క్యాపిటల్ కోటరీ

రాజధాని భూ సేకరణ లో ఇద్దరు కీలకం
ఆ ఇద్దరిదే హంగామా
ఊరూరా పర్యటనలతో బిజీ బిజీ
 
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం మీద కసరత్తు శర వేగంగా జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనసంతా ఇక్కడే ఉండటంతో దీన్ని వేగంగా ముందుకు తీసుకొని వెళ్లేందుకు ప్రభుత్వ యంత్రాంగం నానా కష్టాలు పడుతోంది. దాన్ని భుజాల మీద వేసుకొని ఇద్దరు మంత్రులు రాత్రి పగలు కష్ట పడుతున్నారు. ఒకరు వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు కాగా మరొకరు మునిసిపల్ మంత్రి నారాయణ. ఈ ఇద్దరే మొత్తం బాధ్యతను చేజిక్కించుకొని హవా నడుపుతున్నారు. వాస్తవానికి ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో రెవిన్యూ, పోలీసు యంత్రాంగానికి బాధ్యతలు ఉంటాయి. కానీ ఈ రెండు శాఖల మంత్రులకు నిమిత్తం లేకుండా రాజధాని ఏర్పాటు ప్రణాళిక రూపం దాలుస్తోంది. ఈ రెండు శాఖల మంత్రులు కేఈ, చినరాజప్ప పార్టీలో ప్రారంభం నుంచి ఉండి ప్రస్తుతం చంద్రబాబు వర్గం కావటంతో పవర్ దక్కటం లేదన్న మాట వినిపిస్తోంది.  నారాయణ, పత్తిపాటి పుల్లారావు లు చినబాబు కోటరీ కావటంతో హవా నడిపిస్తున్నారన్న గుసగుసలు ఉన్నాయి. 
 
రెవిన్యూ ఏం చేస్తున్నట్లు..!
వాస్తవానికి ఒక ప్రాంతంలో కొత్త ప్రాతిపదిక ఏర్పాటు చేయాలంటే దానికి రెవిన్యూ శాఖ పూనుకోవాలి. అంటే అక్కడ ప్రస్తుతం ఉన్న భూమి ఏమిటి, ఏ విధమైన భూములు అందుబాటులో ఉన్నాయి, అవి ఎవరి పరిధిలో ఉన్నాయి, ప్రభుత్వ భూములా, ప్రైవేటు భూములా, లేక ధర్మ సంస్థల భూములా అన్నది రెవిన్యూ శాఖ రికార్డులో ఉంటాయి. తర్వాత అక్కడ ఏర్పాటు చేయబోయే ప్రాతిపదిక అవసరాల ఏమిటి, వాటికి ప్రభుత్వం నుంచి ఎటువంటి మళ్లింపులు జరగాలి అన్నది కూడా రెవిన్యూ శాఖే చూస్తుంది. అందుకే ప్రభుత్వంలో రెవిన్యూ శాఖకు అంతటి ప్రాధాన్యం. అలాగే ప్రభుత్వ యంత్రాంగంలో కూడా రెవిన్యూ అధికారులదే హవా. పైగా ఇప్పుడు అక్కడ 30 మందికి పైగా డిప్యూటీ కలెక్టర్లు, 60 మందికి పైగా తహసీల్దార్లు ఉన్నారు. వీరికి తోడు వందలాది సర్వేయర్లు పనిచేస్తున్నారు. 
ఇప్పుడు రాజధాని ఏర్పాటు అన్నది పూర్తిగా భూముల హడావుడితో నడుస్తోంది. తర్వాత కాలంలో పరిపాలనకు గుండెకాయ మాదిరి దాన్ని తీర్చిదిద్దాలి. అటువంటప్పుడు అంతా రెవిన్యూ మంత్రి దగ్గర ఉండి పర్యవేక్షిస్తారు అనుకొంటారు. పైగా ప్రస్తుత రెవిన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి మంత్రి మండలిలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. అందుచేత భూముల సమీకరణలో కానీ, పట్టాలు ఇవ్వటంలో కానీ ఆయన పాత్ర ఉండాలి. అక్కడ విభిన్న శాఖలతో సమన్వయం చేస్తూ పనులు చేపట్టే బాధ్యత ఆయనకు దగ్గరగా ఉండాలి. కానీ వాస్తవంలో ఆయన ప్రమేయం ఏమాత్రం కనపడటం లేదు. రాజధాని ప్రణాళిక కు సంబంధించి కానీ, అక్కడ భూముల సమీకరణ కు సంబంధించి కానీ, యంత్రాంగం ఏర్పాటు విషయంలో కానీ ఆయన పాత్ర కనిపించదు. మొక్కుబడిగా ఫైల్సు వస్తే పరిష్కరించి పంపించటం మాత్రమే జరుగుతోంది. 
 
