మహానాడులో మాయలమరాఠీ


విజయవాడలో జరిగిన టిడిపి
మహానాడు వేదిక ముందు భాగంలో పైపుల నుంచి నీటి ప్రవాహం లాంటి డిజైన్ ను ఏర్పాటు చేసారు. చూడటానికి అది ప్రవాహంలా
కనిపిస్తుంది. దగ్గరకెళితే అది ప్లాస్టిక్ తో వేసిన సెట్టింగ్ అని అర్థం అవుతుంది. అచ్చు అమరావతి గ్రాఫిక్సు, ప్రాజెక్టుల జిమ్మిక్సు
లాగా. ఇది నదుల అనుసంధానం స్ఫూర్తిగా దీన్ని ఏర్పాటు చేసినట్టు ఆ పార్టీ నేతలు చెప్పుకున్నా,,,వేదిక మీద ఉన్న టిడిపి
నేతలందరి వద్ద నుంచి అవినీతి వరదలై పారుతున్నట్టు అనిపిస్తోందని మహానాడుకు వచ్చిన చాలామంది
వాఖ్యానించారు. ఇక వేదికమీద చంద్రబాబు ఉపన్యాసం చూస్తే స్వోత్కర్ష, పరనింద తప్ప మరోటి లేదు.

నిన్నటిదాకా చెట్టాపట్టాల్
నేడు శిగపట్టుల్

బిజెపితోనే రాష్ట్ర
అభివృద్ధి సాధ్యం అన్నాడు. మోదీ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకు వెళ్తాడు అని ఊదర
గొట్టాడు. మోదీదీ నాదీ ఒకే రకం విజన్ అన్నాడు...ఇప్పుడేమో మోదీ ప్రచార ప్రధాని అంటున్నాడు. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా వంటివి
ఉపయోగం లేనివి అని నాలిక చప్పరిస్తున్నాడు. మరి చంద్రబాబు ఇన్నాళ్లూ అసలు ప్రచారమే లేకుండా ప్రభుత్వాన్ని
నడిపాడా? నీరు - చెట్టు మొదలు జల హారతి వరకూ ప్రతి చిన్న దానికీ ప్రచార ఆర్భాటం తప్ప రాష్ట్రానికి
ఒరగబెట్టిందేం ఉంది? డీ మానిటైజేషన్ మోదీ కినేను చెప్పిన సలహానే అప్పుడు కాలరెగరేసిన బాబు, ఇప్పుడు మోదీ చర్యల
వల్ల బ్యాంకులు దివాళా తీసినాయని నాలిక మడతేస్తున్నాడు.

వెంకన్న జోలికొచ్చిందెవరో?

తిరుపతి వెంకటేశ్వర
స్వామి నగల విషయంలోనూ బాబు ఉలికి పాటు ఆయన ప్రసంగంలో కనిపిస్తుంది. కావాలనే బిజేపీ ప్రధాన
అర్చకుడితో బురద జల్లిస్తోందని అంటాడు చంద్రబాబు. టిటిడి పాలక మండలిలో అన్యమతస్తులను నియమించింది బిజెపి
కాదని, చంద్రబాబు సర్కారే అని ప్రజలు మరచిపోతారని బాబు ఊహ. ఆలయంలో పురాతనమైన వేయి
కాళ్ల మండపాన్ని కూలదోయించిన బాబు వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చిన వాళ్లు నాశనం అయిపోతారని
శపించడం చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. ఆలయ ప్రధాన అర్చకుడు స్వామి వారి సేవల్లో, ఆలయం లో జరుగుతున్న
రహస్య చర్యల పై ప్రశ్నిస్తే, కనీస విచారణ లేకుండా ఆయన్ను విధుల నుంచి తొలగించాడు
చంద్రబాబు. పైగా టిడిపి నేతలు అర్చకునిపై జైల్లో వేసి కుమ్మిస్తామంటూ బెదిరింపులకు సైతం
పాల్పడ్డారు. చంద్రబాబూ, ఆయన పార్టీ నేతలు కలిసిఅన్ని అపచారాలు చేస్తూ స్వామి జోలికి రావద్దని వేరొకరిని
నిందించడం హాస్యాస్పదం.

అన్యాయం గురించి అవినీతి
మాట్లాడుతోంది..!

