అబలలపై అధికార పార్టీ నేతల అరాచకాలుసీఎం నుంచి గల్లీ లీడర్ దాకా అందరిది అదే పరిస్థితిప్రశ్నిస్తే పబ్లిక్‌గా అవమానంచట్ట సభల్లోనూ కొనసాగుతున్న వేధింపుల పర్వంఎదురు తిరిగితే తప్పుడు కేసులుటీడీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువు ఆడది కనిపిస్తే చేతులెత్తి నమస్కరించే తెలుగు సంస్కృతికి తెగులు పుట్టిస్తున్నారు. ఆది పరాశక్తిగా పూజించిన మహిళలను అవమానానికి గురిచేస్తున్నారు. అండగా ఉండాల్సిన అధికార పార్టీ నేతలే అరాచకాలకు పాల్పడుతున్నారు. పురాణేతిహాసాల నుంచి మహిళలకు ఇస్తున్న స్థానానికి టీడీపీ పాలనలో కాలం చెల్లిపోయింది. ‘‘యత్ర నార్యంత పూజ్యతే రమంతే తత్ర దేవతః’’ ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు.. అనే సంస్కృతి నానుడిని ఈ చంద్రబాబు ఎప్పుడో ఊరు దాటించారు. అమ్మ కూడా ఓ ఆడదే అన్న కనీస నీతి మరిచి మదమెక్కిన ఆంబోతుల్లా ప్రవర్తిస్తున్న వారి తీరు మహాభారతంలో కీచక, దుశ్శాసన పర్వాన్ని తలపిస్తుంది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, నాయకులు, మంత్రులు.. వారి పిల్లల దెబ్బకి రాష్ట్రంలో మహిళలు నోరెత్తడానికే భయపడుతున్నారు. ఒంటరిగా బయటకు రావాలంటే ఏ టీడీపీ కుక్క కరిచేస్తుందోనని భయపడి చస్తున్నారు. చిత్తకార్తె కుక్కల్లా పిచ్చి పట్టినట్టు ముందూ వెనకా చూసుకోకుండా మొరుగుతుంటే కన్నీళ్లు పెట్టుకుంటూ వణికిపోతున్నారు. మంత్రుల తనయులు రోడ్ల వెంట అమ్మాయిలను కార్లోకి లాగుతూ జనంతో తన్నులు తిన్నా బుద్ధి మార్చుకోవడం లేదు. ముఖ్యమంత్రి నుంచి గల్లీలో టీడీపీ కార్యకర్త వరకు మహిళా జాతినే లేకుండా చేయాలన్నంత కసిగా రోజురోజుకు రెచ్చిపోతున్నారు.
దేశంలో మహిళలపై ఎక్కడ దాడి జరిగినా పచ్చ మీడియా ముందుకొచ్చి ఏదో ఉద్ధరింపు మాటలు చెప్పే చంద్రబాబే ఈ అరాచకాలకు అసలు ఆద్యుడు. పైకి నంగనాచి మాటలు చెప్పి పచ్చ పత్రికల్లో మొదటి పేజీల్లో వార్తలు రాయించుకోవడంతోనే సరిపెట్టే ఈ వృద్ధ జంబూకం అంతకంటే మహిళలకు ఉద్దరించిందేమీ లేదు. మహిళలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చెయ్యడం బాబుకు ఆది నుంచీ అలవాటే. రాజకీయాల్లో అడుగుపెట్టిన నాటి నుంచీ ఏ పని చేయించుకోవాలన్నా మహిళలను పావులుగా ఎర వేసేవాడనేది బహిరంగ రహస్యం.
అధికారం కోసం ఎంతకైనా..అడ్డదారిలో అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు. 2014 ఎన్నికల సందర్భంగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల కోసం మహిళలతో అర్ధనగ్న నృత్యాలు చేయించాడు. దానికి బాబు వివరణ కూడా ఇచ్చుకున్నాడు. నేను డ్యాన్సులు వేయించింది తెలుగు అమ్మాయిలతో కాదు.. కర్నాటక మహిళలతో అని.. చెప్పుకున్నాడు. ఇదంతా నిజమయ్యేలా ఇప్పుడు చంద్రబాబు విశాఖలో బికినీ ఫెస్టివల్‌కు శ్రీకారం చుట్టాడు. మహిళల శరీరాలతో వ్యాపారం చేయడానికి కూడా సిద్ధమయ్యాడు. దగ్గరుండి టెంట్‌లు వేసి నీచ కార్యక్రమానికి విశాఖను సిద్ధం చేస్తున్నాడు. మహిళల మానప్రాణాలతో పైసలు సంపాదించడానికి ఈ అపర మేధావి పూనుకున్నాడు. విశాఖను అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కిస్తానని చెప్పినప్పుడు ఏం చేస్తాడోనని విశాఖ వాసులంతా ఎదురుచూశారు. కానీ, ఇలా బికినీ ఫెస్టివల్ చేసి తమ పరువును తీస్తాడనుకోలేదని మండిపడుతున్నారు. మహిళాసంఘాలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు ఎవరు వద్దన్నా వినకుండా బీచ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతామని బాబు భీష్మించడంపై ఆగ్రహ జ్వాలలు పెల్లుబికుతున్నాయి.
