మదనపల్లి డివిజన్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌దే

మదనపల్లె:

మదనపల్లె డివిజన్ పరిధిలో తొలి విడత సహకార సంఘాల ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ మద్దతుదారులే అత్యధిక స్థ్ధానాల్లో విజయం సాధించారు. మొత్తం 25 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. 11 సహకార సంఘాలకు వైయస్ఆర్ సీపీ మద్దతుదారులు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 7 సహకార సంఘాల్లో కాంగ్రెస్, మరో ఏడింటిలో టీడీపీ మద్దతుదారులు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని (పెద్దతిప్పసముద్రం) పీటీఎం అధ్యక్ష ఎన్నికలు జరిగినట్లు మొదట ఎన్నికల అధికారి ప్రకటించినా తరువాత వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. రొంపిచెర్ల, కలకడ సంఘాల్లోని ఉపాధ్యక్ష ఎన్నికలు వాయిదా వేసినట్లు డివిజనల్ కోపరేటివ్ అధికారి వెంకటరమణ తెలిపారు. డివిజన్‌లో మొత్తం 33 సహకార సంఘాలు ఉండగా, ఇందులో బెరైడ్డిపల్లె, బయ్యప్పగారిపల్లె, ములకలచెరువు, చిన్నగొట్టిగల్లు, ఎర్రవారిపాళెం, పుంగనూరు, సదుం (7 సంఘాలు) ఎన్నికలను ప్రభుత్వం ముందుగానే వాయిదా వేసింది. 26 సహకార సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది. వీటిలో కలిచెర్ల, కలికిరి, పీలేరు, కేవీ పల్లె సహకార సంఘాలకు డెరైక్టర్ల స్థానాలు ఏకగ్రీవంకాగా, మిగిలిన సహకార సంఘాల డెరైక్టర్ల స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించారు. ఈ సంఘాల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉండగా, ఒక సంఘానికి అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు, మరో మూడు చోట్ల ఉపాధ్యక్ష ఎన్నికలు జరగలేదు.

Back to Top