మహానాడును తలపించిన మహిళా సదస్సు

  • బాబు భజనపరులతో నిండిన వేదిక
  • చర్చకు రాని మహిళా సమస్యలు
  • సెల్ఫ్ పబ్లిసిటీ కోసం రూ.14 కోట్లు వృథా
జాతీయ మహిళా పార్లమెంట్‌ పేరుతో టీడీపీ ప్రభుత్వం ఏపీలో నిర్వహించిన మూడు రోజుల కార్యక్రమం మహానాడును తలపించింది. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా అంతా బాబు పబ్లిసిటీ పిచ్చిని చూసి తిట్టిపోస్తున్నా ఆయనలో మాత్రం మార్పు రావడంలేదు. రూ. 14 కోట్లు ప్రజాధనాన్ని వెచ్చించి మూడు రోజులపాటు సొంత పబ్లిసిటీ కోసం చేసిన కార్యక్రమంలా సాగింది తప్ప మహిళలకు పిసిరంతైనా ఒరగబెట్టిందేమీ కనపడలేదు. మహిళా సాధికారత ముసుగేసుకుని వెంకయ్య కూతురు, బాబు గారి కోడలు, కేసీఆర్‌ కూతురు, రామోజీరావు కోడలు.. మరో నలుగురైగురు బిజినెస్‌ ఉమెన్స్‌ను పిలిపించుకుని చంకలు గుద్దుకున్నారు తప్పించి మహిళా సమస్యలేవీ చర్చకు రాలేదు. రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న కార్యక్రమం అని చెప్పుకుంటూనే ఉమెన్‌ పార్లమెంట్‌ను రాజకీయ వేదికగా మార్చారు. ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ని పిలిచారనుకుంటే రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు భార్య వైయస్‌ భారతిని ఆహ్వానించలేదే. రాజకీయాలకతీతంగా పిలిచారనుకుంటే సోనియాగాంధీని పిలిచినట్టు ఏ పత్రికా ప్రచురించలేదే. మహిళా సమస్యలపై చర్చించాలనే ఈ కార్యక్రమం నిర్వహించారని అనుకుందామంటే దేశవ్యాప్తంగా పేరున్న బృందాకారత్, మేధాపాట్కర్‌ వంటి సోషల్‌ యాక్టివిస్టుల పేరు ఎక్కడా వినపడలేదే. 

సాధికారత అంటే రోజాను అవమానించడమేనా
కార్యక్రమాలకు ఆహ్వానిస్తూ స్పీకర్‌ నుంచి సందేశాలు ఇచ్చి తీరా అక్కడకొచ్చిన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే రోజాను ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు. నిజాలను, మహిళా సమస్యలను ప్రస్తావించాలని దేశవ్యాప్తంగా ప్రముఖులను పిలిచి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో నిజం గొంతు నొక్కారు. స్పీకర్‌ నుంచే ఆహ్వానం పంపి కూడా ఆమెను ప్రాంగణంలో అడుగుపెట్టనీయకుండా చేశారు. ఆఖరుకి ఒక విద్యార్థిని ప్రభుత్వాన్ని నిలదీస్తే చంద్రబాబు సమాధానం చెప్పుకోలేక దాటవేయడం కూడా ప్రభుత్వంలో ఉన్న అసహనానికి నిదర్శనం. నిలదీసిన వారి గొంతు నొక్కాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు తప్పించి మంచి కార్యక్రమం చేయడానికి ప్రయత్నించకపోవడం బాధాకరం. ఏ చిన్న సందర్భం దొరికినా డబ్బా కొట్టుకోవడానికి అలవాటైన బాబుకు మహిళా పార్లమెంట్‌ మరో వేదికైందే తప్ప మహిళలకు సమస్యలుంటాయని.. వారు కూడా పురుషులతో సమానంగా హక్కులు కోరుకుంటున్నారని బాబుకు అనిపించలేదు. నిజమే.. వినిపించాలంటే మాట్లాడే గొంతు కావాలిగా. ఎక్కడికక్కడ నొక్కేస్తుంటే ఆయనకు వినే అవకాశం ఎక్కడుంది. గతంలో జరిగిన అమరావతి భూమి పూజకు ప్రతిపక్ష నాయకుడి హోదాలో వైయస్‌ జగన్‌ వెళ్లి ఉన్నా ఇలానే అవమానించేవారేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజం గొంతు నొక్కేసి అబద్ధాల ప్రపంచంలో పాలన సాగించే టీడీపీ నాయకులకు వారు చేసేది తప్పు కాకపోవచ్చుకానీ ప్రజల అభిప్రాయం మాత్రం అంతిమం. ఇలాంటి వాటిని ప్రజలెప్పుడూ హర్షించరనేది చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలి. 

