నాడు హామీలు.. నేడు డ్రామాలు

– టీడీపీ ఎంపీల రోజుకో కొత్త నాటకం
– ప్రధాని కనపడితే కూర్చోవడం.. బయటకొచ్చి ప్లకార్డులు పట్టుకోవడం
– పార్లమెంట్‌లో పొగడ్తలు.. అమరావతికొచ్చి హెచ్చరికలు 
– ఎక్కడా కనపడని కేంద్రమంత్రులు సుజనా, అశోక్‌ గజపతిరాజు


టీడీపీ ఎంపీలు మరోసారి తమ నైజాన్ని బయటపెట్టారు. మొన్న చంద్రబాబుతో మీటింగ్‌ అనంతరం వీరావేశంతో బయటకొచ్చిన తెలుగుదేశం నాయకులు రెండు రోజులు హడావుడి చేసి చల్లారిపోయారు. మోడీతో మీటింగ్, రాజ్‌నాథ్‌ సింగ్‌ బుజ్జగింపులు, అమిత్‌షా హామీ అని..విభజన హామీలు నెరవేరుస్తామన్నారు.. అని అనుకూల పత్రికల్లో మొదటి పేజీ వార్తలు రాయించుకున్నారు. టీజీ వెంకటేశ్‌ లాంటి వాళ్లయితే మోడీకి ఎంత ధైర్యం, ఎంత పొగరు.. చంద్రబాబు మూడో కన్నుSతెరిస్తే ∙మోడీకి ఇంకేమైనా ఉందా.. అని చంద్రబాబే దేశానికి ప్రధాని అన్నంతగా ఏపీకి అన్యాయం జరిగిపోయిందని రగిలిపోయాడు. అంతకుముందు రోజే రాజ్యసభలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్‌ధన్, నోట్ల రద్దు, స్వచ్ఛ భారత్‌ వంటి పథకాలను అద్భుతమంటూ పొగిడేసి.. ఆంధ్రాకొచ్చి అదే మోడీని తిట్టిపోశాడు. సుజనా చౌదరి ప్రధాని మోడీతో సమావేశమై పరిస్థితులు అన్నీ సర్దుకున్నాయి అన్నట్టుగానే చెప్పుకొచ్చాడు. అదంతా మొన్నటి సంగతి.. 
మళ్లీ అదే చెప్పిన అరుణ్‌జైట్లీ...
రోజు గడిచింది.. కేంద్ర మంత్రి అరుణజైట్లీ ప్రెస్‌ మీట్‌ పెట్టారు. ఏపీకి అన్నీ చేసేశాం.. అన్నట్టుగానే లెక్కలు తీశాడు. జీఎస్టీ వచ్చినందున సాంకేతికంగా ప్రత్యేక హోదా సాధ్యపడదని చెప్పారు. అయినా ఏపీకి మేలు చేసేందుకే ఉన్నామంటూ ఊదరగొట్టారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్ర్రాలకు 90 శాతం వాటా ఇస్తాం.. మిగిలిన రాష్ట్రాలకు 40 శాతం ఇస్తాం.. అదిప్పుడు సాధ్యపడదు కనుక.. మిగిలిన 30 శాతం వాటాను అందజేస్తామని ప్రకటించారు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పటికే రాష్ట్రానికి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశామని.. మిగతా హామీలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని షరామామూలుగానే చెప్పుకొచ్చారు. 
ఇప్పుడు ధర్నా చేయడే..
  ఇంత జరగుతున్నా చంద్రబాబులో ఏమాత్రం చలనం లేదు. మరుగుదొడ్ల నిర్మాణం కోసం కలెక్టర్ల మీద ధర్నా చేస్తానన్న ముఖ్యమంత్రి.. రాష్ట్రానికి హక్కుగా దక్కాల్సిన విభజన హామీలు నెరవేర్చకపోతే నోరెత్తే సాహసం చేయడంలేదు. తాను కేసులకు భయపడుతన్నానని బయట ప్రచారం జరుగుతోందని తెలుసుకున్న చంద్రబాబు.. కాదని నిరూపించుకునేందుకు మోడీని విభజన హామీలు నెరవేర్చమని ప్రశ్నించడం లేదు. టీడీపీ ఎంపీలైతే చంద్రబాబును మించిపోయారు. మీడియా కనిపించినప్పుడు కాసేపు ప్లకార్డులు పట్టుకుని హడావుడి చేసేసి.. మోడీ కనపడగానే కిక్కురుమనకుండా వెళ్లి కూర్చుండిపోయారు. కేంద్ర మంత్రులైతే ఎక్కడా ప్రశ్నించినదాఖలాలు లేనే లేవు. ఒక పక్క వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ మిధున్‌రెడ్డి మోడీ సహా కేంద్రప్రభుత్వాన్ని పార్లమెంట్‌ సాక్షిగా ఎండగడితే.. టీడీపీ నాయకులు నోరెత్తకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
Back to Top