పోలీసు మంత్రి పాత్ర ఎంత..!
ఇక రాజధాని అంటే శాంతి భద్రతల పరంగా చాలా కీలకం. అంతే గాకుండా అక్కడ కొత్తగా రాజధాని ఏర్పాటు చేస్తున్నారు అంటే శాంతి భద్రతల సమస్యలు ఏమిటి, తరవాత కాలంలో తలెత్తే సమస్యలు ఏమిటి అన్నది చూడనే చూడాలి. అక్కడ ఏర్పాటు చేయబోయే కమిషనరేట్ లో ఎటువంటి వ్యవస్థ ఉండాలి అన్న ది  చూసుకోవాలి. ఇందుకు అనుగుణంగా రాజధాని ఏర్పాటులో నేరుగా కాకపోయినా, పరోక్షంగా పోలీసు శాఖ ప్రమేయం అవసరం అవుతుంది. ఇప్పుడు ఈ రాజధాని ప్రాంతంలో యూనిఫామ్ లో పోలీసుల సంఖ్య లో కన్నా మఫ్టీలో ఉండే పోలీసులు బాగా కనిపిస్తారు. అక్కడ నుంచి ఎప్పటికప్పుడు పోలీసు మార్కు సమాచారం, రైతుల్ని కంగారు పెట్టించటం, నాయకులు, అధికారుల దండుతో పాటు తరలి రావటంలో పోలీసులు భారీగా కనిపిస్తున్నారన్న మాట ఉంది. 
ఈ పోలీసు శాఖ ను చూస్తున్న నిమ్మకాయల చిన రాజప్ప కూడా మంత్రి మండలి లో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. పోలీసు శాఖ ఆయన చెప్పు చేతల్లో ఉంటుంది కాబట్టి రాజధాని ఏర్పాటు, కమిషనరేట్ వ్యవస్థీకరణలో ఆయన హడావుడి బాగా కనిపించాలి. కానీ అటువంటి వాసనలు ఏమాత్రం కనిపించవు. అప్పుడప్పుడు అక్కడ వ్యవస్థ గురించి ప్రకటనలు ఇవ్వటం తప్ప ఆ ఛాయల్లో ఆయన పెద్దగా కనిపించరు.
 
నాణేనికి రెండో వైపు
పస్తుతం జరుగుతున్న రాజధాని హడావుడిలో అవసరానికి మించి హడావుడి చేస్తున్నది మాత్రం ఇద్దరంటే ఇద్దరు మంత్రులు. వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, గుంటూరు జిల్లాకు చెందిన వారన్న కారణంతో ఆయన చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అటు మునిసిపల్ మంత్రి నారాయణ, రాజధాని సాధికారిక సంస్థ కు ఉపాధ్యక్షుని హోదాలో హడావుడి చేస్తున్నారు. అంతకు మించి కోటరీ బలంతో ఆ ఇద్దరు మంత్రులు అన్నీ దగ్గరుండి నడిపిస్తున్నారన్న మాట ఉంది. ఏ ముహుర్తాన రాజధాని ప్రాంతాన్ని ప్రకటించారో కానీ ఈ ఇద్దరి మంత్రులు చొరవ తీసేసుకొన్నారు. ఇక్కడ గ్రామాల్ని గుర్తించటం, అక్కడ భూముల్ని రాబట్టాలంటే ఏమి చేయాలి, పరిహారం విషయంలో తర్జన భర్జనలు, మిగిలిన రైతుల నుంచి భూములు రాబట్టడం..ఇలా ఒకటేమిటి, అన్ని పనుల్లో అన్నీ తామైనట్లు వ్యవహరిస్తున్నారు.

