బాబు తలకాయ – కేంద్రం మొట్టికాయ

టిడిపి సర్కార్ పరిస్థితి చూస్తుంటే, ఇచ్చిన హోమ్ వర్క్ చేయకుండా టీచర్ ముందు నిలుచున్న స్టూడెంట్ లా ఉంది. మూడేళ్లు గడిచినా పోలవరం ప్రాజెక్ట్ అతీ గతీ తేలడం లేదేంటని కేంద్రం చంద్రబాబు సర్కార్ ను బెత్తం చేత పట్టుకుని మరీ అడుగుతోంది. ప్రత్యేక ప్యాకేజీగా వెనుకబడ్డ జిల్లాలకు ఇచ్చిన నిధులను పూర్తిగా ఎందుకు వినియోగించలేదని నీతి ఆయోగ్ చెవులు మెలేస్తోంది. వీటి లెక్కలు వాటి వెనుక జిమ్మిక్కులు తేలందే కేంద్రం పైసా విదల్చదు, నారాని వదలదు. 

పోలవరం పేరు చెప్పి కోట్లు దండుకుంటున్న టిడిపి ప్రభుత్వం ఇప్పుడు ఇరకాటంలో పడింది. ఏం సమాధానం ఇవ్వాలో తెలియక తల వంచుకు నించుంది. మోడి ప్రధాని అయిన తరువాత చంద్రబాబు స్వయంగా ప్రధానిని కలిసి నిర్ణీత గడువులోగా పోలవరం పూర్తి చేస్తామని చెప్పాడు. అలా చేయని పక్షంలో కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ అంతా రుణంగా మారుతుందనే షరతుకు కూడా ఒప్పుకుని సంతకం పెట్టేసాడు. 
అదేమైనా ఆయన జేబులో సొమ్ము అయితే కదా. మహా అయితే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఈలోపు పోలవరం పేరుతో తన పొట్ట నింపుకుని, తనను నమ్ముకున్న నేతల జేబులు నింపేస్తాడు. ఎలాగూ మళ్లీ అధికారం రాదు కనుక, రాష్ట్రం అప్పుల సంగతి వచ్చే ప్రభుత్వం నెత్తిన పడుతుంది. ఇదీ చంద్రబాబు కుటిల ఆలోచన. 

తాడిని తన్నేవాడుంటే తల దన్నే వాడుంటాడు కదా. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని అలా ఏం వదిలేయలేదు. బిజెపి తో పొత్తు విషయంలో చంద్రబాబు రెండు నాల్కల విధానం మోదీకి బాగా తెలుసు. అందుకే ఓ కన్ను ఇటు వేసే ఉంచారు. పోలవరం నిర్మాణంలో కొన్ని కీలక విషయాల్లో రాష్ట్రప్రభుత్వం వైఫల్యాన్ని గుర్తించిన కేంద్రం, హెల్పింగ్ కోసం ఒక డిజైన్స్ రివ్యూ పానల్ కూడా నియమించింది. గత మూడేళ్లలో కేంద్రం 3,364.70 కోట్ల రూపాయల నిధులను ఇచ్చింది. అయితే పోలవరం పనులు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు వేగవంతంగా జరగడం లేదని, అంచనా వ్యయం పెరిగిందని, కాంట్రాక్టుల విషయంలో మోసాలు జరుగుతున్నాయని కేంద్రానికి తెలిసింది. దీనిపై నివేదిక సమర్పించమంటూ సెంట్రల్ వాటర్ కమీషన్ సభ్యుడు షేక్ మసూద్ హుస్సేన్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. ఇందులో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కార్యదర్శి ఆర్ కె గుప్తా, జాతీయ ప్రాజెక్టుల విభాగం డైరెక్టర్ భూపేష్ కుమార్ మరికొందరు ఉన్నత స్థాయి ప్రముఖులు ఉన్నారు. ఈ బృందం రెండు నెలల క్రితం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని, కుడి, ఎడమ కాలువలను, హెడ్ వర్క్స్ ను పరిశీలించింది. అధికారులతో సమీక్షించి, పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదికను కేంద్రానికి అందించింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక తేల్చిందేమంటే ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా మార్చి 2018కి పూర్తయ్యే అవకాశమే లేదు. వివిధ కారణాలతో ప్రాజెక్టు పని నత్తనడకన సాగుతోంది. అంతే కాకుండా నిబంధనలను గాలికొదిలి పోలవరం కుడి కాలువ, ఎడమ కాలువ పనులను వివిధ సాకులు చూపించి టెండర్లు లేకుండానే కాంట్రాక్టర్లకు అప్పగించారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వడం కోసం, పోలవరం కుడికాలువ పనులను 40 మీటర్లరకు కుదించి, తిరిగి మళ్లీ పెంచారు. దీనివల్ల అనవసరంగా కొన్ని వందల కోట్లు నిర్మాణ వ్యయం జరిగింది. అలాగే భూసేకరణ సమయంలో రైతులకు ఇచ్చిన పరిహారాల్లోనూ అవకతవకలున్నాయని గుర్తించింది. ఇవన్నీ చూసిన కేంద్రం ఒక పార్టమెంటరీ స్టాండింగ్ కమిటీని క్షేత్రస్థాయి పరిశీలనకోసం పోలవరానికి పంపుతోంది. 