తెలుగు వారికి అన్యాయం
జరిగిపోయిందని మహానాడు వేదికపై చంద్రబాబు వగచడం వింతలకే పెద్ద వింత. తెలుగు వారి ఆత్మగౌరవ
నినాదమైన ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు. అది అన్యాయం అని బాబుకు
అనిపించడం లేదు. రాష్ట్ర విభజనకు రెండు నాల్కల సిద్ధాంతంతో సహకరించిన తన దిక్కుమాలిన వైఖరి
అన్యాయంగా బాబుకు నేటికీ తోచడంలేదు. పార్లమెంటు తలుపులు మూసి, ప్రజాస్వామ్యాన్ని చీకట్లో
ఖూనీ చేసిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం తాను వెంపర్లాడటం అన్యాయం అని చంద్రబాబు
భావించడం లేదు. ఇక ఆయన బాధల్లా ఇచ్చిన నిధులకు కేంద్రం లెక్కలు అడగుతోందనే. కేంద్రం ఇష్టం వచ్చినట్టు
ఖర్చులు చేస్తోందని, రాష్ట్రంలో తన విలాసాలను, దోపిడీని ప్రశ్నిస్తోందని బాబు తన అక్కసు వెళ్లగక్కుకున్నారు.  సీబీఐ, ఈడిలను ప్రత్యర్థులను నిర్వీర్యం చేయడానికి ఉపయోగిస్తోందని
వాపోతున్నారు. ఇదే చంద్రబాబు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ పై దొంగ కేసులు బనాయించడంలో, విచారణ జరపకుండానే ఏడాదికి
పైగా జైల్లో ఉంచడంలో అదే విచారణ సంస్థలను వాడుకోవడాన్ని అన్యాయం అని మాత్రం అనలేక పోయాడు. నాడు వైఎస్ జగన్ చట్టం
మీద నమ్మకంతో, సహనంతో తనపై మోపిన నేరాలను అబద్ధాలని రుజువు చేసుకుంటున్నారు. కానీ ముఖ్యమంత్రి స్థానంలో
ఉండి ఎమ్మెల్యేలను కొని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి కూడా స్టేలు
తెచ్చుకుని, విచారణకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు చంద్రబాబు. ఇక రాష్ట్రానికి ప్రత్యేక
హోదా రాకపోవడానికి, విభజన హమీలను కేంద్రం నిర్లక్ష్యం చేయడానికి, పోలవరం జాప్యానికి, పట్టిసీమ కమీషన్లకి
కారణమైన చంద్రబాబు తెలుగు వారికి చేసిన అన్యాయం ఎన్ని తరాలకూ మరిచిపోలేనిది. అన్యాయానికి, అక్రమానికి, అవినీతికీ ఆధార్ కార్డ్
వంటి చంద్రబాబు తెలుగువారికి జరిగే అన్యాయం గురించి మాట్లాడటం విడ్డూరాలకే విడ్డూరం.

నరం లేని నాలుక

ఖచ్చితంగా బాబు నాలుకకు
నరం లేదనేద అనిపిస్తుంది జగన్ గురించి బాబు మాట్లాడిన మాటలు వింటే. ప్రత్యేక హోదా కావాలని
మోదీని అడగడానికి వైఎస్ జగన్ కు భయం అంటాడీయన. మోదీ దగ్గర హోదా పేరు ఎత్తడానికి భయం ఎవరికో, నిన్నటిదాకా ప్యాకేజీ
భళి భళి అంటూ లడ్డూలు పంచిందెవరో, వెంకయ్యనాయుడికి ప్యాకేజీ బావుందని సన్మానం చేసిందెవరో
తెలుగు ప్రజలు మరిచిపోలేదు. 29 సార్లు దిల్లీకి వెళ్లి ఒక్కసారి గూడా రాష్ట్ర ప్రయోజనాల
గురించి చంద్రబాబు అడగలేదని కేంద్రంలోని మంత్రులు చెబుతున్నారు. ఇక ప్రత్యేక హోదా గురించి
ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రధానిని, ఇతర ప్రముఖులను కలిసింది కేవలం వైఎస్ జగన్ మాత్రమే. అలాగే హోదా కోసం ఏళ్లుగా
పోరాటం చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. హోదా కోసమే కేంద్రంలో
ఎన్డీయే సర్కార్ పై అవిశ్వాసానికి వెళ్లింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వాన్ని కూడా
వచ్చి చేయి కలపమంది. ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి కేంద్రంతో పోరాటం చేద్దామని ఆహ్వానించింది. కానీ మోదీతో ఉన్న లాలూచే
వల్లే బాబు నేను అవిశ్వాసం పెడతా అంటూ పార్లమెంటులో నాటకాలు ఆడాడు. ప్రతిపక్ష పార్టీ ఎమ్.పిలు రాజీనామాలు చేసి, హోదా కోసం ఆమరణ దీక్ష
చేస్తుంటే ఈయన, ఈయన ఎమ్.పిలు వేషాలు కట్టి, డ్రామాలు నడిపించారు. కనీసం మోదీ ముందుకు
వెళ్లి నిరసన తెలపలేక పోయారు. అధికారంలో ఉండి, కేంద్రంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు
సర్కార్, హోదాను సాధించాల్సింది పోయి, ప్రతిపక్ష నేత ప్రధానిని హోదా అడగడం లేదనడం ఏ తరహా
రాజ్యాంగ నియమమో ఆయనకే తెలియాలి? శశికళకు పట్టిన గతే అంటూ ప్రతిపక్ష నేతపై నోరు పారేసుకుంటున్నాడు
చంద్రబాబు. ఒక పక్క బిజెపితో వైఎస్ జగన్ పొత్తు అని అబద్ధాలు ప్రచారం చేస్తూ, మరో పక్క మోదీని చూస్తే
జగన్ కు భయం అంటాడు. పరస్పర విరుద్ధమైన వాఖ్యలు, నిలకడలేని మాటలు చంద్రబాబుకు రాజకీయ పుట్టుక మొదలైనప్పటి
నుంచి అలవాటే.

మొత్తంగా మహానాడు అంతా
ఓ మిథ్య. బాబు మతలబులు, గారడీ విద్యలకు మరో వేదిక. తన నేరాలనుపక్కవారిపైకి నెట్టి, తన తప్పులను వేరొకరి
మెడకు చుట్టి, తానో అభినవ నాయక అవతారం అని చెప్పుకున్నాడు చంద్రబాబు. రాష్ట్రానికి జరిగిన
నష్టంలో తన పాత్రేం లేదని పదే పదే వాదించుకున్నాడు. ఎన్ని చేసినా, ఎంత చెప్పినా చంద్రబాబును మరోసారి గుడ్డిగా నమ్మే ప్రసక్తే
లేదని ప్రజలు తేల్చి చెబుతున్నారు. ఆంధ్రా తెలంగాణాలో బాబుకు ఉన్న 70 లక్షల సైన్యం తిరగబడే
రోజు దగ్గర్లోనే ఉంది.  Back to Top