నాసిరకంగా పుష్కర పనులు

రాజమండ్రి :
గోదావరి నదికి పుష్కరాలు వచ్చేస్తున్నాయి. ఈ నెల 14 నుంచి పన్నెండు రోజుల
పాటు పుష్కరాలు ఉంటాయి. పన్నెండేళ్ల కో సారి వచ్చే పుష్కరాలకు గాను అంతకంతకూ జనం సంఖ్య
పెరుగుతూనే ఉంది. ఇంతటి మహా క్రతువుకు జరగాల్సిన రీతిలో ఏర్పాట్లు జరగటం లేదు.

 పుష్కర సంరంభం

 గోదావరి నదిలో పుష్కర సమయంలో స్నానాలు
చేసి, పితృ దేవతలకు పిండ ప్రదానం చేస్తే చాలా పుణ్యం అని ఒక నమ్మిక. అందునా పుష్కరాలకు
ప్రధాన కేంద్రమైన రాజమండ్రి లో ఈ పుణ్య స్నానాలు, పిండ ప్రదానాలు
చేయటం ఆనవాయితీ. లక్షల మంది వచ్చే కార్యక్రమం కాబట్టి ఏడాది ముందు నుంచే ఏర్పాట్లు
జరగటం ఆనవాయితీ. ఒక ఐఎఎస్ ఆఫీసర్ ను స్పెషల్ ఆఫీసర్ గా నియమించి చురుగ్గా ఏర్పాట్లు
చేసేవారు. దీంతో పుష్కరాలకు పది పదిహేను రోజుల ముందే పనులు పూర్తయితే, తుది విడత సమీక్ష జరిపేందుకు అవకాశం ఉండేది.

తెలుగు తమ్ముళ్లలో తగువులు

 పుష్కరాల సమయంలో అందినంత వరకు కొట్టేద్దామని
తెలుగు తమ్ముళ్లు పోటీ పడ్డారు. ఇందుకు తగినట్లుగా జోరుగా పైరవీలు సాగించారు. చిన్న
చితకా పనుల్ని దక్కించుకోవటం వరకు బాగానే జరిగింది. కానీ పెద్ద పనులు విషయానికి వచ్చేసరికి
మంత్రిమండలిలో చక్రం తిప్పుతున్న కోటరీకి చెందిన మంత్రిగారు రంగ ప్రవేశం చేశారు. అప్పటిదాకా
ఉన్న స్పెషల్ ఆఫీసర్ ను పక్కకు తప్పించేసి, వేరే అధికారికి  స్పెషల్ ఆఫీసర్ బాధ్యతలు అప్పగించారు. నేరుగా ఈ
అధికారిని గుప్పెట్లో ఉంచుకోవటంతో సీన్‌మొత్తం మారిపోయింది. అప్పటిదాకా జరిగిన పైరవీలన్నీ
మరో మలుపు తిరిగాయి.

 ఒక్క మంత్రి చుట్టూ కథ..!

మంత్రి మండలి లో చక్రం తిప్పుతున్న ఒక
మంత్రికి పుష్కరాలు బాగా నచ్చాయి. అందుకే అక్కడ పనిచేస్తున్న ఉన్నతాధికారుల్ని గుప్పిట్లోకి
తీసుకొన్నారు. కాంట్రాక్టులు ఇవ్వాలన్నా, పనులు అప్పగించాలన్నా ఆ మంత్రి
మాటే తుదినిర్ణయంగా మారింది. ఈ లోగా మంత్రిగారు కోటరీకి చెందినవారు కాబట్టి చాలా బిజీగా
ఉండేవారు. దీంతో పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేయకుండా తొక్కి పట్టారు. కింది స్థాయి
అధికారులు మనకు ఎందుకొచ్చిన గొడవ అనుకొని ఊరుకొన్నారు. చివరకు పుష్కరాల కాలం వచ్చేసింది
కానీ ఎక్కడి పనులు అక్కడే మిగిలిపోయాయి.

సందట్లో సడేమియా..!

ఈ లోగా అర కొరా పనులు దక్కించుకొన్న తెలుగు
తమ్ముళ్లు వాటికి సంబంధించిన బిల్లులుమంజూరు చేయించుకోవటం, ఇతరత్రా
పనుల చక్కబెట్టుకొన్నారు. పెద్ద పనులకు సంబంధించి నామినేషన్ పద్దతిన పనులు కేటాయించుకొనేందుకు
రంగం సిద్దం చేసుకొన్నారు. అనుకొన్నట్లుగానే ఆ మంత్రిగారి ఆశీస్సులు దక్కించుకొని చివరి
నిముషంలో హడావుడిగా పనులు మొదలెట్టారు. చివరి నిముషంలో అయితే నాణ్యతాపరమైన తనిఖీలు
ఉండవు కాబట్టి తూతూ మంత్రంగా పనులు ముగించేందుకు కంకణం కట్టుకొన్నారు. అనుకొన్నట్లుగానే
వాటాలు పంచుకొని పనుల్ని పూర్తి చేస్తున్నారు.

నాణ్యతను ప్రశ్నించిన వైఎస్ జగన్

రాజమండ్రిలోని ప్రధాన ఘాట్లను ప్రతిపక్ష
నేత వైఎస్ జగన్ తనిఖీ చేశారు. అక్కడ పనులన్నీ నాసిరకంగా ఉండటంతో ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ
యంత్రాంగం తీరుని తప్పు పట్టారు.  లక్షలాది
భక్తులు వచ్చే చోట్ల నాసిరకం పనులు జరిపించటం సరికాదని హితవు పలికారు. ప్రతిష్టాత్మకంగా
పనుల్ని నిర్వహించాల్సిన చోట, నాసిరకం పనులు చేయటం సరికాదని అభిప్రాయ పడ్డారు.

తాజా వీడియోలు

Back to Top