అడ్వర్ టైజ్ మెంట్లు ఇవ్వడం ఈ సంస్థలకు అలవాటు. అలాగే 10వ తరగతి పాసైన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మరీ, కాలేజీల్లో చేర్చమని వత్తిడి తేవడం కూడా వీరి విద్యావ్యాపార సంస్థల్లో భాగమే. మీ పిల్లలను టాప్ రాంకర్లను చేస్తామని ప్రలోభ పెట్టి, వేలు, లక్షల ఫీజులు వసూలు చేసి, చివరికి ఛిద్రమైపోయిన చిన్నారి కలలను శవాలుగా మార్చి తల్లిదండ్రులకు అప్పజెబుతున్నాయి ఈ కళాశాల యాజమాన్యాలు. 

చదువును కార్పొరేట్ పరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం తను చేయతగ్గ సహాయాన్నంతా శక్తి వంచన లేకుండా చేస్తోంది. అగ్గిపెట్టెల్లాంటి గదుల్లో తరగతులు, గంటల తరబడి క్లాసులు, జైళ్లలాంటి హాస్టళ్లు ఇన్నాళ్లుగా ఎలా కొనసాగుతున్నాయి. విద్యాశాఖ ఇలాంటి వాటిని ఎందుకు ఇన్నేళ్లుగా కట్టడి చేయలేక పోయింది. ఏ శక్తులు ఈ కార్పొరేట్ కళాశాలలకు వెన్నుదన్నై నిలబడ్డాయి..?ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పే తీరాలి. కానీ ప్రతిపక్షమే లేని అసెంబ్లీలో కూర్చుని కంటితుడుపు కమిటీలతో సమస్యను చుట్టబెట్టేశారు.
అసలు ఆత్మహత్యలకు కారణం ప్రేమలు, కుటుంబ కలహాలే అంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం చూస్తే అంతకు మించిన దౌర్భాగ్యం లేదనిపిస్తుంది. అదే నిజమైతే గవర్నమెంటు కాలేజీలు, ఇంకా ఇతర కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకోవడం లేదు….? పైగా ఈ కాలేజీల్లో చదవలేకే ప్రాణాలు తీసుకుంటున్నామంటూ ఆవేదనతో విద్యార్థులు రాసిన ఉత్తరాలు సాక్షాలుగా కూడా పనికిరాకుండా పోతుండటం విషాదం. ఆ రెండు కాలేజీల యాజమాన్యాల తప్పులను కప్పి పుచ్చేందుకు ఆత్మహత్యలకు కారణం విద్యార్థుల కుటుంబ పరిస్థితులే అని తేల్చేయడం చంద్రబాబు నీచత్వానికి నిదర్శనం. 
ఇంటర్మీడియట్ చదువు, ఎమ్ సెట్, ఐఐటి వంటి పోటీ పరీక్షల కోచింగ్ ల విషయాల్లో రాష్ట్రం మొత్తం మీద శ్రీచైతన్య, నారాయణా కాలేజీల ఆధిపత్యం కొనసాగుతోంది. రోజుకు 18 గంటలకు పైగా విద్యార్థులను బలవంతంగా చదివిస్తున్నాయి ఈ కాలేజీలు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా చేస్తున్నాయి. చివరకు కన్నతల్లిదండ్రులను సైతం కలవనీయకుండా ఆంక్షలు పెడుతున్నాయి. ర్యాంకుల మోజులో తల్లిదండ్రులు సైతం ఈ అరాచకాలను భరిస్తున్నారు. చేర్చిన తర్వాత చేసేదేం లేక కొందరు మౌనంగా ఉంటున్నారు. కాలేజీల తీరుపై ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే మీరు తప్ప ఎవ్వరూ ఈ పద్ధతులకు వ్యతిరేకంగా లేరంటూ సిబ్బంది విరుచుకుపడుతున్నారని వాపోతున్నారు కొందరు తల్లిందండ్రులు. 

ఇంత జరుగుతూ ఉంటే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కాలేజీలకు జరిమానా విధించామని, ఆత్మహత్యల నివారణా కమిటీలు వేసామని విద్యాశాఖా మంత్రి చెబుతున్నారు. రాష్ట్రంలో చాలా కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, కనీస సదుపాయాలు లేకుండా హాస్టళ్లు నడుపుతున్నాయని తెలుస్తోంది. వాటన్నిటిపై చర్యలు తీసుకుంటామని చంద్రబాబుకానీ, విద్యాశాఖ కానీ గట్టిగా ప్రకటించకపోవడం విడ్డూరం. ఆత్మహత్య నివారణ కమిటీలు ఏం చేయబోతున్నాయో తెలియదు కానీ, ఇన్నేళ్లలో ఎంతోమంది విద్యార్థుల మరణాలకు కారణమైన కార్పొరేట్ యాజమాన్యాలు మాత్రం చంద్రబాబు గొడుగు నీడన ఏ శిక్షా లేకుండా నిక్షేపంలా ఉన్నాయి. 

Back to Top