నారా వారి నంగనాచి కబుర్లు

– మహిళలపైబాబు  దొంగ ప్రేమ
– రోజా సస్పెన్షన్‌పై సమాధానం లేదు
– మూడేళ్లుగా మహిళలపై నిత్యం దాడులే
-మహిళల గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదు

చంద్రబాబు మరోసారి తన సహజ శైలిలో రెచ్చిపోయాడు. మహిళలను ఉద్ధరించడానికే తాను పుట్టినట్టు డప్పు కొట్టుకున్నాడు. ఆయన మాటలు వింటే వేమన పద్యం గుర్తురాక మానదు. 
ఎలుకతోలుదెచ్చి ఏడాది యుతికిన
నలుపు నలుపెగాని తెలుపురాదు
కొయ్యబొమ్మ దెచ్చి కొట్టినబలుకదు
విశ్వదాభిరామ వినురవేమ !

ఎలుక తోలు తెచ్చి ఏడాదంతా ఉతికినా నలుపేకానీ తెలుపు రాదు.. అలాగే కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా మాట్లడదు అన్నట్టుగా చంద్రబాబు వ్యవహారం ఉంది. ఇన్నాళ్లు చేసిన ఘనకార్యాలన్నీ మరిచి తాను ఉత్తమ పురుషుడి లాగా మాట్లాడి గజినికి కజిన్‌ బ్రదర్‌లా వ్యవహరించాడు. విలేకరుల సమావేశం నిర్వహించినప్పుడే జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం ఇష్టపడని బాబు మామూలు సమావేశాల్లో ఊరుకుంటాడా. ఆర్టీసీలో మహిళలను నేనే నియమించా, డ్వాక్రా మహిళల  ఘనత నాదే.. దీపం పథకంతో ఆడవారి వంటింటి కష్ఠాలు తీర్చా.. అని మైకుకే చెవులు పోయేలా మాట్లాడాడు. నిజానికి బాబు ప్రవేశపెట్టిన పథకాలన్నీ దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో అప్పటికే అమలు జరుగుతున్నవే. అదీ కాక అవన్నీ ప్రపంచబ్యాంకు ఇచ్చిన ఐడియాలే. అయితే బాబు మాత్రం అంతా తన ఘనతగా ప్రచారం చేసుకోవడం మాత్రం తగ్గడం లేదు. ఎలుక సామెతలా తయారైంది ఆయన వ్యవహారం. ఇంకా చాలా నీతులే చెప్పారు.  మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడతామన్నారు. బ్యాడ్మింటన్‌ స్టార్‌ సింధుని డిప్యూటీ కలెక్టర్‌ని చేస్తామని చెప్పారు. మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సుని ఘనంగా నిర్వహించేశామని చెప్పుకొచ్చారు. 

వేధింపులపై ఏం చేస్తారో చెప్పలేదే..
అంతా బాగానే వుందిగానీ, రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులపై మాత్రం చంద్రబాబు మాట పెగలలేదు. సొంత పార్టీ నాయకులు చేస్తున్న వేధింపులు కానీ, ప్రతిపక్ష ఎమ్మెల్యే రోజాను మహిళా పార్లమెంట్‌కు పిలిచి అవమానించడం.., ఏడాదిపాటు సభలో అడుగుపెట్టకుండా నిషేధం విధించడం.,., మరో ఏడాది పొడిగించేందుకు కసరత్తులు చేయడం.., ఇలాంటి వాటికి మాత్రం ఆయన దగ్గర సమాధానం లేదు. నోరెత్తి మాట్లాడే ధైర్యం లేదు. ఆయన్ను ప్రశ్నిస్తే మాత్రం అంతెత్తున లేచి ఎక్కడా రాయని రూల్స్‌ గురించి మాట్లాడతారు. ఎందుకంటే ఆయన నిప్పు.. 
ఇప్పటికే ఏడాదిపాటు అసెంబ్లీ నుంచి రోజాపై సస్పెన్షన్‌ వేటు వేసింది చాలక, మరో ఏడాది సస్పెన్షన్‌ దిశగా అడుగులు వేస్తోంది చంద్రబాబు సర్కార్‌. మార్చ్‌ 13న ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో రోజాపై తాజా సస్పెన్షన్‌ వేటుకి సంబంధించి కీలకమైన పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే చేయని నేరానికి రోజాను ఏడాదిపాటి శిక్షించారు. మళ్లీ సస్పెన్షన్ కొనసాగించడమా న్యాయమేనా అని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ కూడ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌ ప్రశ్నకు టీడీపీ నుంచి సమాధానమే రాలేదు.! 

బాబు పాలనలో మహిళలకు రక్షణ కరువు
కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అంటూ బాబు ఆడవాళ్ల పట్ల చుకలనగా మాట్లాడుతాడు.  ఓ ఎమ్మెల్యే, మహిళా అధికారిపై చెయ్యి చేసుకున్నా పట్టించుకోడు. పైగా, ఈ వ్యవహారంలో సదరు మహిళా అధికారిదే తప్పని చంద్రబాబు తీర్పు ఇచ్చేశాడు. ఇక మంత్రి రావెల కిషోర్ బాబు కొడుకు ఓ మైనారిటీ సోదరిపై వేధింపులకు పాల్పడితే చర్యలు లేవు. రాజధాని నడిబొడ్డున కాల్ మనీ సెక్స్ రాకెట్ పేరుతో మహిళల మాన ప్రాణాలతో టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ బుద్దావెంకన్నలు రాక్షస క్రీడ ఆడితే బాబు అసెంబ్లీలో వాళ్లను పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. మహిళల జీవితాలతో చెలగాటమాడిన టీడీపీ నేతలను శిక్షించాలని కోరితే ప్రతిపక్ష మహిళా ఎమ్మెల్యే అన్న గౌరవం కూడ లేకుండా రోజాను నిబంధనలకు విరుద్ధంగా ఏడాదిపాటు సస్పెండ్ చేశాడు. అంతే కాదు మహిళలపై నిత్యం టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నా బాబు మందలించడు. చంద్రబాబు తన పార్టీ నేతలకు అండగా నిలవడం వల్లే, మహిళలపై బాబుకు గౌరవం లేకపోవడం వల్లే, నిందితులకు కొమ్ముకాయడం వల్లే  రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థులు ఆత్మబలిదానాలకు పాల్పడ్డారు.  సొంత  పార్టీకి చెందిన ప్రజా ప్రతినిథి జానీమూన్‌పై స్వయానా మంత్రిగారే వేధింపులకు దిగితే, చంద్రబాబు సర్కార్‌ స్పందించిన దాఖలాల్లేవు.  ఇలాంటి చంద్రబాబుకు మహిళల గురించి మాట్లాడే అర్హతే లేదు. మహిళా ద్రోహి చంద్రబాబుపై నారీమణులంతా మండిపడుతున్నారు. మహిళల పట్ల అమర్యాదగా ప్రవర్తించే బాబు సర్కార్ ను సాగనంపేందుకు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు.  
Back to Top