సెక్స్ రాకెట్‌లో తెలుగు తమ్ముళ్లు..విజయవాడలో వెలుగుచూసిన సెక్స్‌రాకెట్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. మహిళల అవసరాలను ఆసరాగా చేసుకని అధిక వడ్డీలకు డబ్బులిచ్చి టీడీపీ ఎమ్మెల్యేలు వారి మాన ప్రాణాలతో వికృత క్రీడ ఆడుకున్నారు. అయినా నిందితుల మీద బాబు ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.. ఎందుకంటే ఆ కేసుల్లో ఇరుక్కుంది టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కావడమే. టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు నగరం నడిబొడ్డున మహిళ జీవితాలను నాశనం చేసినా వారిపై ఎలాంటి కేసులు, అరెస్ట్ లు లేకపోవడం దారుణం.
ఎక్కడా రక్షణ లేదుబాబు రెండున్నరేళ్ల పాలనలో విద్యార్థినులకు, ఉద్యోగులకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఏఎన్‌యూలో ర్యాగింగ్‌కు బలై పోయిన రిషితేశ్వరి, గుంటూరులో ప్రొఫెసర్ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న మెడికోల మరణాలు చూసినా బాబు గుండె కరగలేదు. పైగా వారిని రక్షించే ప్రయత్నం చేసి కేసును నానాబెట్టి తనదైన శైలిలో నీరుగార్చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనని ప్రభాకర్ ఇసుక మాఫియా అరాచకాలను అడ్డుకున్న తహశీల్దార్ వనజాక్షిని దారుణంగా ఇసుకలో ఈడ్చి పడేసి కొట్టారు. ఇంత జరిగినా చింతమనేనిపై ఎలాంటి చర్యలు లేవు. పైగా కేసును వెనక్కి తీసుకోవాలని సాక్షాత్తు ముఖ్యమంత్రే అధికారిణిని బెదిరించడం బాధాకరం. గతంలోనూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యూష అనే సినిమా హీరోయిన్ టీడీపీ నాయకుల కుమారుల పాశవిక లైంగిక దాడిలో చనిపోతే చంద్రబాబు వారిని తప్పించేందుకు చేసిన ప్రయత్నాలు తెలుగు ప్రజలను కన్నీళ్లు పెట్టించాయి.
సొంత పార్టీలో బతకలేక...సొంత పార్టీలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మాచర్లకు చెందిన టీడీపీ నాయకురాలు శ్రీదేవి అనే మహిళా మున్సిపల్ చైర్‌పర్సన్ పార్టీ నాయకుల వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. ప్రశాంతంగా అమెరికాలో ఉండి బాగా ఉన్నతంగా స్థిరపడిన కుటుంబాన్ని రాజకీయాల పేరుతో దేశానికి రప్పించి కోట్లు ఖర్చు చేయించారు. తీరా గెలిచిన తర్వాత పదవే లేకుండా చేద్దామని చేసిన కుట్రలకు దంపతులిద్దరూ బలయ్యారు. ఒత్తిడిని తట్టుకోలేక భర్త అనారోగ్యంతో మరణిస్తే వేధింపులతో శ్రీదేవి ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ తీవ్రంగా కలచివేసింది. తమ కులానికే చెందిన వ్యక్తిని జడ్పీ చైర్మెన్‌ను చేయాలనే కుట్రతో వైశ్య కులానికి చెందిన ఆమెను వేధించడంతో న్యాయం చేయాలని లోకేష్‌ను ఆశ్రయించింది. అయితే అక్కడా తనకు మద్దతు దొరక్కపోవడంతో ఆత్మహత్యే శరణ్యమని తనువు చాలించింది.
