మహానేత తలపులు.. వారిలో సజీవం

కారంపూడి 27 ఫిబ్రవరి 2013:

శ్రీమతి షర్మిల బస చేసిన ప్రాంత నుంచి మంగళవారం జరిగిన పాదయాత్రను చక్రాలబండిపై ఓ విగలాంగుడు అనుసరించాడు. రెడ్డిపాలేనికి చెందిన మేకపోతు హనిమిరెడ్డి తన ఇద్దరు సహాయకులతో పాదయాత్రలో పాల్గొన్నాడు. అతనికి పోలియో కారణంగా రెండు కాళ్లు చచ్చుపడిపోయాయి. ఇంటర్ వరకు చదువుకున్న తాను రాజీవ్ యువశక్తి పథకం కింద రుణం తీసుకొని చిన్న ఎలక్ట్రికల్ దుకాణం పెట్టుకున్నట్లు తెలిపాడు. వికలాంగుల పింఛను కూడా మంజూరైందన్నారు. వైయస్ఆర్‌పై అభిమానంతో షర్మిల పాదయాత్రలో తాను పాల్గొంటున్నానని హనిమిరెడ్డి తెలిపాడు.

తొలి అడుగు నుంచీ తోడుగా..
      విశ్రాంతి తీసుకునే వయసులో ఆ వృద్ధ దంపతులు మహానేత వైయస్ఆర్‌పై ఉన్న అభిమానంతో  శ్రీమతి షర్మిల పాదయాత్రలో పాల్గొంటున్నారు.  మరో ప్రజాప్రస్థానం ప్రారంభమైన ఇడుపులపాయ నుంచి షర్మిల వెంట అలుపెరగని పాదచారుల్లా నడుస్తున్నారు. వైయస్ఆర్ జిల్లా దుండూరు మండలం గంగనపల్లెకి చెందిన 82 ఏళ్ల కల్లంకుంట్ల సాంబశివారెడ్డి, ఆయన భార్య గంగమ్మ కారంపూడి మండలంలో పాదయాత్రలో సైతం మండుటెండను లెక్కచేయకుండా శ్రీమతి షర్మిలను అనుసరించారు.

ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ ఆమె వెంటే
     దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్‌ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల వల్ల లబ్ధి పొందిన పలువురు ఆ అభిమానంతో శ్రీమతి షర్మిల పాదయాత్ర చేపట్టినప్పటి నుంచి ఆమె వెంటే నడుస్తున్నారు. వైయస్ఆర్ జిల్లాకు చెందిన ఎం. గంగిరెడ్డి, మాదిగ మహాజన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కత్తిరాజు, అనంతపురం జిల్లాకు చెందిన వాల్మీకి శంకర్, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎం. మంగమ్మతో పాటు మరో 20 మంది పాదయాత్రలో పాల్గొంటూ కారంపూడికి చేరుకున్నారు.  శ్రీమతి షర్మిలతో ఇచ్ఛాపురం వరకు పాదయాత్రలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకుంటామని వారు తెలిపారు.

పరుగు పరుగున వచ్చి..
     తమ అభిమాన నాయకుడి కుమార్తె శ్రీమతి షర్మిల చినకొదమగుండ్ల గ్రామానికి వచ్చిందనే విషయం తెలుసుకుని చూసేందుకు మహిళలు పొలాల్లో ఉన్న రాళ్లు, ముళ్ల కంపలను లెక్క చేయక పరుగు పరుగున వచ్చారు. వారికి శ్రీమతి షర్మిల అభివాదం చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ
జెండాలు శ్రీమతి షర్మిల పాదయాత్రలో ఆకట్టుకున్నాయి. వాటిని చేతబూని
ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అభిమానులు సందడి చేశారు.

Back to Top