మంత్రి క‌న్నా మంత్రిగారి భార్య ప‌వ‌ర్ ఫుల్ అనుకోవాలా

మాట విన‌లేద‌ని 14 మంది ఉద్యోగుల‌పై బ‌దిలీ వేటు
హైద‌రాబాద్‌: మ‌ంత్రికే కాదు ఆయ‌న గారి భార్య‌కు కోప‌మొచ్చినా సిబ్బందికి శంక‌ర‌గిరిమ‌న్యాలు త‌ప్ప‌వు. గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట ఏరియా ఆస్ప‌త్రి సిబ్బందికి ఇదే గ‌తి ప‌ట్టింది. ఆస్ప‌త్రి సిబ్బంది త‌న మాట విన‌లేద‌ని, త‌న‌కు స‌రైన ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌ని, త‌న‌ను ప‌దేప‌దే క‌ల‌వ‌డం లేద‌ని గుంటూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి భార్య‌కు కోప‌మొచ్చింది. ప‌ట్టుబ‌ట్టి అంద‌రినీ బ‌దిలీ చేయించార‌ని బాధిత సిబ్బంది ల‌బోదిబో మంటున్నారు. త‌న మాట విన‌ని సిబ్బంది ఇక్క‌డ ఒక్క‌రు కూడా ఉండ‌టానికి వీల్లేద‌ని భ‌ర్త‌తో ఆమె తేగేసి చెప్పిన‌ట్లు స‌మాచారం. వైద్య విధాన ప‌రిష‌త్ క‌మిష‌న‌ర్‌ను సైతం అతిథిగృహానికి పిలిపించుకుని సిబ్బందిని ఇక్క‌డి నుంచి త‌క్ష‌ణ‌మే బ‌దిలీ చేయాల‌ని ఆదేశించిన‌ట్లు తెలిసింది. భార్య మాట‌ను కాద‌న‌లేని ఆ మంత్రి వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి కామినేని శ్రీ‌నివాస్‌ను క‌లిసి విష‌యం చెప్పార‌ట‌. ఆయ‌న విధిలేని ప‌రిస్థితిలో ఇందుకు ఒప్పుకోవాల్సి వ‌చ్చింద‌ని స‌మాచారం. ఆ వెంట‌నే ఏకంగా 14 మందిపై ప‌రిపాల‌నా కార‌ణాల‌తో బ‌దిలీ వేటు వేశారు. ఒక డెంట‌ల్ డాక్ట‌ర్‌ను కంభంకు, మ‌రో ప్ర‌సూతి వైద్యురాలిని మాచ‌ర్ల‌కు, ఇద్ద‌రు న‌ర్సుల‌ను కందుకూరుకు, మ‌రో ఇద్ద‌రు న‌ర్సుల‌ను మార్కాపురం ప్రాంతాల‌కు బ‌దిలీ చేశారు. మ‌రో వైద్యుడు అదే జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్య నాయ‌కుడిని ఆశ్ర‌యించి బ‌దిలీ వేటు నుంచి త‌ప్పించుకున్నారు. బ‌దిలీ అయిన సిబ్బంది ఎన్జీవో నేత‌ల‌ను క‌లిసి త‌మ బాధ చెప్పుకున్నా ఫ‌లితం లేక‌పోయింది. ఏకంగా అంత మందిని బ‌దిలీ చేసి వారి స్థానంలో ఎవ‌రినీ నియ‌మించ‌క‌పోవ‌డంతో రోగులు తీవ్ర ఇబ్బంది ప‌డుతున్నారు. మంత్రి భార్య‌కు కోప‌మొస్తే మ‌రీ ఇంత దారుణ‌మా అంటూ వైద్య ఆరోగ్య శాఖ‌లోని ఇత‌ర ఉద్యోగులు నోరెళ్ల‌బెడుతున్నారు. 

తాజా వీడియోలు

Back to Top