లబ్ధప్రతిష్టుల్లో ఒకే ఒక్క తెలుగు వారు 
నాలుగు రోజుల పాటు 21 మంది లబ్ధప్రతిష్టులైన కళాకారులచే వివిధ సాహిత్య, నృత్య కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అయితే అందులో ఒక్కరంటే ఒక్కరే తెలుగువారు ఉండటం దారుణం. సాధారణంగా ఏదైనా రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు స్థానికంగా ఉండే కళాకారులకు అవకాశం ఎక్కువగా కల్పిస్తుంటారు. రాష్ట్రానికి సీఈవోగా పిలిపించుకునే చంద్రబాబు మాత్రం మన నేటివిటీ, సంస్కృతీ సాంప్రదాయాలకు మాత్రం విలువ ఇవ్వలేదు. ఆయనకు ఒకే ఒక్క ప్రముఖుడు కనిపించాడు కాబోలు. వచ్చిన వారంతా వారి వారి రంగాల్లో ప్రముఖులే అయి ఉండొచ్చు కాదనం. అయితే ఇక్కడ మన ఖర్చుతో జరిగే కార్యక్రమంలో మనవారి భాగస్వామ్యం లేకపోతే ఎలా. మన రాష్ట్ర గొప్పదంనం గురించి మనమే చెప్పుకోకపోతే ఎలా అనేదే ప్రశ్న. 

వ్యాపార వేత్తలకు పెద్దపీట 
ఈ సమావేశానికి పిలిచిన వక్తలందరూ కూడా వేలకోట్ల లావాదేవీలు నిర్వహించే సీఈఓలు, వ్యాపారవేత్తలు. అలాగే ప్రకృతి పొద్దార్‌నూ పిలిచారు. పేపరు మిల్లుల వ్యవస్థను దెబ్బతీసి రైతుల ఉపాధిని గండికొట్టిన వారిలో పొద్దార్‌ కంపెనీ కీలకంగా ఉంది. 3000 మంది కార్మికులను రోడ్డుపాల్జేశారనే విమర్శలున్నాయి. ఆమెను తీసుకొచ్చి ప్రసంగం ఇప్పించారు. అదే సమయంలో వేదికపై మాట్లాడిన వారందరూ వారి కుటుంబాల గురించి చెప్పుకున్నారే తప్ప సాధికారిత గురించి మాట్లాడిందేమీ లేదు. పైగా మహిళా సాధికారత అమరావతి వేదికగా కొత్త చరిత్రను సృషిస్తామంటూ నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంటులో  భాగంగా చివరిరోజు డిక్లరేషన్‌ ఉంటుందని అధికారయంత్రాంగం పదే పదే ప్రకటించింది. ఆ డిక్లరేషన్‌ ప్రకటనా వాయిదా పడింది. దీనిపై ప్రశ్నించిన విలేకరులకు ‘సదస్సులో వచ్చిన అన్ని అంశాలను క్రోడీకరించడానికి కొంత సమయం పడుతుందని, అందువల్ల కొన్ని రోజుల తరువాతే డిక్లరేషన్‌ ఉంటుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఎన్ని రోజులు పడుతుందన్న విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్ప లేదు. 

కాంట్రాక్టులన్నీ టీడీపీ వారికే 
వేదిక ఏర్పాటు మినహా మిగిలిన భోజన సదుపాయాలు, టిఫిన్లు వంటివన్నీ విజయవాడకు చెందిన టీడీపీ నాయకులకు కేటాయించారు. ఆ భోజనం తినేందుకు ప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో ఉన్న కళాశాలలు, మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థలన్నీటికీ విద్యార్థులను పంపించాలని ఆదేశాలు జారీచేశారు. వారి ఖర్చులు కూడా పెట్టుకోవాలని సూచించారు. విజయవాడ నగరంలో బస కల్పించాలనే పేరుతో పలు స్కూళ్లు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. బస్సులు పంపించాలని ఇంజనీరింగ్‌ కళాశాలలకు ఆదేశాలు జారీచేశారు. ఈ వ్యవహారాన్ని రవాణా శాఖ అధికారులకు అప్పగించారు. సామాజిక భద్రత కల్పించాలంటూనే దాని గురించి చెప్పేవారినెవరినీ సదస్సుకు ఆహ్వానించడకపోవడం లోటుగా కనిపించిందని పలువులు వక్తలు పేర్కొన్నారు. ఉచిత బస్సు సదుపాయం కల్పించామని చెప్పినప్పటికీ చాలా వరకూ ఆర్‌టీసీ బస్సుల్లో టిక్కెట్లు తీసుకున్నారు. మూడు రోజులపాటు జరిగిన గ్రూపు చర్చలు నిర్వహించిన తీరు హాస్యాస్పదంగా ఉంది. సదస్సు నిర్వహించిన హాలులో పెద్ద మైకు సిస్టం ఉండగా, మిగిలిన వారందరూ వాటి ముందే ఎక్కడివారక్కడ గ్రూపులుగా కూర్చున్నారు. అందులో ఎవరూ ఏం మాట్లాడుతున్నారో పక్కన వాళ్లకు వినిపించని విధంగా చర్చలు సాగాయి. చర్చల నిర్వహణకు ఒక ప్రొఫార్మా కూడా తయారు చేయలేదు. ప్రభుత్వం చెప్పింది చివరికి తీర్మానంగా చేసేశారు మినహా ప్రతినిధుల అభిప్రాయాలు ఎక్కడా సరైన విలువ ఇవ్వకుండానే కార్యక్రమాన్ని మమ అనిపించారు. శంకుస్థాపనలలాగే మహిళా పార్లమెంటేరియన్ సదస్సు కూడా బాబు ఆడంబరాలకు వేదికగా మిగిలించి జనం నెత్తిన మరో 14 కోట్ల భారం పడింది. 
Back to Top