చంద్రబాబుని మించుతున్న యనమల నిర్వాకం

హైదరాబాద్: ఆదాయం మూరెడు ఉంటే , ఖర్చు బారెడు పెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతీ నెల జమా ఖర్చులు చూస్తే ఈ విషయం అర్థం అవుతోంది. ఒక వైపు ప్రజా సంక్షేమ పథకాలకు నిధులు లేవని చెబుతూనే మరోవైపు చంద్రబాబు దుబారా ఖర్చులకు కోట్లు ధార పోస్తున్నారు.

ఈ ఏడాది మొదటి త్రైమాసికం అంటే ఏప్రిల్, మే, జూన్ నెలలకు గాను దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు లోటు నమోదైంది. ఇది చూసిన తర్వాత ఏ నాయకుడైనా మేలు కోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాకలు తీరిన ఆర్థిక వేత్త. ఆర్థిక మంత్రి యనమల రామక్రష్ణుడు చట్ట సభల్లో అందరికీ నీతులు చెబుతూ గొప్పలు పోతూ ఉంటారు. మొదటి మూడు నెలల్లో భారీ స్థాయిలో లోటు తేలినప్పుడు తర్వాత త్రైమాసికంలో అయినా దిద్దుబాటు చర్యలు చేపట్టారా.. అంటే లేదనే చెప్పాలి. పైగా చంద్రబాబు కూడా ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలకు తిరిగి వస్తున్నారు. దీంతో రెండో త్రైమాసికంలో పన్నెండు వేల కోట్ల రూపాయిల లోటు తేలింది.

మొత్తంగా చూస్తే ఖర్చులు ఇప్పటి దాకా 48, 999 కోట్ల రూపాయిల మేర లెక్క తేలింది. ఇందులో కేవలం 23, 297 కోట్లకు మాత్రమే బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు ఇచ్చినట్లు సమాచారం. మిగిలినదంతా చంద్రబాబు షోకులకు ఎంత కావాలంటే అంత ధార పోస్తున్నారని తెలుస్తోంది. ఖర్చులకు కళ్లెం వేయాల్సిన ఆర్థికమంత్రి స్వయంగా మరింత దుబారాకు తెర దీయటంతో చంద్రబాబు కోటరీకి మూడు పువ్వులు, ఆరు కాయలుగా నడుస్తోంది. అంతిమంగా రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల కుప్ప మిగిలేట్లుగా ఉంది. చివరకు  మరోసారి వేజ్ అండ్ మీన్స్ కు వెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది.  
Back to Top