మహానేత తనయకు 'పుట్టగుంట' నీరాజనం

నందివాడ, 10 ఏప్రిల్ 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ పదేళ్ల క్రితం ఇదే రోజున ప్రజా ప్రస్థానం పాదయాత్ర మొదలుపెట్టినరోజే ఆయన తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర తమ ప్రాంతానికి రావడంతో నందివాడ మండల ప్రజలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయారు. ఆమె రాకతో పుట్టగుంట పులకించింది. పుట్టగుంట వంతెన వద్ద చేదుర్తిపాడు, ఒద్దులమెరక, పుట్టగుంట గ్రామాలకు చెందిన ప్రజలు ఘనస్వాగతం పలికారు.

పుట్టగుంట వద్ద ఏర్పాటు చేసిన వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రీమతి షర్మిల నివాళులర్పించారు. అనంతరం మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రజాప్రస్థానం ప్రారంభించిన రోజు కావటంతో  అభిమానులు ఏర్పాటుచేసిన కేక్ కట్ చేశారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభమై పదేళ్లు గడిచిన గుర్తుగా శ్రీమతి షర్మిల మొక్కలు నాటారు.  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి  నిర్వహిస్తున్న మరో ప్రజాప్రస్థానం మంగళవారం నందివాడ సత్రం నుంచి పునఃప్రారంభమైంది.

మధ్యాహ్నం ఒంటిగంటకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న శ్రీమతి షర్మిల కారులో నేరుగా నందివాడ సత్రం వద్దకు వచ్చారు. సాయంత్రం 4.30 గంటలకు పాదయాత్రను ప్రారంభించారు. పుట్టగుంటలో జరిగిన రచ్చబండలో ఆమె పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.

యజ్ఞంలా నాటి పాదయాత్ర..
పదేళ్ల క్రితం ఇదే రోజున దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రను  శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. ఆనాడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో మండుటెండలో కూడా ఒక యజ్ఞంలా యాత్ర చేశారని ఆమె చెప్పారు. ఆత్మహత్య చేసుకుంటున్న రైతులకు మంచిరోజులు వస్తాయనే భరోసా ఇవ్వడానికే పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. ఒక సుదీర్ఘ పాదయాత్ర మండుటెండను లెక్క చేయకుండా రోజుకు 25 కిలోమీటర్ల మేర సాగడమే కాక, ప్రజల కష్టాలను గుర్తుపెట్టుకుని తాను అధికారంలోకి వచ్చాక అన్ని రంగాల ప్రజలను ఆదుకున్న ఘనత వైయస్‌కే దక్కుతుందన్నారు. మళ్లీ ప్రజారంజకమైన పాలన సాగాలంటే, రాజన్న రాజ్యం రావాలంటే శ్రీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుచేశారు.

కరెంటు లేకున్నా.. రెట్టింపు బిల్లులు..
కరెంటు లేకపోయినా బిల్లులు మాత్రం మూడు నాలుగురెట్లు పెరిగిపోయాయని రచ్చబండలో మహిళలు శ్రీమతి షర్మిల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పావలా వడ్డీ అని చెప్పి ప్రభుత్వం తమను మోసం చేస్తోందని, పింఛన్లు ఆలస్యమవుతున్నాయని, గ్రామాల్లో బెల్టుషాపులు తీయించి తమ కాపురాలు నిలబెట్టాలని కోరారు. త్వరలోనే అందరికి మంచిరోజులు వస్తాయని, జగనన్న సీఎం అయితే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని షర్మిల గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. నాడు చంద్రబాబు పాలనలో ప్రజలు పడిన కష్టాలే ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో పడుతున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు పాలన ఎంత దుర్మార్గంగా ఉందో కిరణ్‌కుమార్ రెడ్డి పాలన అలానే ఉందన్నారు. మీ అందరి ఆశీస్సులతో జగనన్న సీఎం అవుతారని ఆమె భరోసా ఇచ్చి ముందుకు సాగారు. అనంతరం పెదలింగాల, చినలింగాల మీదుగా యాత్రను కొనసాగించారు. అరిపిరాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కాజ రంగారావుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శివయ్యపాకల వద్ద యాత్ర ముగిసింది.

Back to Top