లోకేష్ శాఖలో లోపాల సమీక్ష


టిడిపి పాలనలో అభివృద్ధి పరుగులు అని చెప్పుకున్నారు. నాలుగేళ్లుగా నత్తనడకన కూడా అభివృద్ధి సాగడం లేదని వాస్తవాలు ఘోషిస్తున్నాయి. కనీసం మౌలిక వసతుల విషయంలోనూ గణనీయ అభివృద్ధి కనిపించకపోవడం సిగ్గుపడాల్సిన విషయం. ముఖ్యమంత్రిగారి తనయుడే స్వయంగా మంత్రిగా ఉన్న పంచాయితీ రాజ్ శాఖ పనితీరు ఎంత అధ్వాన్నంగా ఉందంటే ఒక్క సంక్షేమ కార్యక్రమం పూర్తి స్థాయిలో పూర్తి కావడానికి మరో నాలుగేళ్లు పడుతుందట. ఎపిలో వాటర్ గ్రిడ్ పథకం 2022 నాటికి కానీ పూర్తి కాదని అధికారులు తేల్చి చెప్పేసారు.  పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశంలో  ఈ విషయం వెల్లడైంది. 
నారా లోకేష్ కి ఇటీవలో ఓ అవార్డు వచ్చింది. గ్రామీణాభివృద్ధి శాఖలో ఆయన చేసిన సేవలకు గాను ఈ అవార్డు వరించిందట. కానీ ఈ శాఖ పనితీరు పై సమీక్ష చేస్తే మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ పథకాలన్నిటినీ అమలు చేస్తున్నట్టు మభ్య పెట్టేందుకు చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. అటు కేంద్ర పథకాలు కానీ, ఇటు రాష్ట్ర పథకాలుగానీ ఏ ఒక్కటీ పూర్తి స్థాయిలో అమలౌతున్నదాఖలాలు లేవు. అధికార పార్టీ నేతలు చెప్పినవారికి, సూచించిన వ్యక్తులకే పథకాలు అందుతున్నాయని, పైరవీలు సాగుతున్నాయనీ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం ఈ విషయంలో ఏ చర్యలూ తీసుకోడం లేదు. జన్మభూమి కమిటీల ఆగడాలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వాటిని రద్దు చేసిన చంద్రబాబు, తెలుగు తమ్ముళ్ల ఆగడాలను మాత్రం అరికట్టడం లేదు. ఇష్టారాజ్యంగా స్థానిక నాయకులు వ్యవహరించడానికి పార్టీ అధినేత అండదండలే కారణం అని తెలుస్తూనే ఉంది. 
పేదలకు ఇళ్లు, అన్న క్యాంటీన్లు, ఎన్టీఆర్ సుజల స్రవంతి మొదలైన పథకాలన్నీ పడకేసాయి. ప్రచారానికి చూపిన శ్రద్ధ పథకాల అమలుపై చూపిందే లేదు. తల్లీబిడ్డ ఆఎక్స్ ప్రెస్ అనీ, సంచార ఆసుపత్రులనీ చెప్పిన బాబు అవి మూన్నాళ్ల తర్వాత మూలన పడ్డ విషయాన్ని మాత్రం ప్రస్తావించడు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, పారిశుధ్యం, మరుగుదొడ్లు, డ్రైనేజీ, తాగునీరు, ఉపాధి వంటి అన్ని అంశాల్లోనూ వెనకబాటుతనమే కనిపిస్తోంది. మేమొచ్చాకే వీధిలైట్లు వేసామంటూ జబ్బలు చరుచుకుంటున్న లోకేష్ రాష్ట్రంలోని 75శాతం గ్రామాల్లో ప్రజలు రక్షిత తాగునీరు లేక విలవిల్లాడటం గురించి కనీసం పట్టించుకోరు. నీతి ఆయోగ్ రాష్ట్రంలోని గ్రామాల దుస్థితిని తన నివేదిక ద్వారా బయటపెట్టింది. 









 
Back to Top