వ్యవసాయ మంత్రి ఏమి చేయాలి..!
ఒక రాష్ట్రానికి వ్యవసాయ మంత్రి అంటే మొత్తం వ్యవసాయ రంగానికి ప్రతినిధి అనుకోవాలి. ముఖ్యంగా భారత్ వంటి వ్యవసాయ ఆధారిత దేశాల్లో వ్యవసాయ శాఖను సాంప్రదాయ ప్రాధాన్యం గల శాఖగా చూస్తారు. గతంలో ఈ శాఖను నిర్వహించిన వడ్డే శోభనాద్రీశ్వర్ రావు వంటి వారు మంత్రి మండలి లో రైతుల ప్రతినిధిలా వ్యవహరించేవారు. ఒక వేళ ప్రభుత్వం ఏమైనా రైతులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకొంటుంటే వారించి, వాదించి తమ శాఖ తరపున రైతుల తరపున వాదన వినిపించేవారు. కానీ, ఇప్పుడు పూర్తి విరుధ్ధం. స్వయంగా వ్యవసాయ మంత్రే రైతుల నుంచి భూములు  లాక్కొంటున్నారు. వ్యవసాయానికి పాతర వేసే పనిలో పూర్తిగా నిమగ్నం అయిపోతున్నారు. ఈ రబీ సీజన్ మొదలు నుంచి చివరి దాకా రైతుల గురించి పట్టించుకొన్న పాపాన పోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగాన్ని అటు నుంచి అటే గాలికి వదిలేశారు. పొద్దుట లేచిన దగ్గర నుంచి రాజధాని ప్రాంతంలో రైతుల నోళ్లు నొక్కటం, భూములు లాక్కోవటం మీదనే దృష్టి పెట్టారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వ్యవసాయ మంత్రే స్వయంగా భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అప్పగిస్తుంటే ఇక వ్యవసాయానికి, ఆహార భద్రతకు దిక్కేమిటన్న ప్రశ్న వినిపిస్తోంది.
 
మునిసిపాలిటీ ఎక్కడ ఉంది..!
రాజధాని ఏర్పాటు అయి, అక్కడ జ నాభా లక్షల సంఖ్యలో వచ్చి పడినప్పుడు కదా, దాన్ని పురపాలక సంఘం గానో, నగర పాలక సంఘం గానో ప్రకటించేది. అప్పుడు కదా, మునిసిపల్ సిబ్బందికి కానీ, మునిసిపల్ మంత్రికి కానీ పని ఉండేది. అసలు అక్కడకు ఎంత మంది వస్తారో, ఎన్ని కుటుంబాలు తరలుతాయో తెలీదు. ఉద్యోగులు వచ్చినా కుటుంబ సమేతంగా తరలుతారా లేక చుట్టుపక్కల నగరాల్లో ఉంటారో తెలీదు. మరి అటువంటప్పుడు ఈ మునిసిపల్ మంత్రి నారాయణ గారి ప్రమేయం అర్థం కాదు. ఒక వేళ రాజధాని సాధికారిక సంస్థ కు ఉపాధ్యక్షుని హోదా ను చూద్దాం. ఇది మునిసిపల్ మంత్రిగారి అదనపు బాధ్యత. మరి ఈ సంగతి ఎందుకు గాలికి వదిలేస్తున్నారు.
 
ఒక వైపు ఎండలు మండిపోతున్నాయి. చాలా పట్టణాల్లో, నగరాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. మరి కావలసిన జల వనరుల్ని అన్వేషించి నీటి సరఫరా బాధ్యత ఉండదా..! జన సమ్మర్థం గల ప్రాతిపదికలు జరుగుతున్నాయి. పారిశుధ్యాన్ని సమీక్షించాల్సిన అవసరం లేదా..! వర్షాకాలం వచ్చే లోగా రోడ్లను బాగు చేయించటం, నాలాల్ని మరమ్మతులు చేయించటం వంటివి చేయించాలి. ఈ పనులన్నీ గాలికి వదిలేసినట్లే కదా..! 13 జిల్లాల్లోని పట్టణ ప్రజల కనీస అవసరాలు తీర్చాల్సిన మంత్రి.. ఈ పనుల్ని పూర్తిగా పక్కకు పెట్టేసి రాజధాని ప్రాంతంలో చివరి ఎకరాను కూడా లాక్కొనే దాకా అక్కడ నుంచి కదలను అని చెప్పి తిష్ట వేసుకొని కూర్చొంటే ఇదే మి ప్రజాస్వామ్యం అన్న మాట వినిపిస్తోంది. 
 
కోర్ టీమ్ కనుసన్నల్లో..!
రాజధాని పనులు పూర్తిగా చినబాబు కోటరీ కనుసన్నల్లో జరగాలి అని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగానే ఈ ఇద్దరు మంత్రులకు బాధ్యతలు అప్పగించారన్న మాట వినిపిస్తోంది. ఇతర శాఖల మంత్రులకు పెద్ద గా ప్రమేయం కల్పించకుండా అన్నీ తామై ఈ పనుల్ని నడిపిస్తున్నట్లుగా భావిస్తున్నారు. కోర్ టీమ్ కనుసన్నలో వ్యవస్థను ఉంచేందుకు ఇప్పటినుంచి ఈ రకంగా ప్రాతిపదికలు వేసుకొన్నట్లుగా భావిస్తున్నారు.
Back to Top