మహానేత, బాబు మధ్య తేడా ఇదీ!

హాలియా:

పాదయాత్ర చేసే వ్యక్తికి విశ్వసనీయత, చిత్తశుద్ధి, నిజాయితీ ఉండాలని దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల పేర్కొన్నారు. నల్గొండ జిల్లా హాలియాలో గురువారం సాయంత్రం ఏర్పాటైన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. మహానేత చేపట్టిన పాదయాత్రకు ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న పాదయాత్రకూ మధ్య తేడాలను ఆమె విశ్లేషించారు. మహానేత వైయస్ఆర్ ఒక యజ్ఞంలా పాదయాత్రను పూర్తిచేశారన్నారు. అదే చంద్రబాబు ఎన్నికల రోజున తనను గుర్తుచేసుకోవాలంటూ ప్రజలను వేడుకుంటున్నారన్నారు. ఆమె ప్రసంగిస్తున్నంతసేపూ సభకు హాజరైన జనం జయజయధ్వానాలతో ప్రతిస్పందించారు.
పాదయాత్ర అంటే నడక పందెం కాదన్నప్పుడు సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది.  అదో మహాయజ్ఞమన్నారు.   ఎంతదూరం నడిచామన్నది కాదు.. ఈ క్రతువు ద్వారా ఎంత మందికి నమ్మకం కల్పించాం.. ఎన్ని ప్రజా సమస్యలను చూసి అర్థం చేసుకోగలిగాం.. ఎంత మందికి భవిష్యత్తుపై భరోసా కల్పించామన్నదే ముఖ్యమని శ్రీమతి షర్మిల అన్నప్పుడు జనసందోహం జై వైయస్ఆర్, జైజై జగన్ అనే నినాదాలు మిన్నంటాయి. 'టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2వేల కిలో మీటర్ల పాదయాత్ర చేశారట.. కేకులు కట్‌చేసుకొని సంబరాలు చేసుకున్నారు.  ఆయన జపం చేసే మీడియా అంతా చంద్రబాబు రికార్డు సృష్టించారని చాలా ప్రచారం చేసింది. పాదయాత్ర అంటే ఒక నడక పందెం కాదని వారి బ్యాచ్‌కు అర్థం కావడం లేదు. మహానేత తన పాదయాత్రను  ఓ యజ్ఞంలా చేశారు. ఇప్పుడు బాబు పాదయాత్రలో ఒక మాట అంటున్నారు. ఎన్నికల ముందు తనను జ్ఞాపకం ఉంచుకోవాలంటున్నారు. ఆ ఒక్క మాటతోనే అర్థమవుతోంది. ఈ పాదయాత్ర తను ఎవరి కోసం చేస్తున్నారో’ అంటూ శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డిని అక్రమ కేసులతో నిర్బంధించడాన్ని నిరసిస్తూ ప్రజలు నల్ల బ్యాడ్జీలు ధరించి రావడం కనిపించింది.
     పాదయాత్రలో చంద్రబాబు చాలా వాగ్దానాలు చేస్తున్నారు. రుణమాఫీ చేస్తారట... 9 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తారట.. ఇంకా చాలా చెప్తున్నారు.  తను అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ఏమీ చేయబుద్ధికాదు. రుణమాఫీ చేసే ఆలోచన మీకు ఉంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ఆలోచన చేయలేదు చంద్రబాబూ? అంటూ శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. ఉచిత విద్యుత్తు ఇస్తానని మహానేత చెప్పినపుడు హేళన చేసి మాట్లాడిన సందర్భమూ,  కరెంటు తీగలు చూపిస్తూ అవి దుస్తులు ఆరేసుకోవడానికి పనికి వస్తాయని ఎగతాళి చేసిన విషయమూ మీకు గుర్తులేవా చంద్రబాబూ అంటూ నిలదీశారు.   వ్యవసాయమే దండగనీ, ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని అన్న రికార్డు చంద్రబాబుకే సొంతమన్నారు. కరెంటు బిల్లుల వసూళ్ల కోసం ప్రత్యేక పోలీసు స్టేషన్లు పెట్టి రైతులను నానా హింసలు పెట్టి 4 వేల మంది రైతులను పొట్టనబెట్టుకున్న రికార్డు కూడా ఆయనదేనని గుర్తుచేశారు. ఒక ముఖ్యమంత్రిగానే కాదు.. పాలక పక్షంతో కలిసి కుమ్మక్కయిన ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయనకు రికార్డు ఉందని శ్రీమతి షర్మిల చెప్పారు.
చంద్రబాబు ఒక్క ‘సాక్షి’ మీదనే కాదు.. నాన్న మీద, జగనన్న మీద చిరాకు పడి చాలా నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అలా మాట్లాడేటప్పుడు ఉచ్చనీచాల గురించి ఆలోచించటం లేదు. సంస్కారం మరిచి మాట్లాడుతున్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేస్తున్న నీచ వ్యాఖ్యలు చూసి ప్రజలే కాదు, రాజకీయ విశ్లేషకులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారని శ్రీమతి షర్మిల చెప్పారు.

Back to Top