సీమలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి

– ప్రచారంలో దూసుకెళ్తున్న వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు
– అడ్డదారుల్లో అధికార పార్టీ నేతలు

శాసన మండలి ఎన్నికల నోటీఫికేషన్‌ జారీ కావడంతో ఇన్నాళ్లు స్తబ్ధంగా ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వచ్చే నెల 9న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్‌ జరగనుంది. దీంతో పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు వారి మద్దతు దారులు ప్రచారాన్ని ఉధృతం చే శారు. పశ్చిమ రాయలసీమ(అనంతపురం, కర్నూలు,  వైయస్‌ఆర్‌ జిల్లాలు) పట్ట భద్రుల నియోజకవర్గం నుంచి పలువురు బరిలో నిలిచారు. అయితే ప్రధాన పోటీ మాత్రం  వైయస్‌ఆర్‌ సీపీ తరపున పోటీ చేస్తున్న  మాజీ ఎన్జీఓ అధ్యక్షులు వెన్న పూస వేణుగోపాల్‌ రెడ్డి, టీడీపీ అభ్యర్థి జీకే రెడ్డి, వామపక్షాల తరుపున నిలుచున్న  గేయానంద్‌ల మధ్య ఉంది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన వేణుగోపాల్‌ రెడ్డి ఇప్పటికే తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ మూడు జిల్లాల్లో ఆయన కలియ తిరుగుతూ పట్టభద్రులను కలుస్తున్నారు. ఈయనకు పార్టీ నేతలు అండగా నిలిచి ప్రచారంలో భాగస్వాములవుతున్నారు. వేణుగోపాల్‌రెడ్డి తరుపున ఆయన కుమారుడు, జడ్‌పీ ఫ్లోర్‌ లీడర్‌ రవీంద్రారెడ్డి, పలువురు వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు అనంతపురం జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో వేణుగోపాల్‌రెడ్డి రెండు రోజులు పర్యటించారు. నేటి నుంచి వైయస్‌ఆర్‌ జిల్లాలో ఆయన ప్రచారం మొదలుపెట్టారు. ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా  డాక్టర్‌ కేవీ సుబ్బారెడ్డి బరిలో నిలిచారు. ఉపాధ్యాయ సమస్యలపై వైయస్‌ఆర్‌ టీచర్స్‌ యూనియన్‌ పోరాటం చేస్తుండటం, చట్ట సభల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గళం విప్పడంతో ఈ సారి వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థిని గెలిపించాలని ఉపాధ్యాయులు భావించడంతో కేవీ సుబ్బారెడ్డికే విజయావకాశాలు మెండుగా ఉన్నాయి.
  
ప్రలోభాలకు తెర
శాసన మండలి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశ్యంతో టీడీపీ నేతలు ప్రలోభాలకు తెర లేపారు. టీడీపీ అభ్యర్థి జీకే రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇప్పటికే ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. టీడీపీ శ్రేణులను రంగంలోకి దింపి మద్యం, డబ్బులు ఎర చూపుతున్నారు. అంతేకాకుండా మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి కళాశాలల యాజమాన్యాలను బెదిరింపులకు గురి చేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినా కర్నూలు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డిలు అధికారిక కార్యక్రమాలు నిర్వహించి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఇళ్లు, స్థలాలు ఇస్తామని హామీలు గుప్పిస్తున్నారు.  మరి కొద్ది రోజుల్లో స్థానిక సంస్థల నుంచి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలుబడనుంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు భారీగా నీరు–చెట్టు పథకం కింద నిధులు ఇచ్చి ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకునే అనైతిక చర్యలకు టీడీపీ పాల్పడుతోంది. ప్రభుత్వం తీవ్రస్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఈ నెల 8న సచివాలయంలో ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. 

Back to Top