మోత్కుపల్లి ప్రశ్నలకు బదులేది బాబూ..?


– ముఖ్యమంత్రిగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే
– ఓటుకు నోటు కేసు, 29 ఢిల్లీ పర్యటనలు, రేవంత్‌ అరెస్టులకు బదులివ్వు
– అమరావతికి పారిపోయింది కేసీఆర్‌కు భయపడే అన్న ఆరోపణలకు స్పందించు
– కేసుల కోసం హోదాను తాకట్టు పెట్టింది నిజం కాదా ?


నువ్వు చవటవి, దద్దమ్మకి, అవకాశవాదివి, అవసరాల కోసం వాడుకుని వదిలేయడం నీకు అలవాటు, నువ్వు చెప్పే మాటలకు.. చేసే చేసే చేతలకు పొంతనే ఉండదు. ఎన్‌టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి జెండా లాక్కున్నావు.. నీకంటూ ఒక సొంత ఎజెండా లేదు.. అధికారం కోసం ఎన్నికలొచ్చినప్పుడల్లా పార్టీలతో పొత్తులు మారుస్తుంటావ్‌..  నీ దగ్గర ఎస్సీ, ఎస్టీలకు గౌరవం ఉండదు.. నువ్వు దళిత ద్రోహివి.. ఓటుకు నోటు కేసుకు భయపడి అమరావతి వదిలి వెళ్లిపోయావ్‌.. పరిచయం అక్కర్లేని ఈ ఆరోపణలకు ఓనర్‌ ఎవరో చెప్పాల్సిన పనిలేదు. వెన్నుపోటు రాజకీయం, పార్టీలతో పొత్తులు మార్చడం వంటివన్నీ చంద్రబాబును ఉద్దేశించినవే అనేది చిన్న పిల్లాడిని అడిగినా తడుముకోకుండా చెప్పేస్తాడు. అయితే తాజాగా ఆయనపై అదే పార్టీ తాజా మాజీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర ఆరోపణలు చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే బాబు పరువును రోడ్డున పెట్టేశాడు. 

40 ఏళ్ల రాజకీయ అనుభవం అని వి్రరవీగే చంద్రబాబును పాపాల పుట్టి, అక్రమాల కుప్ప.. వెన్నుపోటు వీరుడు.. చేతకాని సూరుడు అని ఆయన్ను రోడ్డుకు లాగాడు. రాజకీయాల్లో సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యలు చాలా సాధారణమే. కాకపోతే ఇక్కడ మోత్కుపల్లి వ్యాఖ్యలకు చాలా ప్రాధాన్యం ఉంది. ఆయన సాధారణ వ్యక్తి కాదు. టీడీపీ కార్యకర్త కాదు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. ఎన్‌టీఆర్‌ పార్టీ పెట్టిన నాటి నుంచి టీడీపీలో కొనసాగుతూ వస్తున్నారు. ఎంతోమంది పార్టీని వదిలి వెళ్లినా.. మోత్కుపల్లి మాత్రం మూడు దశాబ్దాలకు పైగా పార్టీకి, చంద్రబాబుకు నమ్మిన బంటుగా పనిచేస్తున్నాడు. దళితుడిగా, సీనియర్‌ రాజకీయ నాయకుడిగా ఆయన చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుని తీరాల్సిందే. చంద్రబాబు మీద ఆరోపణలు చేశాడని ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి ఉండొచ్చుగాక. అది ఆ పార్టీ అంతర్గత విషయం. కానీ ఆయన చేసిన  ఆరోపణలు పార్టీకి సంబంధించినవే కాదు.. ఓటుకు నోటు కేసు.. ఆంధ్రాలో అభివృద్ధి.., చంద్రబాబు 29 సార్లు ఢిల్లీ పర్యటనలు, మోడీ, జైట్లీ, అమిత్‌షాలను కలవడం.., బీజేపీతో పొత్తులు తదితర కీలకమైన అంశాలను విలేకరుల సమావేశంలో మోత్కుపల్లి ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. 

దశాబ్దాల పాటు చంద్రబాబుకు నమ్మినబంటుగా ఉంటూ వచ్చిన మోత్కుపల్లి న ర్సింహులు లాంటి వ్యక్తి చేసిన వ్యాఖ్యలను ఆవేశంతో చెప్పిన మాటలుగా కొట్టి పారేయలేం. ఒక ముఖ్యమంత్రిగా అన్నింటికీ చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. తనపై నిందారోపణలు చేశాడని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి ఉండొచ్చుగాక.. అంతటితో బాబు ఆరోపణల నుంచి బయట పడినట్టు మాత్రం కాదు. చంద్రబాబు బతికున్నంత కాలం ఆయన్ను వెంటాడుతూనే ఉంటాయి. ఎన్‌టీఆర్‌ తన చివరి రోజుల్లో చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఇప్పటికీ ఆరోపణలు ఎదుర్కుంటూనే ఉన్నారు. ఎప్పుడు చూసినా ఇదొక చరిత్ర అని చెప్పుకునే చంద్రబాబు ఆయన చరిత్రలో ఉన్న చీకటి కోణాలను మోత్కుపల్లి బయటపెట్టాడు. చంద్రబాబును ఒక్కసారి ఓడించి బుద్ధి చెప్పమని ఆంధ్రా ప్రజలను వేడుకున్నాడంటేనే బాబు నుంచి ఎంత నరక యాతన అనుభవించిందీ తెలుస్తుంది. ఇలాంటివి బయట నుంచి ప్రతిపక్షాలు చేసిన వాటిని రాజకీయ ఆరోపణలుగా భావించి తేలిగ్గా తీసుకున్నా.. మోత్కుపల్లి ప్రశ్నలకు మాత్రం చంద్రబాబు ఒక ముఖ్యమంత్రిగా సమాధానం చెప్పి తీరాల్సిందే.. 
 
Back to Top