సభలు ముగిసాయి..సమస్యలు మిగిలాయి

  • జన్మభూమి ధరఖాస్తులు బుట్టదాఖలు
  • పేదలకు అందని సంక్షేమ ఫలాలు
  • వైయస్ఆర్ హయాంలో అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
  • ప్రస్తుత పాలనలో పచ్చచొక్కాలకే పథకాలు 
  • టీడీపీ పాలనపై మండిపడుతున్న ప్రజలు
గురజాల: తెలుగుదేశం పార్టీ చేపట్టిన నాల్గొవ విడత జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో సమస్యలు పరిష్కారమవుతాయని ఎంతో ఆశగా ఎదురుచూసిన వారికి చివరికి నిరాశే మిగిలింది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్గోని గ్రామాల్లో జనవరి 2వ తేది నుండి 11వ తేది వరకు నిర్వహించిన గ్రామసభల్లో భారీగా ధరఖాస్తులు అధికారులకు అందించారు. గత మూడు దఫాలుగా జరిగిన జన్మభూమిలో సైతం ఎంతోమంది ధరఖాస్తులు చేసుకున్నప్పటికి సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈ జన్మభూమిలో సైతం ధరఖాస్తులు అందించారు. ఇళ్లు, రేషన్‌కార్డులు మంజూరు చేయాలని పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు పెద్ద ఎత్తున గత జన్మభూమిలో ధరఖాస్తు చేసుకున్నారు. గతంలో జరిగిన  గ్రామసభల్లో ధరఖాస్తులు  చేసుకున్నామని అవి అన్నీ బుట్టదాఖలు కావడంతో నిరుత్సాహపడ్డారు. తాజాగా మరల జన్మభూమి–మా ఊరు చేపట్టడంతో ఈసారైనా మోక్షం కలుగుతుందనే నమ్మకంతో ధర ఖాస్తులు అందించినట్లు పలువురు వాపోతున్నారు. 

సొంతింటి కోసం ఎదురుచూపులు...
పేదవాడి సొంతింటి కల...కలగానే మిగిలిపోతుంది. దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి హాయాంలో ఇందిరమ్మ ఇళ్లు పథకంలో భాగంగా అర్హులందరికీ  పార్టీలకతీతంగా ఇళ్లు మంజూరు చేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత తీరుమారింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుండి ఒక్క ఇంటి నిర్మాణానికి మంజూరు చేయలేదు. ఎంతో మంది పేదలు సొంతింటి నిర్మాణం కోసం ఎదురుచూస్తునే ఉన్నారు.గత ప్రభుత్వం మంజూరు చేసిన లబ్దిదారులకు ఒక్క బిల్లు కూడా చెల్లించలేదు.  నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 1847 మంది  పెండింగ్‌ బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయక ఇంటి నిర్మాణం మధ్యలో నిలిచిపోయి సొంతింటి కల కలగానే మిగులుతుందని వాపోతున్నారు. నియోజకవర్గానికి 1250 ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పధకం అంటూ మంజూరు చేశారు. కానీ ఇప్పటికి కేవలం 111 మంది మాత్రమే లబ్దిదారులు  ఇంటి నిర్మాణ పనులు చేపట్టినట్లు అదికారులు వెల్లడించారు. జన్మభూమి కమిటీ సభ్యులంటూ రాజ్యాంగం , ఇటు అధికారానికి సంబంధం లేని వ్యక్తులకు  లబ్ధిదారుల ఎంపిక బాధ్యత అప్పగించింది. ఇక మంజూరు చేసిన ఇళ్లకు ఉపాధి నిధులు లింకు పెట్టి ఇటుకలు మహిళా సంఘాల సభ్యులు తయారుచేసి లబ్దిదారులకు అమ్ముతారంటూ అర్ధంకాని  పద్ధతిని తయారుచేసి అధికారులను సైతం గందరగోళ పరిస్దితుల్లోకి తీసుకెళ్తున్నారు.   

పింఛన్ల కోసం పడిగాపులు
పింఛన్ల కోసం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పడిగాపులు పడుతున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో అత్యధికంగా పింఛన్‌ కోసం దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలుపుతున్నారు. గత జన్మభూమిలో ధరఖాస్తు చేసుకున్నవారికి ఇప్పటికీ మంజూరు కాలేదు. ఆధార్‌ నెంబర్‌ సరిలేదంటూ, రేషన్‌ కార్డులో వయస్సు సరిగా పడాలేదంటూ సవాలక్ష కారణాలతో పించన్లు నిలుపుదల చేశారు. నియోజకవర్గంలో ఇప్పటికి సుమారుగా 2వేలకు పైగా ధరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. మూడొవ విడత జన్మభూమిలో ధరఖాస్తు చేసుకున్న వారు మంజూరు కాకపోవడంతో ఈ సారీ మళ్లీ ధరఖాస్తు చేసుకున్నారు. పాత వారితో పాటుగా కొత్త వారి సంఖ్య ఎక్కువైంది. నియోజకవర్గానికి 2వేల పింఛన్లు కేటాయించినట్లు చెబుతున్నారు. నాలుగు మండలాల్లో అత్యధికంగా ధరఖాస్తు చేసుకున్న వారి సంఖ్యను బట్టి నూతన పింఛన్లు కేటాయించాలని పలువురు కోరుతున్నారు.

తప్పుల తడకగా రేషన్‌కార్డులు ..
దారిధ్య్ర రేఖ దిగువన ఉన్న వారికి రేషన్‌కార్డుల మంజూరు ప్రక్రియను ప్రసహనంగా మారింది.  అర్హత ఉన్నప్పటికి రేషన్‌కార్డు కోసం ధరఖాస్తు చేసుకున్న వారికి మొండిచెయ్యి ఎదురవుతుంది. రేషన్‌ కార్డులు ప్రస్తుతం అర్హత ఉన్న వారికి కాకుండా అర్హత లేని వారికి అధికంగా మంజూరైనట్లు గుసగుసలు వినవస్తున్నాయి. నాల్గొవ విడత జన్మభూమి కార్యక్రమంలో ఇచ్చిన రేషన్‌ కార్డుల్లో వందలో 80 శాతంకు పైగా తప్పుల తడకగా ఉన్నాయి. ఫోటోలు ఉంటే పేర్లు తప్పు..పేర్లు ఉంటే ఫోటోలు మార్పు ఇలా ఒకటి రెండు కాదు 80శాతంకు పైగా తప్పులే.

పచ్చ చొక్కాలకే ప్రభుత్వ పథకాలు...(మేకల శేషిరెడ్డి, అంజనాపురం)
పచ్చ చొక్కా నాయకులకే ప్రభుత్వ పథకాలు మంజూరు జరుగుతున్నాయి. అర్హత ఉన్న ఎంతో మంది లబ్ది పొందేందుకు ఎదురుచూస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీలను ఏర్పాటుచేసి ఎంతో మంది అర్హులకు దక్కకుండా అడ్డుపడుతున్నాయి. వైయస్ఆర్ హయాంలో  అర్హత ఉంటే చాలు పార్టీలకతీతంగా వారికి ప్రభుత్వ పథకం అందేవిధంగా చూశారు.  కానీ ప్రస్తుతం అలా లేదు. కేవలం టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రమే లబ్దిపొందుతున్నారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి అర్హులను గుర్తించాలి. 
Back to Top