ఆగస్టు 18న ఈ కమిటీ పోలవరాన్ని సందర్శించి ప్రాజెక్ట్ పనులను విచారిస్తుంది. దాంతోపాటే కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిఈఓ అయిన అమర్జీత్ సింగ్ కూడా స్వయంగా క్షేత్రస్థాయి తనిఖీ, ఇంకా అధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆగస్టు 24నే వీరి విచారణ కూడా ఉంటుంది. కనుక అప్పటిదాకా పోలవరానికి కేంద్రం నుంచి నిధులైతే వచ్చే అవకాశమే లేదు. స్వార్థ పూరితమైన చంద్రబాబు సర్కార్ వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు కలిగే అనార్థాలకు ఇదో ఉదాహరణ మాత్రమే. 
ఈమధ్యనే సెంట్రల్ నుండి నీతీ ఆయోగ్ కూడా బాబు ప్రభుత్వాన్ని గోడకుర్చీ వేయించి మరీ మొట్టికాయలు వేసింది. వెనుకబడ్డ జిల్లాలను అభివృద్ధి చేసేందుకు ఇచ్చిన నిధులను ఎందుకు పూర్తి స్థాయిలో వినియోగించలేదని నిలదీసింది. ఇంతవరకూ ఇచ్చిన నిధుల వ్యయానికి సంబంధించిన బిల్లులు కూడా తప్పుల తడకలే అని తేల్చి చెప్పింది. ముందు ఒకలా, తరువాత మరోలా పంపిన ఈ బిల్లులను చూస్తే ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తున్నట్టు అర్థమైందని, సరైన వివరాలతో నిధుల వినియోగ పత్రాలు పంపమని ఆదేశించింది. రాష్ట్ర విభజన సమయంలో వెనుకబడ్డ జిల్లాల కోసం 23వేలకోట్లు ప్రత్యేక ప్యాకేజీ కావాలని రాష్ట్ర ప్రణాళికా శాఖ కేంద్రాన్ని కోరింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోయినా కనీసం ఈ మెత్తాన్ని సాధించడంలోనూ చంద్రబాబు విఫలం అయ్యారు. ఏటా జిల్లాకు 50 కోట్ల చొప్పున వస్తున్న నిధులను కూడా ఆయా జిల్లాల మౌలిక సదుపాయాలకు వెచ్చించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 

ఇవన్నీ పరిశీలించి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్రానికి సదభిప్రాయం లేదని, టిడిపి సర్కారు అవినీతిని కేంద్రంలో ఉన్నబిజెపి ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని అర్థం చేసుకోవచ్చు.  ఏదేమైనా కేంద్రం దృష్టిలో ఎపి ప్రభుత్వం ఒక అవినీతి తిమింగలమని రూఢీ అయిపోయింది. ఓటుకు నోటు కేసులతో చంద్రబాబు పిలక ఎలాగూ మోడీ చేతుల్లో ఉంది. ఇక నిధుల విషయంలో కేంద్రాన్ని గట్టిగా అడిగేందుకు ఈ అడ్డగోలు వ్యవహారాలు అడ్డంగా ఉంటాయి. తన అవినీతి బాగోతాలు కప్పి పెట్టుకోవడానికి, ఇలా రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టి, తెలుగు ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారు బాబుగారు. 

ఈ సందర్భంలో సామాన్యుడు గుర్తు చేసుకునే విషయం ఒకటుంటుంది. వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ గల్లీలో అడుగు పెట్టకుండా, తెలుగు నేలపై నిలబడే రాష్ట్రానికి అవసరమైన నిధులను ఒక్క ఫోన్ కాల్ తో సాధించేవారని. నీతి, నిజాయితీలతో ప్రజల పక్షాన నిలిచిన నాయకుడికి ఎవరి ముందు తల వంచాల్సిన అవసరం లేదని వైయస్సార్ నిరూపించారు. ప్రజలకోసం అవసరం అయితే (అప్పటికి ఉన్నది తమ స్వంత పార్టీ ఆయినా సరే) కేంద్రాన్ని నిలదీయడానికైనా వెనుదీయని ధీశాలి వైయస్సార్ అని తెలుగువారంతా ఆయన్ను తలుచుకుంటారు. అలాంటి నాయకత్వం మరోసారి తెలుగు గడ్డకు కావాల్సిన సమయం వచ్చిందని గ్రహిస్తారు. 

తాజా వీడియోలు

Back to Top