మోకాలు నొప్పిగా ఉన్నా ముందడుగేసిన షర్మిల

హైదరాబాద్‌, 7 ఫిబ్రవరి 2013: కళ్ల ముందున్నది సుదీర్ఘమైన చారిత్రక గమ్యం.. కానీ కదిలితే మొకాలి నొప్పి.. అయినా ఆమె ఆ నొప్పిని పంటి బిగువున అదిమిపట్టారు.. ఆత్మవిశ్వాసంతో ఆమె మొదటి అడుగు వేశారు.. ప్రజల బాగోగులు పట్టించుకోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్నీ, దానితో కుమ్మక్కయి అంటకాగుతున్న ప్రధాన ప్రతిపక్షం టిడిపిని ప్రజలతో కలిసి నిలదీసేందుకు జననేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం బాట పట్టారు. అమ్మ శ్రీమతి విజయమ్మ, వదినమ్మ శ్రీమతి భారతి తోడు రాగా శ్రీమతి షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రను బుధవారం ఉదయం మళ్ళీ ప్రారంభించారు. తమ బాధలు వినేందుకు వస్తున్న శ్రీమతి షర్మిల అడుగులో అడుగు వేసి జనం తోడుగా కదలి వచ్చారు. ‘మీ వెంటే మేమున్నాం' అంటూ దన్నుగా వెన్నంటారు. తొలి అడుగు మరో అడుగై.. తొలి రోజున శ్రీమతి షర్మిల ఏక బిగిన 15.5 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు.

ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని తమ నివాసం నుంచి శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభించే తుర్కయాంజాల్‌కు బయలుదేరారు. పాదయాత్రకు కదిలే ముందు శ్రీమతి షర్మిలను ఆశీర్వదిస్తూ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం శ్రీమతి షర్మిల నుదుటన మాతృమూర్తి శ్రీమతి విజయమ్మ ముద్దుపెట్టి ముందుకు సాగనంపారు. 10.30 గంటలకు శ్రీమతి షర్మిల రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ సమీపంలోని ఎ‌స్ఎ‌స్ఆ‌ర్ గార్డెన్సుకు చేరుకున్నారు.‌
మోకాలి గాయం తగిలినందు వల్ల గడచిన డిసెంబరు 15న శ్రీమతి షర్మిల పాదయాత్ర నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది తుర్కయాంజాల్‌ వద్దే. బుధవారం ఉదయం సరిగ్గా 11.01 గంటలకు శ్రీమతి షర్మిల పాదయాత్ర పునఃప్రారంభమైంది. తల్లి శ్రీమతి వైయస్ విజయమ్మ, వదిన‌మ్మ శ్రీమతి వైయస్ భారతి తోడుగా వచ్చి తుర్కయాంజా‌ల్ వరకు ఆమెను సాగనంపారు.


‌మోకాలు నొప్పిగా ఉన్నా మధ్య మధ్యలో మోకాలి పట్టీని గట్టిగా బిగించి కట్టుకుంటూ షర్మిల మునుముందుకు సాగారు. ఎముకల వైద్య నిపుణుడు డాక్టర్ చంద్రశేఖరరెడ్డి కూడా ‌షర్మిలతో పాటు నడుస్తూ వైద్య సేవలు అందించారు. ‘జాగ్రత్త బిడ్డా.. ఎండలు ఎక్కువైంది.. మెల్లగా నడువు.. అన్నను బయటికి తెచ్చే వరకు ఆగకు బిడ్డా’ అని శ్రీమతి షర్మిలకు తుర్కయాంజాల్‌కు చెందిన వృద్ధురాలు దాసర్ల లింగమ్మ జాగ్రత్తలు చెప్పారు. ఇలాంటి ఆత్మీయ పలకరింపులు.. ఆశీస్సులు.. శ్రీమతి షర్మిలకు దారి పొడవునా కొనసాగాయి.

కరెంటు బిల్లు కట్టలేం..
నడక మార్గంలో శ్రీమతి షర్మిల తుర్కయాంజాల్‌ గేట్‌ వద్ద రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలతో ఆమె సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కరెంటు బిల్లు కట్టలేమని.. ఈ సర్కారును కూలగొట్టమని పాపమ్మ అనే వృద్ధురాలు ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల వద్ద మొరపెట్టుకున్నారు. బొంగులూరు గేటు వద్ద పోచారం గ్రామానికి చెందిన జంగయ్య యాదవ్‌ శ్రీమతి షర్మిలకు గొర్రెపిల్లను బహూకరించారు. దివంగత ముఖ్యమంత్రి‌, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డితోటే మా గొల్లల బతుకులు పోయిన‌య్ బిడ్డా అని ‌జంగయ్య కన్నీరు పెట్టుకున్నాడు. రమేష్ అనే వికలాంగుడు‌ శ్రీమతి షర్మిలతో మాట్లాడుతూ.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తనకు బతుకు భారమైపోయిందంటూ విలపించాడు. రమేష్‌ కు ధైర్యం చెప్పి శ్రీమతి షర్మిల ముందుకుసాగారు.

రాగన్నగూడ, మన్నెగూడ మీదుగా శ్రీమతి షర్మిల శేరిగూడ చేరుకున్నారు. అక్కడ ఇంజనీరింగ్ విద్యార్థులు వచ్చి శ్రీమతి షర్మిలకు సంఘీభావం ప్రకటించారు. తర్వాత ఇబ్రహీంపట్నం చేరిన ఆమె‌ మహానేత వైయస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఒక దంపతుల కోరిక మేరకు వారి పాపకు విజయమ్మ అని నామకరణం చేశారు. తర్వాత పెద్ద ఎత్తున తరలివచ్చిన జన ప్రవాహాన్ని ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగించారు. అక్కడి నుంచి 1.5 కిలో మీటర్లు ప్రయాణించిన తరువాత శాస్తా గార్డెన్సులో ఏర్పాటు చేసిన రాత్రి బస కేంద్రానికి శ్రీమతి షర్మిల చేరుకున్నారు. పాదయాత్ర మలివిడత తొలిరోజు (58వ రోజు) మొత్తం 15.5 కిలోమీటర్ల దూరం ఆమె ప్రయాణించారు.

పాదయాత్రలో పాల్గొన్న ప్రముఖులు :
శ్రీమతి షర్మిలకు సంఘీభావంగా పాదయాత్రకు పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, గురునాథ్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మేకతోటి సుచరిత, మద్దాలి రాజేష్, పార్టీ నాయకులు వై‌.వి. సుబ్బారెడ్డి, కొండా సురేఖ, కె.కె. మహేందర్‌రెడ్డి, బెక్కరి జనార్ధన్, రా‌జ్‌ఠాకూర్, పుత్తా ప్రతా‌ప్, దేప భాస్క‌ర్, బాజిరెడ్డి గోవర్ధ‌న్, ఎం‌.వి.ఎస్‌. నాగిరెడ్డి, కె. శివకుమార్, చల్లా మధుసూద‌న్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, పి.జె.ఆర్‌. కుమార్తె విజయారెడ్డి తదితరులు శ్రీమతి షర్మిలతో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు.
Back to Top