పుష్కరాల పేరుతో నయా దోపిడీ

విజయవాడ))
పుష్కరాలకు సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. తీరా చూస్తే ఎక్కడి పనులు అక్కడే
వెక్కిరిస్తున్నాయి. ఎప్పటిలాగే చంద్రబాబు మరోసారి రంకెలు వేశాక, పనులు వేగవంతం
చేసినట్లు కలరింగ్ ఇచ్చేందుకు అధికారులు, టీడీపీ నాయకులు ఎదురు చూస్తున్నారు.

 

 పుష్కర ఘాట్ ల నిర్మాణంలో నత్త నడక

 ధ్యానబుద్ధ విగ్రహం నుంచి అమరేశ్వర
స్నానఘాట్‌ను కలుపుకొని సుమారు 1.3 కిలోమీటర్ల మేర ఘాట్‌ను రూ.16కోట్లతో నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు కాంక్రీట్ పనులు 30శాతం పూర్తయ్యాయి.   సీతానగరంలో
కృష్ణానది ఒడ్డున ఆంజనేయస్వామి దేవస్థానం నుంచి సుమారు అర కిలోమీటరు పొడవున
నిర్మిస్తున్న పుష్కర ఘాట్ పనులు 30 శాతం కూడా పూర్తికాలేదు.  పాత ఘాట్లకు
 శుక్రవారం నుంచి టైల్స్ అంటించి చేతులు దులుపుకోవాల‌నుకుంటున్నారు.  
బ్యారేజీ నుంచి పుష్కర ఘాట్ల వరకూ కృష్ణానది ఒడ్డున ఉన్న రిటైనింగ్ వాల్
కూలిపోతున్నా పట్టించుకోకుండా సీసీ రోడ్లు నిర్మిస్తున్నారు. పుష్కర నగర్‌లు
ఏర్పాటుచేసే విషయాల్లో పోలీసులు, రెవెన్యూ,
మున్సిపల్
అధికారులకు మధ్య సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తోంది. పార్కింగ్, భక్తులు  వేచి ఉండేందుకు తాత్కాలిక
వసతికి ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

 

హారతి వేదిక పై అయోమయం

కృష్ణా-గోదావరి సంగమం వద్ద కృష్ణమ్మ హారతులు నిర్వహిస్తామని
ప్రభుత్వం ప్రకటించింది. నది మధ్యలో శాశ్వత నిర్మాణం ఏర్పాటుచేసి అక్కడ హారతులు
నిర్వహిస్తామని కూడా చెప్పింది. ఇప్పటివరకు అక్కడ ఏవిధమైన ఏర్పాట్లు జరుగుతున్న
దాఖలాలు లేవు.

 

నత్తతో పోటీపడుతున్న పనులు

ఇబ్రహీంపట్నం నుంచి తుమ్మలపాలెం వరకూ 2.1 కిలోమీటర్ల మేర పుష్కర ఘాట్‌ లో మట్టి పనులు
మాత్రమే జరుగుతున్నాయి. గోదావరి నీరు వచ్చే కాల్వపై ఫుట్‌బ్రిడ్జిలు నిర్మించాలని, ఘాట్‌కు గ్రానైట్ రాళ్లు వేయాలని అధికారులు
భావించారు. ప్రస్తుతం సమయాభావం వల్ల ఫుట్‌బ్రిడ్జిలకు స్వస్తి పలికారు. గ్రానైట్
రాళ్లకు బదులుగా సాధారణ టైల్స్ వేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువ నుంచి
భవానీపురంలోని భవానీఘాట్ వరకూ 2.3 కిలోమీటర్లు ఒకటే ఘాట్ నిర్మించాలని తొలుత భావించారు. అయితే, మధ్యలో హెడ్‌వాటర్ వర్క్స్ వెల్స్ ఉండటంతో
పున్నమి ఘాట్ నుంచి భవానీ ఘాట్ వరకూ 1.5 కిలోమీటర్ల మేర ఒకటే ఘాట్ నిర్మించాలని
నిర్ణయించారు. భవానీ ఘాట్ వద్ద గతంలో వందమీటర్ల ఘాట్ ఉండేది. దీన్ని తొలగించి
ఏకఘాట్ చేయాలని నిర్ణయించారు. మిగిలిన ఘాట్లతో పోలిస్తే ఇక్కడ పనిలో కాస్త పురోగతి
కనిపిస్తోంది.  

శతకోటి కారణాలు

టెండర్ విధానానికి పాతర వేయాలని టీడీపీ నాయకులు ముందుగానే ఫిక్సు అయ్యారు.
దీంతో చంద్రబాబు రంకెలు వేసిన ప్రతీసారి.. కొన్ని కొన్ని పనులు నామినేషన్ పద్దతిలో
అప్పగించేట్లుగా స్కెచ్ వేసుకొన్నారు. దీంతో పనులు చాలా ఆలస్యంగా మొదలయ్యాయి.

అనేక పనులకు గత మే 15 వరకు శ్రీకారం చుట్టలేదు. దీంతో ఇప్పుడు
పగలు రాత్రి హడావుడిగా చేయాల్సి వస్తోంది. ప‌నులు త్వ‌ర‌గా పూర్తిచేయాల‌నే ఆలోచ‌న‌తో
నాణ్య‌త‌ను ప‌క్క‌న పెట్టారు.

తెలుగుదేశం నాయకుల ఒత్తిడి మేరకు .. పుష్కర పనులు నత్తనడకన
సాగుతుంటే పుష్కరాల విధుల్లో ఉన్న ఇంజినీర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఎస్‌ఈ
నుంచి జేఈల వరకూ బదిలీ చేయడం, బదిలీ
అయిన వారికి కొత్తచోట చార్జింగ్ తీసుకుని, తిరిగి
ఇక్కడకు వచ్చి విధులు నిర్వహించమని చెప్పడం కూడా ఒక కారణమే.

ముఖ్యమంత్రి,
మంత్రులు, కలెక్టర్లు, అధికారులు తనిఖీలు చేస్తూ హడావుడి చేయడమే
తప్ప వాస్తవంగా పుష్కరాలు ఎంతమేరకు చేయాలనే అంశంపై కాంట్రాక్టర్లకు స్పష్టత ఇవ్వడం
లేదు. పుష్కరాల  తరువాత కూడా పనులు చేయాల్సి ఉండటంతో అయినంత వరకే
 చేద్దామనే ఆలోచనలో కాంట్రాక్టర్లు ఉన్నట్టు సమాచారం. ఆల‌స‌మైందంటూ హ‌డావుడి
చేసి అందినంత డబ్బు దోచేయాల‌న్న‌ ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.
వాతావ‌ర‌ణం స‌హ‌క‌రించ‌డంలేద‌ని సాకులతో అధికారులు కాలం గ‌డిపేస్తున్నారు.

 

Back to Top