నివాళులు.. నిప్పుల తూటాలు.. జనహారతులు!

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌కు నివాళులర్పిస్తూ.. రాష్ట్ర ప్రగతి ప్రదాత, మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్‌కు అంజలి ఘటిస్తూ... మామిడి రైతుకు ధైర్యాన్ని నూరిపోస్తూ... చిన్నారులకు నామకరణం చేస్తూ.. ప్రజలతో మమేకమవుతూ శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేశారు. మైలవరంలో ఆదివారం కొనసాగిన పాదయాత్ర, బహిరంగసభ రాజకీయ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతాయి. మైలవరం జనసాగరమే అయింది. పాదయాత్ర 120వ రోజు మైలవరం నియోజకవర్గంలోని సంద్రాల శివారు నుంచి గణపవరం అడ్డరోడ్డు, వెల్వడం, మైలవరం వరకు కొనసాగింది. శ్రీమతి షర్మిలకు దారిపొడవునా మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు.
మైలవరం (కృష్ణాజిల్లా) : శ్రీమతి షర్మిల 120వ రోజు ఆదివారం పాదయాత్రలో జనం హారతులు పట్టి స్వాగతం పలికారు. డాక్టర్ బి.ఆ‌ర్.‌ అంబేద్కర్ జయంతి‌ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. తరువాత సంద్రాలలోని మామిడితోటను పరిశీలించారు. మంగు తెగులు సోకి జరిగిన నష్టాన్ని రైతు కొలుసు గోపాలరావు ఆమెకు వివరించారు. గతంలో ఇలాగే నష్టమొస్తే మహానేత డాక్టర్ వై‌యస్ పరిహారం ఇచ్చి ఆదుకున్నారని, ఇప్పటి ప్రభుత్వానికి తమ బాధలు పట్టడం లేదని వాపోయారు.

శ్రీమతి షర్మిల మాట్లాడుతూ.. నష్టపోయిన మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.‌ సంద్రాలలోని బిసి, ఎస్సీ, ఓసీ కాలనీల్లో ఉన్న మహానేత వైయస్ విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఎస్సీ కాలనీలో జ్యోతి తన బిడ్డను‌ శ్రీమతి షర్మిలకు ఇచ్చి పేరు పెట్టాలని కోరడంతో 'విజయ్‌' అని నామకరణం చేశారు. ఓసీ కాలనీలో తులసి, రాజశేఖర్ దంపతులు తమ బిడ్డ ప్రవీణ్ లక్ష్మీకుమార్‌ను శ్రీమతి షర్మిలకు ఇవ్వగా, అప్యాయంగా ఆ బిడ్డను ముద్దాడి గొప్పవాడు కావాలంటూ ఆశీర్వదించారు. ‌సంద్రాలలో బసచేసిన శ్రీమతి షర్మిలను వైయస్‌ఆర్ సోదరి విమలమ్మ మామయ్య, గణపవరం జమీందా‌ర్ బొల్లారెడ్డి వెంకటేశ్వరరెడ్డి కలుసుకున్నారు. తమ తండ్రిలా పట్టుదలగా, అన్న ఆశయం కోసం అలుపెరగకుండా పాదయాత్ర చేస్తున్నావంటూ అభినందించారు. పాదయాత్రతో ప్రజలను కలుస్తూ ముందుకు సాగిన శ్రీమతి షర్మిల ఆటోలు, బస్సులు, కార్లలో వెళుతున్నవారితో కరచాలనం చేసి బాగున్నారా? అంటూ పలకరిస్తూ కదిలారు.

పేలిన మాటల తూటాలు..:
శ్రీమతి షర్మిల దగ్గర్నుంచి జిల్లా, స్థానిక నేతల వరకు ప్రసంగాల్లో మాటల తూటాలు పేల్చారు. జిఓలు సక్రమమైతే జగనన్నను ఎందుకు జైల్లో పెట్టారని, అవి అక్రమమైతే అందుకు బాధ్యులైన మంత్రులను ఎందుకు వదిలిపెట్టారని సిబిఐని, ప్రభుత్వాన్ని శ్రీమతి షర్మిల సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు, బొత్స, చిరంజీవిలపై అనేక ఆరోపణలున్నాయని, వారిపై సిబిఐ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని నిప్పులు చెరిగారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కృష్ణా జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ‌... కాంగ్రెస్, ‌టిబిపిలకు నూకలు చెల్లాయన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి దెబ్బకు తమ దుకాణాలు మూతపడతాయన్న భయం చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలకు పట్టుకుందని ఎద్దేవా చేశారు.

శ్రీమతి షర్మిల పాదయాత్రను చూసి కలవరపడుతున్న టిడిపి జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమ అవాకులు చెవాకులు పేలుతున్నారని, అత‌నో రాజకీయ బ్రోకర్ అని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ‌... మహానేత వైయస్ భిక్షతో పదవులు పొందిన ఆనం రా‌మనారాయణరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. వైయస్ కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్న కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు తిప్పికొడతారని మైలవరం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ జ్యేష్ఠ రమే‌ష్‌బాబు హెచ్చరించారు.

దేవినేని ఉమ ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరంలో శ్రీమతి షర్మిల పాదయాత్ర, బహిరంగ సభ విజయవంతం అయ్యాయి.‌ శ్రీమతి షర్మిలకు జ్యేష్ఠ రమేష్‌బాబు కిరీటం పెట్టి, కరవాలాన్ని అందించగా, జోగి రమేష్ కొండపల్లి బొమ్మను అందజేశారు. అప్పిడి కిర‌ణ్‌కుమార్‌రెడ్ది ఇచ్చిన విల్లును శ్రీమతి షర్మిల ఎక్కుపెట్టి సభకు హాజరైన అందరినీ ఆకట్టుకున్నారు. మైలవరంలో శ్రీమతి షర్మిలను కలిసిన పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి కొద్దిసేపు పాదయాత్రలో పాల్గొని అనంతరం సభకు హాజరయ్యారు.

120 రోజుల మరో ప్రజాప్రస్థానం ప్రత్యేకత :
పాదయాత్ర ఆదివారం 120 రోజులు పూర్తికావడంతో మైలవరం నియోజకవర్గం ప్రత్యేకతను నిలుపుకొంది. పాదయాత్ర ప్రారంభంలో పార్టీ జెండా రంగులతో కూడిన పావురాలను శ్రీమతి షర్మిల, ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), జ్యేష్ఠ రమేష్‌బాబు ఎగురవేశారు. పాదయాత్ర అగ్రభాగంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 120 భారీ పతాకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పార్టీ మైలవరం మండల కన్వీనర్ పి.అని‌ల్‌కుమా‌ర్ సతీమణి సువర్ణలత చేతుల మీదుగా 120 మంది మహిళలకు పార్టీ చీరలను పంపిణీ చేశారు. సభాస్థలి వద్ద ప్రత్యేకంగా హైడ్రాలిక్ (గాలి బెలూ‌న్) బ్యాన‌ర్‌లు ఏర్పాటు చేశారు.
Back to Top