మహానేతపై దృశ్య కావ్యం

అభిమాని నీరాజనం

అభిమానాన్ని చాటుకునే విధానాలు ఎన్నో ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిపై తనకున్న ప్రేమను విభిన్నంగా చాటుకున్నాడు. ఇందుకోసం అతడు దృశ్య మాధ్యమాన్ని ఎన్నుకున్నాడు. 20 నిమిషాల ఈ డాక్యుమెంటరీ తీయడానికి ఆయనెవరి వద్దా చేయి చాచలేదు. తనకున్న వనరులతోనే తలపెట్టిన కార్యాన్ని పూర్తిచేశాడు.

ఖమ్మం: ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాతలింగాల గ్రామానికి చెందిన కడవెండి వేణుగోపాల్ మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డికి వీరాభిమాని. 15సార్లు ఆయనను కలిశారు. ఆ మహామహుని చిరునవ్వు, ఆప్యాయత తనను కట్టిపడేశాయని వేణుగోపాల్ చెప్పారు. 2009 సెప్టెంబర్ 2న డాక్టర్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ దుర్ఘటనలో ఈ లోకాన్ని వీడిన ఉదంతంపై ఓ లఘు చిత్రాన్ని నిర్మించారు.

‘ఆ చిరునవ్వు...ఆ దరహాసం...ఆ పంచెకట్టు...ఆ ఆత్మీయ ఆలింగనం...ఎన్నిసార్లు చూ సినా తీరని అభిమానం...ఆకలి, దప్పిక అన్నీ మరచి అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించేది...అలా ఒకటికాదు, రెండుకాదు ఏకంగా పదిహేనుసార్లు ఆయన్ను కలుసుకున్నా...ఆ ఆత్మీయ స్పర్శతో పులకించిపోయా...ఆ మహానుభావుడు లేడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా... మంచివాళ్లను ఆ దేవుడు తొందరగా తీసుకెళ్తాడు...వైఎస్‌ఆర్ మరణమే దీనికి నిదర్శనం’ అంటూ వేణుగోపాల్ ఈ కార్యానికి పూనుకున్నారు. 'కారణ జన్ముడు' పేరుతో తీసిన ఈ చిత్రంతో ఆయన మహానేతకు దృశ్య నీరాజనాన్ని సమర్పించారు. 

సెప్టెంబరు రెండు, 2009న రచ్చబండకు వెళ్తుండగా హెలికాప్టర్ ప్రమాదం...ఆ తర్వాత వైఎస్ ఆయన వెంట ఉన్న వారు స్వర్గమార్గంలో పయనం..దేవదూతతో సంభాషణ...‘అప్పుడెప్పుడో మదర్‌ థెరిసాను స్వర్గానికి తీసుకెళ్లేందుకు వచ్చాను...ఇప్పుడు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లే పనిపడిందని’ దేవ దూత చెప్పడం. ‘ఆంధ్రప్రదేశ్‌ను మించిన స్వర్గం లేదని’ వైఎస్‌ఆర్ దేవదూతకు సూచించడం...తదితర సన్నివేశాలతో 20 నిమిషాల నిడివితో వేణుగోపాల్ ‘కారణ జన్ముడు (జనం కోసం జననం) శీర్షికన లఘుచిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర రూపకల్పనకు రూ.6 లక్షల వరకు వెచ్చించినట్లు ఆయన తెలిపారు. వేణుగోపాల్ భార్య అరుణకుమారి నిర్మించిన ఈ చిత్రంలో స్వయంగా వేణుగోపాలే రాజశేఖరరెడ్డి పాత్రను పోషించారు. వెంకట్ దర్శకత్వం వహించారు. ఇందులో పాత్రలు పాత్రధారుల వివరాలిలా ఉన్నాయి. వైఎస్ వెంట ఉన్న ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యంగా కిషన్, ఐపీఎస్ అధికారి జాన్‌వెస్లీగా గుప్తా, పెలైట్ భాటియాగా సుభాని, కో పెలైట్ రెడ్డి పాత్రను జమీల్, దేవదూత పాత్రను ప్రవీణ్‌కుమార్ పోషించారు.

అంతర్జాతీయ లఘుచిత్ర ఉత్సవాలలో ప్రదర్శన

ఈ డాక్యుమెంటరీ చిత్రం ఇంటర్నేషనల్ షార్ట్‌ఫిలిం ఫెస్టివల్ అనుమతి పొందింది. వెండి తెరపై దీన్నిప్రదర్శించారు. ఈ అనుమతి లభించాక వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా హైదరాబాద్‌లో, ఖమ్మంలో రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ఈ డీవీడీని ఆవిష్కరించారు. ఖమ్మం, హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లో ఈ లఘుచిత్రాన్ని స్థానికి ఛానల్సులో ప్రదర్శించారు. ఎలాంటి వ్యాపార దృక్పథం లేకుండా కేవలం దివంగత నేతపై అభిమానంతో ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించి విడుదల చేసినట్లు రూపకర్త కడివెండి వేణుగోపాల్ తెలిపారు.

మహనీయుడు రాజశేఖరరెడ్డి: వేణుగోపాల్

రాజశేఖరరెడ్డిపై అభిమానంతో చిత్రాన్ని తీశానని వేణుగోపాల్ చెప్పారు. దీనికి సుమారు రూ.6 లక్షల వరకు ఖర్చయ్యాయి. నా భార్య అరుణకుమారి, మా అమ్మాయి సాయిపూజిత, మా అబ్బాయి శ్రీచక్రధర్ దాచిపెట్టుకున్న డబ్బులు, పిల్లల చదువుకోసం, ఇతర ఖర్చుల కోసం ఉంచిన సొమ్ముతో పాటు ఆ మహానుభావుడు వ్యవసాయ విద్యుత్ బిల్లులు మాఫీ చేయడంతో మిగిలిన రూ.12వేలు, నా పది ఎకరాల మామిడితోట మీద వచ్చిన డబ్బులు ఇలా ఒక్కోపైసా పోగుచేశానని తెలిపారు. చిత్ర నిర్మాణానికి ఎవరి తోడ్పాటును ఆశించలేదన్నారు.

 

Back to Top