పోరాడితే హత్యాయత్నం కేసులుపశ్చిమగోదావరి జిల్లా తుంద్రురులో ఏర్పాటు చేస్తున్న మెగా ఆక్వా ఫుడ్ పార్కు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పోరాడిన సత్యవతి అనే మహిళపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసులు బనాయించి దాదాపు ఇరవై రోజులకు పైగా జైలుకు పంపించి మహిళలపై ఉన్న గౌరవాన్ని చంద్రబాబు బాగానే బయట పెట్టుకున్నారు. ఆమెతోపాటు ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ఉద్యమంలో పాల్గొన్న చాలా మంది మహిళలను కేసుల పేరుతో కోర్టుల చుట్టూ తిప్పుతూ మనశ్శాంతి లేకుండా చేసి పచ్చ మదం ప్రదర్శించారు.
అత్యాచారం కేసుల్లో ఇద్దరు మంత్రులు మహిళలపై అత్యాచారం చేసిన మంత్రులు దేశవ్యాప్తంగా నలుగురు ఇప్పటికీ మంత్రులుగా కొనసాగుతున్నారని ఢిల్లీకి చెందిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రకటించింది. వారిలో ఇద్దరు మన రాష్ట్రానికి చెందిన మంత్రులు ఉన్నారని పేర్కొన్నా చంద్రబాబు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా వారిద్దరికీ కీలక మంత్రి పదవులిచ్చి సత్కరించాడు. వారిద్దరూ ఎవరో కాదు.. అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ. అంతేనా ఇసుక రీచ్‌లను అడ్డుకుందని తహశీల్దార్ వనజాక్షిని జుట్టు పట్టి ఈడ్చిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు పనితీరు మదింపులో చంద్రబాబు మొదటి ర్యాంకు కట్టబెట్టి మహిళలపై అరాచకాలను మరింత ప్రోత్సహించాడు. వారితోపాటు మంత్రి రావెల కిషోర్ బాబు ఆ మధ్య రోడ్డుపై వెళ్తున్న మహిళను మద్యం మత్తులో కారులోకి లాగేందుకు ప్రయత్నించి తన్నులు తిన్నాడు. ఈ విషయం సీసీ టీవీ కెమెరాల్లో చిక్కినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతేనా స్వయానా బాబు బావమరిది.. నందమూరి నటసింహం, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ స్థాయి మరిచి ఓ చిత్రం ఆడియో వేడుకలో మహిళలను కించపరుస్తూ రేపులు చేయాలని మాట్లాడినా వివరణ అడిగిన పాపాన పోలేదు. చంద్రబాబు తనయుడు లోకేష్ విదేశీ వనితలతో మద్యం మత్తులో స్విమ్మింగ్ ఫూల్‌లో జలకాలాడుతూ అర్ధనగ్నంగా కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం రాష్ట్రమంతా పెద్ద సంచలనమే అయ్యింది.
చట్టసభల్లోనూ బెదిరింపులు.. దాడులుప్రజాస్వామ్యంలో ఓటుతో గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టిన మహిళలకు కూడా రక్షణ లేకుండా పోయింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎదుటే వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజాను తీవ్రమైన పదజాలంతో దూషించిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా చివరకు ఆమెనే సంవత్సరం పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి మహిళా జాతికి రాష్ట్రంలో చోటు లేదని రుజువు చేశాడు. తాజాగా జనచైతన్య యాత్రల్లో భాగంగా విశాఖలో జరిగిన కార్యక్రమంలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన సెల్ టవర్‌ను తొలగించాలని కోరినందుకు వరలక్ష్మి అనే మహిళపై మైకు విసిరి ఆగ్రహం వెల్లగక్కాడు. నన్నే ప్రశ్నిస్తావా.. ఇక్కడ్నుంచి పోతావా లేదా అంటూ చెలిరేగిపోయాడు. రెండు రోజుల క్రితం రాజమండ్రి నగరంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య బాధితులను కించపరిచేలా మాట్లాడటంతో వారు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కన్నీరు తుడవాల్సిన అధికార పార్టీ నేతలు కన్నీరు పెట్టిస్తున్న తీరు బాధాకరం. ఎన్నికల ముందు మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తామన్న చంద్రబాబు మాట తప్పారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని మోసం చేశారు. ఇలా అడుగడుగునా అబలలను దగా చేస్తున్న టీడీపీ నేతలకు మహిళలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.