చింత‌మ‌నేనా..మజాకానా..!


ఏలూరు) ప్ర‌భుత్వ విప్‌, చంద్ర‌బాబు నాయుడు ముఖ్య అనుచ‌రుడు చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ఈ సారి పోలీసుల‌కు త‌న సత్తా చూపించారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల్ని దూషించి భ‌య‌పెట్ట‌డంలో త‌న రికార్డుల్ని తానే తిర‌గ రాసుకొనే చింత‌మ‌నేని జిల్లా కేంద్రంలో చెల‌రేగిపోయారు. 
ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఇద్ద‌రు మంత్రులు ఉన్న‌ప్ప‌టికీ జిల్లా యంత్రాంగం మీద వారి ప‌ట్టు త‌క్కువే. అయితే దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని పేరు చెబితే మాత్రం హ‌డ‌ల్‌. గ‌తంలోనే అనేక‌సార్లు ప్ర‌భుత్వ ఉద్యోగుల మీద దాడుల‌కు పాల్ప‌డిన చింత‌మ‌నేని.. మ‌హిళా త‌హ‌శీల్దార్ వ‌న‌జాక్షి ని ఇసుక‌లో ఈడ్పించి దాడి చేసిన ఘ‌ట‌న‌తో రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించారు. ఈ గొడ‌వ‌లో చింత‌మ‌నేని స్వ‌యంగా చంద్ర‌బాబు వెనుకేసుకొని రావ‌ట‌మే కాకుండా సీఎం క్యాంపు కార్యాల‌యంలో సెటిల్ మెంట్ చేయించారు. దీంతో చింత‌మ‌నేని కి సీఎం స‌పోర్ట్ పూర్తిగా ఉంద‌ని ప్ర‌భుత్వ యంత్రాంగానికి పూర్తిగా అర్థం అయింది. అప్ప‌టి నుంచి చింత‌మ‌నేని జోలికి రావ‌ట‌మే మానుకొన్నారు. త‌ర్వాత కాలంలో త‌న పొలాల్లోకి దారి కోసం అట‌వీ అధికారుల్ని త‌రిమి త‌రిమి కొట్ట‌డంతో ఆయ‌న‌కు ఎదురే లేకుండా పోయింది. 
తాజాగా అమ్మాయిల్ని ఎర వేసి ల‌క్ష‌ల రూపాయిల్ని వ‌సూలు చేస్తున్న ముఠాను ఏలూరు త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ ముఠాలో ఓ న్యాయవాది, మరో మహిళ నిందితురాలిని రక్షించేందుకు చింతమనేని స్వయంగా రంగంలోకి దిగారు. కేసునుంచి వారిద్దరిని తప్పించాలంటూ త్రీటౌన్ పోలీసులపై ఒత్తిళ్లకు పాల్పడ్డారు. పోలీసు అధికారుల మీద చింత‌మ‌నేని విరుచుకు ప‌డ‌టంతో వారంతా బెదిరిపోయారు. చింత‌మ‌నేనా..మ‌జాకానా.. అని నిందితులు హాయిగా ఊపిరి పీల్చుకొన్నారు. 

Back to Top